Bollywood: మహాభారత్ కర్ణుడి కన్నుమూత
ABN , Publish Date - Oct 15 , 2025 | 03:20 PM
మహాభారత్ టీవీ సీరియల్ లో కర్ణుడి పాత్రను పోషించిన పంకజ్ ధీర్ అనారోగ్యంతో కన్నుమూశారు. పలు టీవీ షోస్ తో పాటు హిందీ చిత్రాలలోనూ పంకజ్ నటించారు.
ప్రముఖ దర్శక, నిర్మాత బి.ఆర్. చోప్రా (BR Chopra) తెరకెక్కించిన బుల్లితెర ధారావాహిక 'మహాభారత్' (Mahabharath) లో కర్ణుడి పాత్రను పోషించిన పంకజ్ ధీర్ (68) (Pankaj Dheer) కాన్సర్ తో బుధవారం కన్నుమూశారు. భారతీయ టెలివిజన్ రంగంలో పంకజ్ ధీర్ కు మంచి గుర్తింపు ఉంది.
'మహాభారత్' సీరియల్ లో కర్ణుడి పాత్రతో ప్రతి ఒక్కరికీ చేరువైన పంకజ్ 'మహా భారత్' తర్వాత 'చంద్రకాంత, ది గ్రేట్ మరాఠా, యుగ్, బధో బాహు'లో నటించారు. అలానే హిందీ చిత్రాలు 'సడక్, సోల్జర్, బాద్ షా' లో యాక్ట్ చేశారు. నటుడిగానే కాకుండా సినిమా రంగంలో ఎంటర్ పెన్యూర్ గానూ తన సత్తా చాటే ప్రయత్నం చేశారు పంకజ్ ధీర్. 2006లో ముంబైలోని జోగేశ్వరి లో తన సోదరుడు సట్లుజ్ ధీర్ తో కలిసి విశగే స్టూడియోజ్ ను ఏర్పాటు చేశారు. అలానే 2010లో మహాభారత్ లోని తన తోటి నటుడు గుఫీ పెయింటర్ తో కలిసి అభినయ్ యాక్టింగ్ అకాడమిని ప్రారంభించారు. పంకజ్ ధీర్ కుమారుడు నికితిన్ ధీర్ కూడా నటుడే కావడం విశేషం. అతను 'చెన్నయ్ ఎక్స్ ప్రెస్, షేర్షా ' వంటి చిత్రాలలో నటించాడు. టీవీ నటి క్రతికా సెంగర్ ను వివాహం చేసుకున్నాడు.
Also Read: Tollywood: కొడుకు హీరోగా విజయ భాస్కర్ మూడో సినిమా...
Also Read: Tollywood: శర్వాతోనే శ్రీను వైట్ల సినిమా