Ranbir Kapoor as Rama: ముత్తాత అడుగుజాడల్లో రాముడిగా...
ABN , Publish Date - Jul 15 , 2025 | 06:08 PM
అప్పుడెప్పుడో ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ కపూర్ రాముడిగా 'సీత' అనే చిత్రంలో నటించారు. మళ్ళీ ఇప్పుడు ఆయన మునిమనవడు రణబీర్ కపూర్ శ్రీరాముడిగా వెండితెరపై అలరించబోతున్నాడు.
ప్రస్తుతం మన దేశంలో ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటున్న సినిమా 'రామాయణ' (Ramayana). శ్రీరామునిగా రణబీర్ కపూర్ (Ranbeer Kapoor), సీతగా సాయిపల్లవి (Sai Pallavi), రావణాసురునిగా యశ్ (Yash), హనుమంతునిగా సన్నీ డియోల్ ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నితేశ్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా, యశ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రాముడిగా నటిస్తున్న రణబీర్ కపూర్ కు సంబంధించిన ఆసక్తికరమైన అంశం ఒకటుంది.
'రామాయణ' సినిమా కోసం నితేశ్ తివారీ ముందు శ్రీరామ పాత్రకు వేరే స్టార్ హీరోస్ ను అనుకున్నట్టు తరువాతనే రణబీర్ కపూర్ ను ఎంచుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బాలీవుడ్ లో పౌరాణిక చిత్రాలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది రణబీర్ కపూర్ ముత్తాత పృథ్వీరాజ్ కపూర్. ఆయన మూకీల్లోనూ, టాకీల్లోనూ పౌరాణిక పాత్రలు ధరించి అలరించారు. ఇక తెలుగునాట 1934లో తొలి 'లవకుశ' తెరకెక్కి ఘనవిజయం సాధించింది. అదే యేడాది శ్రీరామునిగా పృథ్వీరాజ్ కపూర్, సీతగా దుర్గా ఖోటే నటించిన 'సీతా' ఉత్తరాదిన బంపర్ హిట్ గా నిలచింది. తరువాతి రోజుల్లో పృథ్వీరాజ్ కపూర్ మరికొన్ని పౌరాణికాల్లో నటించారు. మరో విశేషమేంటంటే పృథ్వీరాజ్ కపూర్ నటించిన 'సీత' చిత్రం రెండవ వెనీస్ ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమయింది. ఓ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శితమైన తొలి భారతీయ చిత్రంగానూ 'సీత' నిలచింది. ఈ నేపథ్యమంతా నితేశ్ తివారీ అధ్యయనం చేసి శ్రీరామ పాత్రకు రణబీర్ కపూర్ ను, సీత పాత్ర కోసం సాయిపల్లవిని ఎంచుకున్నట్టు తెలుస్తోంది.
'రామాయణ' కథ యావద్భారతానికీ తెలిసినది. అందులోని శ్రీరామ, సీత పాత్రలు ఎప్పటికీ అలరిస్తూనే ఉంటాయి. ఇక హనుమంతుని పాత్ర వినోదం పంచడంతో పాటు జనాల్లో భక్తి భావాన్నీ పెంపొందిస్తూ ఉంటుంది. ఈ అంశాలను అంతర్జాతీయంగా ఉన్న భారతీయుల మదిలో చొప్పించే ప్రయత్నంలోనే నితేశ్ తివారీ 'రామాయణ' తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను హిందీతో పాటు ప్రముఖ భారతీయ భాషలన్నిటా విడుదల చేయనున్నారు. అంతేకాదు, ఇంగ్లిష్ ప్రేక్షకుల కోసం 'రామాయణ'ను ప్రత్యేకంగా రూపొందిస్తున్నట్టూ తెలుస్తోంది. ప్రపంచంలోని సినీ ఫ్యాన్స్ అందరినీ అలరించేలా 'రామాయణ' రూపొందనుందని నమిత్ మల్హోత్రా చెబుతున్నారు. ప్రస్తుతం తెరకెక్కుతోన్న భారీ హాలీవుడ్ మూవీస్ రేంజ్ లోనే 'రామాయణ'ను రూపొందిస్తున్నామని మల్హోత్రా తెలిపారు. దేశంలోనే అత్యంత భారీ వ్యయంతో తయారవుతోన్న 'రామాయణ' ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.
Also Read: B. Saroja Devi: చనిపోయి కూడా మరొకరి జీవితంలో వెలుగు నింపిన సరోజాదేవి
Also Read: Directed By Aditya Om: సుబోధ్ భావే హీరోగా ‘సంత్ తుకారాం’