Tollywood: కొడుకు హీరోగా విజయ భాస్కర్ మూడో సినిమా...
ABN , Publish Date - Oct 15 , 2025 | 02:16 PM
ప్రముఖ దర్శకుడు కె. విజయభాస్కర్ కుమారుడు శ్రీకమల్ మరో సినిమాలో నటించబోతున్నాడు. ఈ చిత్రానికి 'కత్తిలాంటి కుర్రాడు' అనే పేరు ఖరారు చేశారు. ఇది కూడా కె. విజయ భాస్కర్ దర్శకత్వంలోనూ రూపుదిద్దుకోబోతోంది.
ప్రముఖ దర్శకుడు విజయ్ భాస్కర్ (K Vijaya Bhasakar) తనయుడు శ్రీకమల్ (Srikamal) ప్రస్తుతం తెలుగులో హీరోగా నటిస్తున్నాడు. అతని తొలి చిత్రం 'జిలేబీ' (Jilebi) 2023లో విడుదలైంది. విశేషం ఏమంటే... ఈ సినిమాను విజయ్ భాస్కరే డైరెక్ట్ చేశారు. జీవిత, రాజశేఖర్ కుమార్తె శివానీ ఇందులో హీరోయిన్. గుంటూరు రామకృష్ణ, అంజు అస్రాని ఈ సినిమా నిర్మించారు. ఇది మలయాళ చిత్రం 'అది కప్యారే కూటమణి' సినిమాకు రీమేక్. అయితే ఈ సినిమా విడుదల సమయంలో ఇక్కట్లు పడ్డారు నిర్మాతలు. తన కొడుకు నటించిన తొలి చిత్రం విడుదలకు సమస్యలు రావడంతో విజయ్ భాస్కర్ అతనితో రెండో సినిమా చేస్తూ దాన్ని ఆయనే నిర్మించారు. అదే 'ఉషా పరిణయం' (Usha Parinayam). శ్రీకమల్ ఫస్ట్ మూవీ 'జిలేబీ' 2023 ఆగస్ట్ నెలాఖరులో విడుదలైతే, సరిగ్గా యేడాది తర్వాత అదే ఆగస్ట్ నెలలో 'ఉషా పరిణయం' మూవీ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ మూవీతో తన్వీ ఆకాంక్ష హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ సినిమాను తాము క్వాలిటీతో తీసినా... విడుదల సమయంలో అనుకోని సమస్యలు ఎదురయ్యాయని, వేరే సినిమాలతో పోటీ పడటం ఇష్టం లేక తాము తమ చిత్రాన్ని వాయిదా వేసుకుంటే... అదే రోజుకు మరో పది, పన్నెండు సినిమాలు వచ్చేయని దర్శక నిర్మాత విజయ భాస్కర్ తెలిపారు.
'ఉషాపరిణయం' మూవీ గురించి ఇటీవల ఆయన మాట్లాడుతూ, 'మా అబ్బాయి శ్రీకమల్ ను హీరోగా నిలబెట్టాలని, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాలని 'ఉషా పరిణయం' సినిమాను సొంతంగా తీశాం. దాని ద్వారా ఎంత నష్టపోయామనే విషయాన్ని పక్కన పెడితే... మా ప్రధాన లక్ష్యం ఏదైతే ఉందో దానిని ఒక మేరకు నెరవేర్చగలిగాం. ఆ సినిమా శ్రీకమల్ కు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. రాబోయే రోజుల్లో నటుడిగా అతను ఏమిటనేది ఎవరైనా బేరీజు వేసుకోవాలంటే ఆ సినిమా చూడొచ్చు. ఆ మేరకు మేం సక్సెస్ అయ్యాం' అని అన్నారు. ఇప్పుడు అదే ఉత్సాహంతో తన కుమారుడు శ్రీకమల్ తోనే 'కత్తిలాంటి కుర్రాడు' అనే సినిమాను తన దర్శకత్వంలోనే తీయబోతున్నట్టు కె. విజయ భాస్కర్ తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. మరి 'జిలేబీ, ఉషా పరిణయం' చిత్రాల నుండి పాఠాలు నేర్చుకున్న శ్రీకమల్... 'కత్తిలాంటి కుర్రాడు'గా ఏ మేరకు అలరిస్తాడో చూడాలి.
Also Read: Tollywood: శర్వాతోనే శ్రీను వైట్ల సినిమా
Also Read: Tollywood : నేపథ్య గాయని రావు బాలసరస్వతి కన్నుమూత