Janhvi Kapoor: అప్పుడు ‘అతిలోక సుందరి’.. ఇప్పుడు ‘పరమ్ సుందరి’
ABN, Publish Date - Aug 31 , 2025 | 09:44 AM
ఒకవైపు బాలీవుడ్ సినిమాలతో పాటు, టాలీవుడ్‌లో కూడా స్టార్‌హీరోలతో నటిస్తూ బిజీగా ఉంటోంది జాన్వీ కపూర్. తాజాగా సిద్దార్థ్ మల్హోత్రా సరసన ‘పరమ్ సుందరి’గా చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించనుంది.
అప్పుడెప్పుడో శ్రీదేవి ‘అతిలోక సుందరి’గా అలరిస్తే, ఇప్పుడు ఆమె కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ‘పరమ్ సుందరి’గా పలకరిస్తోంది. ఒకవైపు బాలీవుడ్ సినిమాలతో పాటు, టాలీవుడ్‌లో కూడా స్టార్‌హీరోలతో నటిస్తూ బిజీగా ఉంటోంది. తాజాగా సిద్దార్థ్ మల్హోత్రా సరసన ‘పరమ్ సుందరి’గా (param Sundari) అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న సందర్భంగా ఈ సుందరి పంచుకున్న కబుర్లివి...
అమ్మ చెప్పిందని... (Sridevi)
ఎంత కష్టమైన పాత్రనైనా పోషిస్తా గానీ జుట్టు లేకుండా నటించమంటే మాత్రం నిర్మొహమాటంగా ‘నో’ చెప్పేస్తా. ‘ఉలఝ్’లో నేను ఐఎఫ్‌ఎస్ ఆఫీసర్‌గా నటించా. అందులో దర్శకుడు జుట్టు కత్తిరించుకోమంటే కుదరదన్నాను. ఎందుకంటే దానికి బలమైన కారణం ఉంది. నా తొలి సినిమా ‘ధడక్’ కోసం జుట్టు కత్తిరించుకున్నా. షూటింగ్ నుంచి ఇంటికి వెళ్లగానే ‘ఎందుకిలా చేశావ్’ అని అమ్మ నా మీద అరిచింది. ఏ పాత్ర కోసమైనా ఎట్టిపరిస్థితుల్లోనూ జుట్టు కత్తిరించుకోవద్దని చెప్పింది. నా జుట్టంటే ఆమెకు అంత ఇష్టం. అమ్మ మాటకు కట్టుబడే ఎప్పటికీ హెయిర్ కట్ చేసుకోకూడదని ఫిక్సయ్యా.
‘కేన్స్’తో అనుబంధం
ఈ ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తొలిసారి పాల్గొన్నా. అమ్మకు కేన్స్ ఎంతో ఇష్టమైన ప్రాంతం. హాలీడేస్ ఎంజాయ్ చేయడానికి తరచూ మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తుండేది. ఈసారి నేను, నాన్న, చెల్లి వెళ్లాం. అమ్మ లేకుండా అక్కడికి వెళ్లడం కాస్త బాధగా అనిపించింది. నేను నటించిన ‘హోమ్‌బౌండ్’ చిత్రాన్ని కేన్స్‌లో ప్రదర్శించారు. సినిమా చూసి నాన్న బాగా ఎమోషనల్ అయ్యారు. ఆ మధుర క్షణాలను నేను ఎప్పటికీ మర్చిపోలేను.
వింత అలవాట్లున్నాయి...
నాకు కొన్ని వింత అలవాట్లు ఉన్నాయి. నేను ఇంట్లోకి ముందుగా కుడికాలు పెట్టే వెళ్తాను. ప్రతీ రెండు గంటలకోసారి షుగర్‌ఫ్రీ ఐస్‌క్రీమ్ తింటా. నిద్రపోయేటప్పుడు తప్పనిసరిగా నా పక్కన ఎవరో ఒకరు ఉండాలి. నా సోదరి ఖుషీ లేకుంటే నిద్రపోవడం కష్టంగా అనిపిస్తుంది. నిద్రపోయేటప్పుడు నా పాదాలను, ఆమె పాదానికి తాకించి ఉంచుతా. అలాగే నాకిష్టమైన వారి చేతుల్ని ఎప్పుడూ పట్టుకునే ఉంటాను. బయట కూడా అలాగే కనిపిస్తుంటా.
క్రికెట్‌కు అభిమానిని...
మా నాన్నకు క్రికెట్ అంటే పిచ్చి. ఆయన క్రికెట్ చూస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయలేం. ‘మమ్మల్ని కూడా పట్టించుకోకుండా చూసేంతగా అందులో ఏముంది?’ అని చిన్నప్పుడు అనుకునేదాన్ని. కానీ ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ సినిమా చేసిన తర్వాత నాకు క్రికెట్‌పై అవగాహన ఏర్పడింది. ఇప్పుడు నాన్నతో పాటు నేను కూడా క్రికెట్ ఎంజాయ్ చేయడం మొదలెట్టా. బంతి బ్యాట్‌ని తాకగానే అది సిక్సా, ఫోరా అని మేము ముందే కామెంటరీ ఇచ్చేస్తాం. మ్యాచ్ జరిగినప్పుడు స్టేడియంలో ఉండే హడావిడి అంతా మా ఇంట్లోనూ ఉంటుంది. ముఖ్యంగా ధోనీ హుందాతనం, రోహిత్‌శర్మ నాయకత్వ లక్షణాలు, విరాట్‌కొహ్లీ ఫైర్, సూర్యకుమార్ యాదవ్ గ్రేస్ నాకు బాగా నచ్చుతాయి.
చోర్‌బజార్‌లో సీక్రెట్‌గా...
నేను పెద్ద ఫుడీని. దక్షిణాది వంటకాలన్నీ ఇష్టంగా తింటా. రసం రైస్, ఘీ పొడి రైస్, అప్పం, ఇడియాప్పం, చికెన్ చెట్టినాడు, స్పగెట్టీ నాకు భలే ఇష్టం. కొత్తకొత్త కాంబినేషన్స్‌లో ఫుడ్ ట్రై చేస్తా. వాటిల్లో ఇడ్లీ విత్ చికెన్ కర్రీ నా ఫేవరెట్. హైదరాబాద్ వెళ్లినప్పుడు వీలు కుదుర్చుకుని మరీ చోర్‌బజార్‌లో వాలిపోతా. నన్ను ఎవరూ గుర్తుపట్టకుండా ముఖాన్ని స్కార్ఫ్‌తో కవర్ చేసుకుని... ఇష్టమైన కబాబ్స్, బిర్యానీ లొట్టలేసుకుంటూ తిని గప్‌చుప్‌గా వచ్చేస్తా.
ఫటా ఫట్
సెలబ్రిటీ క్రష్: ఆస్టిన్ బట్లర్ (హాలీవుడ్ నటుడు)
ఇష్టమైన సినిమాలు: టైటానిక్, గాన్ విత్ ది విండ్, ది ఆర్టిస్ట్, ది అపార్ట్‌మెంట్
ఇష్టమైన గాయకుడు: ఫ్రాంక్ సినట్రా
లక్కీనంబర్: 6
మీలో మీకు నచ్చేవి: కళ్లు
మీరు బాగా చేసే వంటకం: స్పగెట్టీ
నిద్రపోయే ముందు కచ్చితంగా చేసే పని: నాన్న, చెల్లికి గుడ్‌నైట్ చెప్పడం.
ALSO READ:
Aarudra: చిత్రసీమలో చెరిగిపోని తరిగిపోని ఆరుద్ర సొంతం
Nandamari Balakrishna: బాలయ్య గొప్ప మనసు.. సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 50 లక్షలు సాయం