Sameera Reddy: ఎన్టీఆర్ హీరోయిన్.. రీ ఎంట్రీ! హారర్ ఫిల్మ్ తో తెరపైకి
ABN, Publish Date - Aug 12 , 2025 | 03:03 PM
పదకొండేళ్ళ క్రితం వివాహం చేసుకున్న సమీరా రెడ్డి ఆ తర్వాత నటనకు స్వస్తి చెప్పింది. ఇప్పుడు తిరిగి ఆమె ఓ హారర్ మూవీతో రీ ఎంట్రీ ఇస్తోంది.
సమీరా రెడ్డి (Sameera Reddy) బాలీవుడ్ లోనే కాదు... టాలీవుడ్ లోనూ హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా 'నరసింహుడు'లో ఎన్టీఆర్ (NTR) సరసన నటించిన ఈ చిన్నది అప్పట్లో బుల్లి రామయ్యతో ప్రేమాయణం నడిపిందని పెద్ద చర్చే జరిగింది. ఆ తర్వాత 'అశోక్' మూవీలోనూ సమీర నటించడంతో వీళ్ళిద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అంటూ టాలీవుడ్ (Tollywood) కోడై కూసింది. చిరంజీవి (Chirajeevi) సరసన 'జై చిరంజీవా' చిత్రంలో నటించింది సమీరా రెడ్డి. తెలుగులో చివరిగా 'కృష్ణంవందే జగద్గురుమ్'లో ఐటమ్ సాంగ్ లో నర్తించింది. 2014లో వివాహం చేసుకున్న తర్వాత నటనకు దూరమైంది. చిత్రం ఏమంటే... సమీర 20 యేళ్ళ క్రితం నటించిన 'నామ్' అనే హిందీ సినిమా గత యేడాది థియేటర్లలో విడుదలైంది.
ఇదిలా ఉంటే... ఇద్దరు పిల్లల తల్లి అయిన సమీరా రెడ్డి ఇప్పుడు 13 సంవత్సరాల తర్వాత తిరిగి కెమెరా ముందుకొచ్చింది. ఆమె అవుట్ అండ్ అవుట్ హారర్ మూవీ 'చిమ్నీ'లో నటిస్తోంది. ఈ విషయాన్ని గురించి సమీర మాట్లాడుతూ, 'నేను నటించిన చివరి చిత్రం 'తేజ్'. అది 2012లో విడుదలైంది. ఆ తర్వాత పెళ్ళి, పిల్లలతో బిజీ అయిపోయాను. కానీ ఈ మధ్య మా అబ్బాయి నేను నటించిన 'రేస్' మూవీని చూసి ఆశ్చర్యపోయాడు. అప్పటిలా నేను లేనేంటి? అని అడిగాడు. 'సినిమాల్లో తిరిగి నటించొచ్చు కదా!' అని అన్నాడు. 'నీతోనూ, నీ చెల్లితోనూ నాకు సరిపోతుంది... మళ్ళీ యాక్టింగ్ కు ఆస్కారమెక్కడా?' అని బదులిచ్చాను. అయితే వాడు తిరిగి నేను నటించాల్సిందే నంటూ ఒత్తిడి చేశాడు. 'కొడుకు మాట కాదనలేక మళ్ళీ నటనపై దృష్టి పెట్టాను' అని సమీర చెప్పుకొచ్చింది.
'చిమ్నీ'లాంటి హారర్ మూవీని తాను ఎప్పుడు చేయలేదని చెబుతూ, 'గతంలో 'డర్నా మనా హై'మూవీలో చేశాను. అయితే కేవలం అందులో నాది నెరేటర్ పాత్ర మాత్రమే. సో... ఆ రకంగా ఇది నేను నటిస్తున్న తొలి హారర్ మూవీ అనుకోవచ్చు' అని చెప్పింది. 13 సంవత్సరాల తర్వాత తిరిగి షూటింగ్ లో పాల్గొన్న విశేషాలను తెలుపుతూ, 'పుష్కర కాలం తర్వాత కెమెరా ముందుకు రావడం అంటే... కాస్తంత నెర్వస్ ఫీల్ అయ్యాను. కానీ సెట్ లో ఉన్న నటీనటులు మీరు అనుభవజ్ఞులు అంతగా భయపడుతున్నారేమిటీ?' అని ఆట పట్టించారు. అయితే ఒక్కసారి కెమెరా ఆన్ కాగానే నాలోని పాత నటి తిరిగి బయటకు వచ్చేసింది. హాయిగా ఆ సన్నివేశాన్ని చేసేశాను అని తెలిపింది. అప్పటికీ ఇప్పటికీ సాంకేతిక పరంగా ఎన్నో మార్పులు వచ్చాయని, అప్పటిలా ఇప్పటి నటీనటులు శారీరక శ్రమ తీసుకోనక్కర్లేదని సమీరా చెప్పింది. మరి పనిలో పనిగా 46 యేళ్ళ సమీరా టాలీవుడ్ లోకి కూడా రీ-ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.
Also Read: Bhagyashri Borse: తమిళంలోకి.. భాగ్యశ్రీ! తంబీలు.. వదులుతారా
Also Read: Tollywood: మిడ్ రేంజ్ హీరోల పరిస్థితి ఏంటి...