Spirit: యానిమల్ బ్యూటీతో మరోసారి సందీప్ రెడ్డి
ABN , Publish Date - May 24 , 2025 | 06:48 PM
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు సూపర్ అప్ డేట్ ఇచ్చేశాడు. 'స్పిరిట్' మూవీలో 'యానిమల్' ఫేమ్ త్రిప్తి డిమ్రీని హీరోయిన్ గా ఫైనల్ చేసినట్టు ప్రకటించాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) 'స్పిరిట్' (Spirit) మూవీకి సంబంధించిన మరో సూపర్ అప్ డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిప్తీ డిమ్రీ (Tripti Dimri) ని ఖరారు చేసినట్టు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తెలిపారు. నిజానికి హీరోయిన్ ఎవరనే దానికంటే కూడా ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా సెట్స్ పైకి ఎప్పుడు వెళుతుందా అనే దాని గురించి ఎక్కువ బెంగపడుతున్నారు.
గత కొంతకాలంగా ప్రభాస్ సినిమాల మేకింగ్ లో ఊహించని జాప్యం జరుగుతోంది. గతంలో కొన్ని సినిమాలు బడ్జెట్ పరంగానూ, స్టోరీ స్పాన్ కారణంగానూ లేట్ అయ్యాయి. అయితే అది ఆ తర్వాత ఆనవాయితీగా మారిపోయింది. ఏ సినిమా షెడ్యూల్ కూడా అనుకున్న విధంగా జరగడం లేదు. ఏదీ అనుకున్న తేదీకి జనం ముందుకు రావడం లేదు. 'కల్కి 2898 ఎ.డి' (Kalki 2898 A.D) విడుదల కాగానే ప్రభాస్ పూర్తి స్థాయిలో 'ది రాజా సాబ్' (The Raja Saab) ను డేట్స్ ఇస్తారని, ఆ సినిమా ముందుగా రిలీజ్ అవుతుందని అనుకున్నారు. కానీ వారి ఆశలు ఫలించేలా కనిపించడం లేదు. ఇప్పుడు 'ది రాజా సాబ్' షూటింగ్ ఏ మేరకు జరిగింది, ఇంకా ఎంత బాలెన్స్ ఉంది అనేది తెలియని పరిస్థితి. ఇదే సమయంలో ప్రభాస్ 'ఫౌజీ' షూటింగ్ లో పాల్గొంటున్నాడని వార్తలు వచ్చాయి. అలానే 'కల్కి' సీక్వెల్ ను కూడా వీలైనంత త్వరగా పట్టాలెక్కించే పనిలో ప్రభాస్ వున్నాడని అంటున్నారు. మరో వైపు ప్రశాంత్ నీల్... ఎన్టీఆర్ సినిమాను పూర్తి చేసి ఫ్రీ కాగానే 'సలార్ -2' (Salaar -2) మూవీని ప్రభాస్ పూర్తి చేస్తాడని వార్తలు వస్తున్నాయి. ఇక సందీప్ రెడ్డి వంగాకు మాట ఇచ్చినట్టుగా 'స్పిరిట్' నూ పట్టాలెక్కించాల్సి ఉంది. ఇటీవల తన దర్శకులందరితోనూ కలిసి కూర్చుని ప్రభాస్ ఏ సినిమా తర్వాత ఏ సినిమా చేయాలనే విషయమై చర్చించాడని, అందులో భాగంగా 'స్పిరిట్'ను వెనక్కి తీసుకెళ్ళడానికి సందీప్ రెడ్డి వంగా అంగీకరించాడని ఇండస్ట్రీలో వినిపించింది. ఇప్పుడు హఠాత్తుగా సందీప్ రెడ్డి వంగా తన చిత్ర కథానాయిక త్రిప్తి డిమ్రీ అని ప్రకటించడంతో ఈ సినిమాల ఆర్డర్ మారిందా అనే సందేహమూ కలుగుతోంది.
ఏదేమైనా... సందీప్ రెడ్డి వంగాకు త్రిప్తి డిమ్రీ రుణపడాల్సి ఉంది. 'యానిమల్' సినిమాలో జోయా పాత్రకు ఏ ముహూర్తాన సందీప్ రెడ్డి వంగా త్రిప్తిని ఎంపిక చేశాడో కానీ ఆమె జాతకం మారిపోయింది. దానికి ముందు ఐదారేళ్ళుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నా త్రిప్తికి బ్రేక్ రాలేదు. 'యానిమల్'లో నటించగానే ఆమెకు సూపర్ డూపర్ క్రేజ్ వచ్చేసింది. నిజం చెప్పాలంటే 'యానిమల్' మూవీతో హీరో, హీరోయిన్ల కంటే త్రిప్తీకే ఎక్కువ మైలేజ్ వచ్చింది. ఆ తర్వాత ఆమెకు నాన్ స్టాప్ గా ఆఫర్స్ లభించాయి. హిందీలోనే కాకుండా కోట్ల రెమ్యూరేషన్ ఇచ్చి ఇతర భాషల్లోనూ పెట్టుకోవడానికి చాలామంది మేకర్స్ రెడీ అయ్యారు. ఈ టైమ్ లో మరోసారి త్రిప్తి డిమ్రీని సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్'లోకి తీసుకోవడం విశేషమనే చెప్పాలి. ఆమె ఎంట్రీతో 'స్పిరిట్' కేవలం యాక్షన్ మూవీ మాత్రమే కాదని... కుర్రకారు కోరుకునే రొమాన్స్ కూ ఇందులో చోటు ఉంటుందని అర్థమౌతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కొంతకాలంగా బాలీవుడ్, టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ పేర్లు వినిపించాయి. ఈ పుకార్లకు సందీప్ రెడ్డి వంగా ఒకే ఒక్క పోస్ట్ తో చెక్ పెట్టేశాడు. ఇక ఎప్పుడు ఈ మూవీ సెట్స్ పైకి వెళుతుందో కూడా ప్రకటిస్తే... ఫ్యాన్స్ మరింత ఖుషీ అవుతారు.
Also Read: Nilave: నిజాయితీతో చేసిన సినిమా...
Also Read: Kollywood: చియాన్ విక్రమ్ సరసన మీనాక్షి చౌదరి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి