Police Staion Mein Bhoot: వర్మ స్టేషన్ లో మనోజ్ బాజ్ పాయ్, రావు రమేశ్...
ABN, Publish Date - Dec 02 , 2025 | 04:45 PM
రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన శివ, రంగీలా సినిమాలు నవంబర్ లో బ్యాక్ టు బ్యాక్ రీ-రిలీజ్ అయ్యాయి. దాంతో ఇప్పుడు వర్మ సెట్స్ పై ఉన్న తన లేటెస్ట్ మూవీ 'పోలీస్ స్టేషన్ మే భూత్'పై దృష్టిపెట్టారు.
ఒకప్పుడు హారర్ చిత్రాలకు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు. అయితే చాలా కాలం తర్వాత మరోసారి వర్మ అదే జోనర్ లో మూవీ చేస్తున్నాడు. అదే 'పోలీస్ స్టేషన్ మే భూత్' (Police Station Mein Bhoot) . ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా సాగుతోంది. ఇటీవలే చివరి షెడ్యూల్ ను వర్మ మొదలు పెట్టారు. ఈ సినిమాలో జెనీలియా, రమ్యకృష్ణ (Ramayakrishna), మనోజ్ బాజ్ పాయ్ (Manoj Bajpayee) కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశేషం ఏమంటే... బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ ను టాలీవుడ్ కు తీసుకొచ్చింది కూడా వర్మే. హిందీ సినిమా 'సత్య' (Satya) లో భీకూ మాత్రే పాత్రతో మంచి గుర్తింపు పొందిన మనోజ్ బాజ్ పాయ్ ను ఆ వెంటనే సుమంత్ హీరోగా నటించిన తొలి చిత్రం 'ప్రేమకథ' (Premakatha) తో వర్మే తెలుగు సినిమా రంగానికి పరిచయం చేశాడు. అప్పటి నుండి మనోజ్ బాజ్ పాయ్ ఇక వెను దిరిగిచూసుకోవాల్సిన అవసరం కలగలేదు. ఈ మధ్య కాలంలో మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన పాత్ర పోషించిన 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సీరిస్ తోనూ దేశ వ్యాప్తంగా అందరి అభిమానాన్ని మరోసారి చూరగొన్నాడు. ఇదిలా ఉంటే... 'పోలీస్ స్టేషన్ మే భూత్' మూవీలో రావు రమేశ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన ఓ వర్కింగ్ స్టిల్ ను వర్మ ఎప్పటిలానే సరదాగా తన సోషల్ మీడియా లో పోస్ట్ చేశాడు. రావు రమేశ్ (Rao Ramesh) గతంలో హిందీలో సినిమాలు చేసిన దాఖలాలు లేవు. బహుశా అతనికి ఇదే తొలి హిందీ సినిమా కావచ్చు. ఏదేమైనా వర్మ కాస్తంత కన్సంట్రేషన్ తోనే ఈ సినిమా తీస్తున్నాడని అనిపిస్తోంది.
వర్మ కెరీర్ లోనే బెస్ట్ అనిపించుకున్న 'శివ (Shiva), రంగీలా (Rangeela)' సినిమాలు గత నెలలో ఇటు తెలుగులోనూ, అటు హిందీలోనూ రీ-రిలీజ్ అయ్యాయి. దాంతో మేకర్ గా వర్మ ఎలాంటి సెన్సేషనల్ మూవీస్ ను గతంలో తీశాడో ఈ జనరేషన్ కూ అర్థమైంది. ఈ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న 'పోలీస్ స్టేషన్ మే భూత్' మూవీ గత కొంతకాలంగా వర్మపై ఉన్న బ్యాడ్ ఇమేజ్ ను కొంతమేరకు తుడిచేసే ఆస్కారం ఉందనిపిస్తోంది.
Also Read: MSVPG: చిరు- వెంకీ స్టెప్ వేస్తే .. టాలీవుడ్ అదరడం ఖాయమే
Also Read: Telugu Cinema: పొంగల్ కు క్రాస్ రోడ్స్ లో పదిహేను స్క్రీన్స్...