Deewana Sequel: మనసులో మాట చెప్పిన షారుఖ్
ABN , Publish Date - May 09 , 2025 | 07:18 PM
రిషి కపూర్, దివ్య భారతి, షారుఖ్ ఖాన్ కీలక పాత్రలు పోషించిన 'దీవానా' సినిమాకు సీక్వెల్ రాబోతోంది. దాని స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టినట్టు నిర్మాత తెలిపారు.
రిషికపూర్ (Rishi Kapoor), దివ్య భారతి (Divya Bharti), షారుఖ్ ఖాన్ (Shahrukh Khan) ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'దీవానా' (Deewana). 1992లో వచ్చిన ఆ సినిమాను రాజ్ కన్వర్ డైరెక్షన్ లో ప్రముఖ దర్శక నిర్మాత గుడ్డు ధనోవా నిర్మించాడు. ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడా సినిమాకు సీక్వెల్ నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు ధనోవా తెలిపారు. ఇటీవల ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ, ''ఎప్పటినుండో 'దీవానా'కు సీక్వెల్ తీయాలనే ఆలోచన ఉంది. దాన్ని కార్యరూపంలోకి ఈ మధ్యే తీసుకొచ్చాం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ నడుస్తోంది. అయితే ఈ సినిమాలో నటించే ఆర్టిస్టుల గురించి ఇంకా ఏమీ అనుకోలేదు'' అని అన్నారు. తాను ప్రస్తుతం చేస్తున్న వెబ్ సీరిస్ స్ట్రీమింగ్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో 'దీవానా' సీక్వెల్ మీద ఫోకస్ పెడతానని గుడ్డు ధనోవా చెప్పారు.
ఇదిలా ఉంటే... 'దీవానా' సినిమా గురించి, అందులో తాను పోషించిన రాజా సహాయ్ పాత్రను గురించి మాట్లాడటానికి షారూఖ్ ఖాన్ మాత్రం పెద్దంత ఆసక్తి చూపించడం లేదు. ఆ మధ్య ఈ సినిమా గురించి అతను చెబుతూ, ''కెరీర్ ప్రారంభంలో చేసిన ఆ చిత్రంలోని పాత్ర నాకే మాత్రం సంతృప్తిని కలిగించలేదు. వీలైతే దాన్ని గురించి మాట్లాడటం, గుర్తు చేసుకోవడం చేయకూడదనే అనుకుంటాను'' అని అన్నారు. 'ఆ సినిమాలోకి తాను ఆలస్యంగా అడుగు పెట్టానని, వేరే సినిమా షూటింగ్ కాన్సిల్ కావడంతో ఆ డేట్స్ ను 'దీవానా'కు ఇచ్చాన'ని షారూఖ్ ఖాన్ చెప్పారు. 'మూవీ షూటింగ్ కు ముందు తనకు స్క్రిప్ట్ ఇవ్వలేదని, అప్పటి కప్పుడు సెట్స్ లోనే ప్రాక్టిస్ చేసి నటించానని, ఇప్పుడా సినిమా చూసుకుంటే అంత లౌడ్ గా ఆ పాత్రను ఎలా చేశానా? అనిపిస్తుంద'ని షారూఖ్ అన్నారు. తన విషయంలో తానే పెద్ద విమర్శకుడినని, 'దీవానా'లోని పాత్రను జనాలు ఎలా అభిమానించారో కూడా తనకు అర్థం కాదని చెప్పాడు. అయితే అప్పటికి తాను న్యూ ఫేస్ కాబట్టి... ప్రేక్షకులు ఆదరించి ఉండొచ్చనే కన్ క్లూజన్ కు షారుఖ్ ఖాన్ వచ్చాడు. ఇక ఇప్పుడు 'దీవానా' కు సీక్వెల్ వస్తోందనే విషయాన్ని కూడా కింగ్ ఖాన్ మనసులోకి తీసుకోవడానికి ఇష్టపడడేమో!
Also Read: Vijay Devarakonda: ఒకదాన్ని మించి మరోటి .. అసలేం ఫ్లాన్ చేస్తున్నావ్ సామీ!
Also Read: #Single Movie : #సింగిల్ మూవీ రివ్యూ
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి