OG 2: సుజీత్ ప్లాన్ అంతా అదేనా.. స్టోరీ లైన్ సిద్ధమేనా..
ABN , Publish Date - Sep 27 , 2025 | 02:28 PM
ఇప్పుడు టాలీవుడ్ ట్రెండింగ్ సినిమాకు ‘ఓజీ’కి పార్టు 2 ఉంటుందని దర్శకుడు సుజీత్ (Sujeeth) చెప్పకనే చెప్పాడు. అయితే కచ్చితంగా ఉంటుందని చెప్పలేం అంటున్నారు విశ్లేషకులు.
‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమా పాన్ ఇండియా (OG2) స్థాయిని దాటుకుపోయింది. ఆ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కడం అది ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడంతో తెలుగు సినిమా స్పాన్ మారిపోయింది. బాహుబలి తర్వాత భారీ చిత్రాలు మాగ్జిమమ్ రెండు పార్టులుగా తెరకెక్కించే పద్దతి మొదలైంది. ఇప్పుడిది సర్వ సాధారణం అయిపోయింది. ఇలా రెండు పార్టులుగా వచ్చిన చిత్రాలు కొన్ని సక్సెస్ కాగా, మరికొన్ని బెడిసికొట్టాయి. మరి కొన్ని చిత్రాలు మొదటి రిజల్ట్‌ను బట్టి రెండో పార్ట్ ప్రకటించి వదిలేశారు. అవి ఇంకా కార్యరూపం దాల్చలేదు.
ఇప్పుడు టాలీవుడ్ ట్రెండింగ్ సినిమాకు ‘ఓజీ’కి పార్టు 2 ఉంటుందని దర్శకుడు సుజీత్ (Sujeeth) చెప్పకనే చెప్పాడు. అయితే కచ్చితంగా ఉంటుందని చెప్పలేం అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలతో, ఉప ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలతో తీరిక లేకుండా గడుపుతున్న నేపథ్యంలో ఆయన సమయం కేటాయించగలరా అనే అనుమానం రాక మానదు. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేయడానికే చాలా సమయం పడుతుంది. కాబట్టి ‘ఓజీ-2’ ఉంటుందనే గ్యారెంటీ లేదని తెలుస్తోంది.
ఒకవేళ ‘ఓజీ-2’ (OG 2 movie0 ఉంటే ఆ కథ ఎలా ఉంటుందన్నదనే దానిపై ప్రస్తుతం చర్చ మొదలైంది. నిజంగా పార్టు 2 ఉంటే.. అది ఎప్పుడు కార్యరూపం దాల్చినా దాని తగ్గ కథ, ప్లాట్ అయితే దర్శకుడు సుజీత్ సిద్ధం చేసుకునే ఉంటాడని చెబుతున్నారు. ‘ఓజీ’లో ఆ దిశగా కొన్ని హింట్స్ కూడా ఇచ్చాడు. ముంబైని గడగడలాడించిన ఓజీ 15 ఏళ్లు అజ్ఞాతవాసంలో ఉంటాడన్న సంగతి తెలిసిందే. అందులో ఏడేనిమిదేళ్లు అతను చెన్నైలో ఉన్నట్లు చూపిస్తారు. అక్కడే కన్మణి (ప్రియాంక మోహన్) పరిచయం అవుతుంది. అంతకంటే ముందు ఏడేళ్లు గంభీర ఎక్కడ ఉన్నాడన్నది చూపించరు. ఒక సన్నివేశంలో ఓజీ భార్య.. పెళ్లికి ముందు మీరెక్కడున్నారు, ఏం చేశారు అంటే.. జపాన్‌కు సంబంధించిన విజువల్స్ తెరపై ప్లే అవుతాయి. అంతేకాక ఓజీని పట్టుకున్న చెన్నై పోలీసులు తన బ్యాగులో నుంచి జపాన్ సంబంధిత వస్తువులను బయటికి తీయడం చూడొచ్చు. ‘ఓజీ’ స్టోరీ ప్రారంభంలో శత్రువుల చేతిలో హతమైన ఓజాస్ గురువు.. 'నా శిష్యుల్లో మిస్సయిన ఒక్కడు వచ్చి మీ అంతు చూస్తాడని' వార్నింగ్ ఇస్తాడు. దీని ప్రకారం చూస్తే ‘ఓజీ’లో హీరో పాత్ర మిస్సయిన ఏడేళ్ల కాలాన్ని ‘ఓజీ-2’లో మెయిన్ ప్లాట్‌గా తీసుకునే అవకాశం ఉంది. జపాన్‌కు వెళ్లి అక్కడ తన గురువును చంపిన శత్రువులను హతమార్చడం మీద స్టోరీని నడిపించే అవకాశం ఉంది. సగం వరకు ఈ కథను నడిపించి.. ఆ తర్వాత ముంబయికి తిరిగొచ్చి అక్కడ మళ్లీ పురుడు పోసుకున్న మాఫియాను ఎదుర్కొవడం మీద కథ నడవొచ్చని తెలుస్తోంది. ‘ఓజీ-2’ కోసం ఇదే ప్లాట్ ప్లాన్ చేసి ఉంటాడు సుజీత్.