Bollywood: ముసలి హీరోలతో పడచు భామలు నటించడంపై చర్చ
ABN , Publish Date - Sep 27 , 2025 | 02:49 PM
ముసలి హీరోలు సల్మాన్, ఆమీర్, షారూఖ్ ఖాన్ తమ కంటే వయసులో చిన్నవారితో జోడీ కట్టడం చర్చనీయాంశంగా మారింది. అయితే తెలుగులో ఎన్టీఆర్ తనకంటే నలభై యేళ్ళ చిన్నదైన శ్రీదేవితో పలు చిత్రాలలో నటించి, సక్సెస్ చవిచూశారు.
ముదుసలి హీరోలతో ముద్దుగుమ్మలు జోడీకట్టడం కొత్తేమి కాదు. అయినా ప్రతీసారి అరవైల హీరోలతో ఇరవైల హీరోయిన్స్ జంట కట్టడంపై చర్చసాగుతూనే ఉంటుంది. ఆ సందడి మళ్ళీ ఇప్పుడు ఊపందుకోవడం విశేషం!
'సికందర్' (Sikandar) సినిమా సమయంలో హీరో సల్మాన్ (Salman) తనకంటే దాదాపు సగం తక్కువ వయసున్న రశ్మిక (Rashmika) తో నటించడాన్ని పలువురు ఎద్దేవా చేశారు. పైగా రశ్మిక తండ్రి మదన్, సల్మాన్ వయసు ఒకటేననీ ట్రోల్ సాగింది. వయసుతో పనియేముంది అంటూ సల్మాన్ ఎదురు ప్రశ్నలు వేశారు. అయినా ట్రోల్స్ సాగుతూ ఉండడంతో 'పాత హీరోయిన్స్ తోనే నటిస్తూ పోతే- తమ స్టార్ డమ్ పడిపోయిందని జనం భావిస్తారని, అందువల్లే యంగ్ హీరోయిన్స్ తో నటిస్తూ ఉంటామని' తెలివిగా సమాధానమిచ్చారు సల్మాన్. ఏది ఏమైనా 'సికందర్' మాత్రం ఆకట్టుకోలేకపోయింది. అదే పరిస్థితి ఇటీవల ఓ షోలో ఆమిర్ ఖాన్ (Aamir Khan) కు ఎదురయింది. వయసులో చిన్నవారితో నటించడంపై ప్రశ్నలు గుప్పించారు.. తానెప్పుడూ తనకంటే చాలా చిన్నవారితో నటించలేదని ఆమిర్ అన్నారు. కరీనా కపూర్ (Kareena Kapoor) మీ కంటే చిన్నదే కదా అన్నది జనం మాట. సీనియర్ హీరోయిన్స్ తో రెగ్యులర్ గా నటిస్తూ ఉంటే మేం ఓల్డ్ అయిపోయామని జనం భావిస్తారు కదా. అందుకే యంగ్ హీరోయిన్స్ తో నటిస్తూంటామని ఆమిర్ కూడా తెలివిగా సమాధానమిచ్చారు. దీంతో ప్రస్తుతం సల్మాన్, ఆమిర్, షారుఖ్ సరసన నటించే హీరోయిన్స్ వయసుపై జనం ఫోకస్ పెట్టారు.
అరవై ఏళ్ళ హీరోలు మూడు పదుల భామలతో నటిస్తోంటేనే రచ్చ చేస్తున్నారే. ఒకప్పుడు నిజంగానే హీరోయిన్ కంటే హీరో వయసు నలభై ఏళ్ళు ఎక్కువగా ఉన్నా జోడీ కట్టి అలరించిన సందర్భాలున్నాయి. ఆ ముచ్చట తెలుగునాటనే చోటు చేసుకోవడం విశేషం! శ్రీదేవి (Sreedeivi) కంటే యన్టీఆర్ (NTR) వయసులో 40 ఏళ్ళు పెద్దవారు. అంతెందుకు యన్టీఆర్ 'బడిపంతులు' చిత్రంలో ఆయనకు శ్రీదేవి మనవరాలుగా నటించింది. ఆ సినిమా వెలుగు చూసిన ఏడేళ్ళకు యన్టీఆర్ జంటగా నటించి శ్రీదేవి అలరించిన వైనాన్ని తెలుగువారు ఎన్నటికీ మరచిపోలేరు. అప్పట్లో తెలుగు స్టార్ హీరోస్ అందరికీ కూతురుగా నటించిన శ్రీదేవి తరువాత వారి సరసనే నాయికగా నటించడాన్ని భలేగా ముచ్చటించుకొనేవారు జనం. వయసులో ఎంతో తేడా ఉన్న హీరోయిన్స్ తో నటించడం తప్పేమీ కాదని సీనియర్ హీరోస్ అనేవారు. తప్పని ప్రేక్షకులు భావించనంతవరకూ ఆదరిస్తూనే ఉంటారనీ అప్పట్లో సీనియర్ స్టార్స్ అనేవారు.
హీరోలతో పోల్చి చూస్తే హీరోయిన్స్ స్టార్ డమ్ పరిధి తక్కువగానే ఉంటుంది. ఏదో కొందరు భామలు నాజూకుతనాన్ని మెయింటెయిన్ చేస్తూ సాగుతూ ఉంటారు. కానీ, నాలుగు పదుల వయసు రాగానే హీరోయిన్స్ ను జనం అంతగా పట్టించుకోరు. మెల్లగా వారి స్టార్ డమ్ కూడా మసకబారుతుంది. ఈ నేపథ్యంలో హీరోలు తమ స్టార్ డమ్ ను నిలుపుకొనేందుకు, యువతను ఆకట్టుకొనేందుకు యంగ్ హీరోయిన్స్ తో నటించడం రివాజుగా మారింది. అదే పంథాలో ఈ నాటి సీనియర్ స్టార్స్ సైతం పయనిస్తున్నారు. కాబట్టి దానిని తప్పు పట్టడం సరికాదు. కళలకు ఎల్లలు లేనట్టే - నటీనటులకు వయసుతో పనిలేదని తేల్చేశారు సీనియర్స్ . రాబోయే రోజుల్లో ఎందరు ఇరవై ఏళ్ళ భామలు అరవై ఏళ్ళ హీరోలతో నటిస్తారో చూడాలి.
Also Read: Aditya Music: తెలుగు పాటతో నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన మోదీ
Also Read: OG 2: సుజీత్ ప్లాన్ అంతా అదేనా.. స్టోరీ లైన్ సిద్ధమేనా..