#Single Movie : #సింగిల్ మూవీ రివ్యూ

ABN , Publish Date - May 09 , 2025 | 01:25 PM

శ్రీవిష్ణు, కేతికా శర్మ, ఇవానా హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా '#సింగిల్'. కార్తీక్ రాజు డైరెక్ట్ చేసిన ఈ మూవీ శుక్రవారం జనం ముందుకు వచ్చింది.

'సామజవర గమన' (Samajavaragamana) తర్వాత వచ్చిన హీరో శ్రీవిష్ణు (Srivishnu) 'ఓమ్ భీమ్ బుష్' (Om Bheem Bush) , 'స్వాగ్' (Swag) సినిమాలు నిరాశపరిచాయి. ఈ రెండు కొన్ని వర్గాలను మాత్రమే మెప్పించాయి. ఈ నేపథ్యంలో తనకు కలిసొచ్చిన వినోదాన్నే నమ్మకుని మరోసారి శ్రీవిష్ణు 'హ్యాష్ ట్యాగ్ సింగిల్' (#Single) మూవీని చేశాడు. 'నిను వీడని నీడను నేను' ఫేమ్ కార్తిక్ రాజు (Caarthick Raju) తెరకెక్కించిన ఈ సినిమా శుక్రవారం జనం ముందుకొచ్చింది.

కథ ఏమిటంటే...

సింగిల్ గా ఉండే విజయ్ (శ్రీవిష్ణు) జీవితంలోకి ఇద్దరు అమ్మాయిలు ఒకేసారి ప్రవేశిస్తారు. ఒకరు అతను ప్రేమించిన పూర్వ (కేతిక శర్మ) (Ketika Sharma) కాగా, మరొకరు తనని ప్రేమించిన హరిణి (ఇవానా) (Ivana). సింగిల్ బతుకుతో వెక్స్ అయిపోయిన విజయ్ వీరిద్దరిలో ఎవరిని చూజ్ చేసుకున్నాడు? ఒకరిని నమ్మి వేరొకరిని చేజార్చుకుని, తిరిగి వెనక్కి చూసుకుంటే ఏం కోల్పోయాడు? అనేదే 'హ్యాష్ ట్యాగ్ సింగిల్' స్టోరీ. ఈ సినిమా కోసం దర్శకుడు కార్తీక్ రాజు ఎలాంటి కథనూ రాసుకున్నట్టుగా అనిపించదు... ఓ లైన్ అనుకుని, దానికి అనుగుణంగా సీన్స్ రాసుకుంటూ వెళ్ళిపోయాడు. భాను భోగవరపు, నందు సవిరిగాన తమదైన శైలిలోని కాంటెంపరరీ ఇష్యూస్ ను మిక్స్ చేసి కామెడీగా సంభాషణలు రాసేశారు. దాంతో సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ ఓ ఫన్ రైడ్ లా సాగిపోయింది. ఎక్కడా, ఏ ఒక్క సన్నివేశం కూడా హృదయాన్ని హత్తుకోదు, మనసును కదిలించదు. థియేటర్లో పంచ్ డైలాగ్స్ కు, లీడ్ క్యారెక్టర్స్ చేసే కామెడీకీ సరదాగా నవ్వుకోగలం తప్పతే... ఆ తర్వాత చెప్పుకోవడానికి ఏమీ ఉండదు.

ఎలా ఉందంటే...

బ్యాంక్ ఎంప్లాయ్ అయిన విజయ్... కార్ షోరూమ్ లో సేల్స్ గర్ల్ అయిన పూర్వ మధ్య సాగే ప్రేమకథను దర్శకుడు చాలా సాగతీశాడు. ఊహించని విధంగా వీరిద్దరి మధ్యలోకి ఎంటర్ అయ్యే హరిణి కథ మొదట్లో కాస్తంత ఆసక్తిని కలిగించినా ఆ తర్వాత బోర్ కొట్టేస్తుంది. ఇక సెకండ్ ఆఫ్ లో హరిణి నేపథ్యాన్ని చెబుతూ రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) క్యారెక్టర్ ను ఎంటర్ చేసే సరికీ ఏదో ఆసక్తికరమైన మలుపు సినిమా తీసుకోబోతోందని ఆశపడతాం. కానీ అది కూడా బలవంతంగా అతికించిన తంతుగానే ఉండిపోయింది. ఇక క్లయిమాక్స్ లో ఎంట్రీ ఇచ్చే ప్రత్యేక పాత్రలూ ఏమంత కిక్ ఇచ్చేవి కాదు. రొటీన్ కు భిన్నంగా క్లయిమాక్స్ పెట్టాలనే తాపత్రయం తప్పితే... ఆడియెన్స్ నుండి మార్కులు పొందాలనే ఆలోచన మేకర్స్ కు లేదనిపిస్తోంది.


ఆర్టిస్ట్స్... టెక్నీషియన్స్...

నటీనటుల విషయానికి వస్తే... ఇలాంటి పాత్రలు చేయడం శ్రీవిష్ణుకు కొట్టిన పిండే. ఎప్పటిలానే రెచ్చిపోయాడు. పక్కనే 'వెన్నెల' కిశోర్ (Vennela Kishore) ఉండేసరికీ పంచ్ డైలాగ్స్ మరింతగా పేలాయి. కేతిక శర్మ, ఇవానా నటన గురించి పెద్దంత చెప్పకోవడానికి ఏమీ లేదు. కేతికా శర్మకు ఈ సినిమా కూడా కలిసిరాలేదు. ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఇవానా కూ ఏమంత చెప్పుకోదగ్గ డెబ్యూ మూవీ కాదు. బ్యాంక్ మేనేజర్ గా నటించిన వీటీవీ గణేశ్ (VTV Ganesh) మీద చిత్రీకరించిన సన్నివేశాలు పరమ రొటీన్ గా ఉన్నాయి. రాజేంద్ర ప్రసాద్, కల్పలత, ప్రభాస్ శ్రీను, కిర్రాక్ సీత, శత్రు ఇందులో ఇతర పాత్రలను పోషించారు. క్లయిమాక్స్ లో నార్నే నితిన్, రెబ్బా మోనికా జాన్, మానసా చౌదరి, మాస్టర్ రేవంత్ (బుల్లి రాజు) అతిథి పాత్రల్లో మెరిశారు. విశాల్ చంద్రశేఖర్ (Vishal Chandrashekhar) స్వరపరిచిన పాటలు ఓకే... అయితే నేపథ్య సంగీతం చాలా సన్నివేశాలను ఎలివేట్ చేసింది. వేల్ రాజ్ సినిమాటోగ్రఫీ బాగుంది.

అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో ఈ సినిమాను విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించారు. నిర్మాణ పరంగా ఎక్కడా రాజీ పడలేదు. కథే లేకుండా... డైలాగ్ కామెడీతో నెట్టుకొచ్చేయాలని దర్శకుడు కార్తీక్ రాజు చేసిన ప్రయత్నం అంతగా ఫలించలేదు. టైటిల్ కార్డ్స్ లో శ్రీవిష్ణు పేరుకు ముందు కింగ్ ఆఫ్ ఎంటర్ టైన్ మెంట్ అని వేశారు. ఆ మేరకు వినోదాన్ని అతనైతే అందించాడు. ట్రైలర్ రిలీజ్ కాగానే ఎదురైన కాంట్రవర్శీతో కొన్ని డైలాగ్స్ ను తొలగించారు. కొన్ని సంభాషణలకు సెన్సార్ వారే అభ్యంతరం పెట్టినట్టు అర్థమౌతోంది. ఏదేమైనా... స్టార్ హీరోలను ఇమిటేట్ చేయడంలో శ్రీవిష్ణు పండిపోయాడనే చెప్పాలి.

రేటింగ్: 2.5/ 5

ట్యాగ్ లైన్: ఫన్ రైడ్ 

Also Read: Subham Review: సమంత నిర్మించిన 'శుభం' సినిమా ఎలా ఉందంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 09 , 2025 | 03:34 PM