Hindi Cinema: ఉంచుతాయో.. ముంచుతాయో! బాలీవుడ్.. ఆశలన్నీ వాటి పైనే
ABN , Publish Date - Nov 27 , 2025 | 07:31 PM
ఈ యేడాది హిందీలో ఛావా, సైయారా, సితారే జమీన్ పర్ చిత్రాలే సూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత ఆ సక్సెస్ ను మరే సినిమా అందులో లేదు. అందుకే ఇప్పుడు రాబోతున్న నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ పై మేకర్స్ ఆశలు పెట్టుకున్నారు.
ఈ యేడాది ఇప్పటిదాకా బాలీవుడ్ లో వందలాది సినిమాలు రిలీజయ్యాయి... అయితే పట్టుమని పది చిత్రాలు కూడా బంపర్ హిట్స్ లేవు... దాంతో రాబోయే ఓ నాలుగు సినిమాలపైనే బాలీవుడ్ బాబులు ఆశలు పెట్టుకున్నారు.
ఈ యేడాది బాలీవుడ్ లో వందలాది చిత్రాలు జనం ముందు నిలిచాయి. వాటిలో ప్రేక్షకులను అలరించిన సినిమాలను వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. అంతెందుకు ఈ సంవత్సరం టాప్ టెన్ గ్రాసర్స్ గా నిలచిన బాలీవుడ్ సినిమాల జాబితా తీస్తే అందులో ఐదు సినిమాలు అట్టర్ ఫ్లాప్స్ ఉన్నాయి. దీనిని బట్టే హిందీ సినిమా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏ భాషా చిత్రసీమయినా ఏడాదికి కనీసం 20 శాతం పైగా విజయాలను నమోదు చేసుకుంటేనే బతికి బట్ట కట్టగలదు. అలాంటిది హిందీ సినిమా సక్సెస్ రేటు ఐదులోపే ఉండడం గమనార్హం. 2025 సంవత్సరంలో మొన్నటి దాకా 'ఛావా' (Chhavaa) సినిమా నంబర్ వన్ గ్రాసర్ గా నిలచింది. ఈ యేడాది 'ఛావా'నే నంబర్ వన్ అవుతుందని బాలీవుడ్ బాబులు ఆశించారు. దానిని సౌత్ మూవీ 'కాంతార- చాప్టర్ వన్' (Kanthara Chapeter 1) సునాయాసంగా అధిగమించేసింది. దాంతో రాబోయే నాలుగు సినిమాలపైనే బాలీవుడ్ ఆశలు పెట్టుకుంది. వీటిలో ముందుగా నవంబర్ 28న ధనుష్, కృతి సనన్ నటించిన 'తేరే ఇష్క్ మే' (Tere Ishk Mein) రానుంది. ఈ సినిమాను తెలుగులో 'అమర కావ్యం' పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. సౌత్ లో ధనుష్ (Dhanush) కు ఉన్న క్రేజ్, ఆల్ రెడీ కృతీ సనన్ (Kriti Sanon) కూడా ఇక్కడి వారికి సుపరిచితురాలు కావడం వల్ల డబ్బింగ్ వర్షన్ కూడా విజయం సాధిస్తుందనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు.
రాబోయే డిసెంబర్ లోనూ బాలీవుడ్ నుండి ఇరవైకి పైగా చిత్రాలు వస్తున్నాయి. అయితే వాటిలో క్రేజ్ ఉన్న మూవీస్ ఏవంటే - డిసెంబర్ 5న వచ్చే రణవీర్ సింగ్ నటించిన 'దురంధర్' (Dhurandhar), డిసెంబర్ 12 రిలీజయ్యే 'మేరే రహో' (Mere Raho) ముందుగా కనిపిస్తున్నాయి. ఆమీర్ ఖాన్ నిర్మిస్తున్న 'తేరే రహో' మూవీతో సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. థాయ్ మూవీ 'వన్ డే'కు ఇది రీమేక్. తరువాత డిసెంబర్ 25వ తేదీన అనన్య పాండే, కార్తిక్ ఆర్యన్ జంటగా తెరకెక్కిన 'తూ మేరీ మై తేరా- మై తేరా తూ మేరీ' సినిమా రాబోతోంది. ఈ సినిమాలు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇవి కాకుండా మరికొన్ని చిన్నాచితకా చిత్రాలు రానున్నాయి. అయితే వీటిలో కనీసం రెండు, మూడు సినిమాలు సక్సెస్ సాధిస్తే మేలని బాలీవుడ్ బాబులు ఆశిస్తున్నారు.
ప్రస్తుతానికి బాలీవుడ్ లో ఈ యేడాది బంపర్ హిట్స్ గా నిలచిన చిత్రాలు 'ఛావా, సైయారా, సితారే జమీన్ పర్' అనే చెప్పాలి. 'రైడ్ 2' హిట్ గా నిలచింది. మిగిలిన టాప్ టెన్ లో ఆరు బాలీవుడ్ మూవీస్ పరాజయం పాలయినవే. దాంతో సక్సెస్ రేటు ఈ సారి బాగా తగ్గింది. కనీసం మరో మూడు సినిమాలు బంపర్ హిట్స్ గా నిలిస్తే హిందీ సినిమా పరువు దక్కుతుందని ట్రేడ్ పండిట్స్ భావిస్తున్నారు. అందువల్లే రాబోయే సినిమాలపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ధనుష్, కృతి సనన్ కెమిస్ట్రీతో 'తేరే ఇష్క్ మే' ఆకట్టుకుంటుందని భావన. 'దురంధర్'కు ఉన్న బజ్ దృష్ట్యా మంచి ఓపెనింగ్స్ చూస్తుందని భావిస్తున్నారు. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ 'మేరే రహో' వైవిధ్యం ఉంటుందని అభిలాష. క్రిస్మస్ కానుకగా వచ్చే అనన్య పాండే 'తూ మేరీ మై తేరా - మై తేరా తూ మేరీ' కూడా యూత్ ను అలరిస్తే అంతకంటే కావలిసిందేముందనీ అంటున్నారు. మరి బాలీవుడ్ ఆశలను ఈ సినిమాలు ఏ మేరకు నెరవేరుస్తాయో చూడాలి.
Also Read: Akhanda 2: బాలయ్య ఊర మాస్ బ్యాటింగ్.. అఖండ 2 నెవర్ బిఫోర్ బిజినెస్
Also Read: Anaganaga Oka Raju: భీమవరం బాల్మా.. బాగా బీచ్ పోదుమా! నవీన్ ఆట, పాట అదరగొట్టాడుగా