సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Ranbir Kapoor: ప్రశ్నార్థకంగా.. 'రామాయణం' డెడికేషన్

ABN, Publish Date - Nov 25 , 2025 | 07:33 PM

సోషల్ మీడియా వచ్చాక సెలబ్రెటీలు ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సి వస్తోంది. కాస్త పొరపాటు చేసినా ట్రోలర్స్ చేతిలో పడి కెరీరే ప్రమాదంలో పడే పరిస్థితి వస్తోంది. తాజాగా బీటౌన్ స్టార్ కు అలాంటి పరిస్థితే ఎదురైంది. సమాధానం ఏం చెప్పాలో తెలియక ఆ హీరో ఇప్పుడు కిందామీదా పడుతున్నాడు.

బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ (Ranbir Kapoor) నటిస్తున్న మోస్ట్ క్రేజియెస్ట్ మూవీ 'రామాయణం' (Ramayanam). దర్శకుడు నీతేష్ తివారీ రూపొందిస్తున్న ఈ మైథాలజికల్ చిత్రాన్ని ఎంతో నిష్టతో తీస్తున్నారని కొన్నాళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ మూవీలో శ్రీరాముని పాత్ర పోషిస్తున్న రణబీర్ .. ఈ చిత్రం కోసం చాలా మారిపోయానని.. మాంసాహారం, మద్యపానం పూర్తిగా మానేశానని.. సాత్విక జీవనశైలిని అవలంబిస్తున్నానని గతంలో చెప్పారు. అది తెలిసి అభిమానులు, నెటిజన్లు అతని డెడికెషన్ పై ప్రశంసలు కురిపించారు. అలాంటి రణబీర్ తాజాగా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు.

ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన ‘డైనింగ్ విత్ ద కపూర్స్’ అనే ప్రత్యేక కార్యక్రమంలోని ఒక సీన్ రణబీర్ గతంలో చేసిన కామెంట్స్ పై తీవ్ర సందేహాలను లేవనెత్తింది. 'ఇండియన్ షో మేన్'గా పేరొందిన రాజ్ కపూర్ 100వ జయంతి సందర్భంగా నిర్మించిన ఈ డాక్యుమెంటరీ కార్యక్రమంలో కపూర్ కుటుంబం కలసి భోజనం చేస్తూ మాట్లాడుకుంటున్న దృశ్యాలు ఉన్నాయి. అయితే ఇక్కడే ఓ అనుమానం అందరినీ వెంటాడింది. ఈ ఎపిసోడ్‌లో ఆర్మాన్ జైన్ కుటుంబ సభ్యులకు ఫిష్ కర్రీ, జంగ్లీ మటన్, పాయా వంటి మాంసాహార వంటకాలను అందిస్తున్న దృశ్యాలు ఉన్నాయి. రణబీర్ కపూర్ వారితో కలిసి తింటున్న దృశ్యాలు కనిపించాయి. వీడియోలో రణబీర్ స్వయంగా మాంసాహారం తినడం స్పష్టంగా కనిపించకపోయినప్పటికీ, మేజు మీద మాంసాహార వంటకాలు ఉండటం, ఆయన భోజనం చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్‌గా మారాయి.

ఈ వీడియో వైరల్ కాగానే నెటిజన్లు రణబీర్ ప్రచార బృందంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాముడి పాత్ర కోసం మాంసాహారం మానేశానని ప్రకటించి.. ఇప్పుడు ఫిష్ కర్రీ, మటన్ ముందు కూర్చొని ఉండటమేంటని ఫైర్ అవుతున్నారు. పీఆర్ స్టంట్ బాగుందని విమర్శిస్తున్నారు. ప్రస్తుతం రణబీర్ కపూర్ లేదా ఆయన బృందం ఈ వివాదంపై ఎటువంటి అధికారిక స్పందన తెలియజేయలేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Updated Date - Nov 25 , 2025 | 09:13 PM