Boney Kapoor: శివగామి పాత్రకు శ్రీదేవి డిమాండ్లు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన బోనీ కపూర్

ABN , Publish Date - Sep 06 , 2025 | 09:01 PM

ఎన్నో ఐకానిక్ క్యారెక్టర్స్ లో నటించిన సెలబ్రిటీల కన్నా ముందు డైరెక్టర్స్ వారి స్థానంలో వేరొకరిని ఖచ్చితంగా అనుకొని ఉంటారు. అలా బాహుబలి (Bahubali) సినిమాలో శివగామి పాత్రకు రమ్యకృష్ణ (Ramyakrishnan) కన్నా ముందు అతిలోకసుందరి శ్రీదేవి (Sridevi)ని అనుకున్నారంట.

Sridevi

Boney Kapoor: పండే ప్రతి బియ్యపు గింజ మీద తినేవారి పేరు రాసిపెట్టి ఉంటుంది అని పెద్దలు అంటారు. అలాగే సినిమా విషయానికొస్తే రాసే ప్రతి పాత్ర పై కూడా నటించే నటీనటుల పేర్లు రాసి ఉంటాయి. సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా నటించిన పాత్రలో తాము ఉన్నామో లేదో వారికి కూడా తెలియదు. ఎన్నో ఐకానిక్ క్యారెక్టర్స్ లో నటించిన సెలబ్రిటీల కన్నా ముందు డైరెక్టర్స్ వారి స్థానంలో వేరొకరిని ఖచ్చితంగా అనుకొని ఉంటారు. అలా బాహుబలి (Bahubali) సినిమాలో శివగామి పాత్రకు రమ్యకృష్ణ (Ramyakrishnan) కన్నా ముందు అతిలోకసుందరి శ్రీదేవి (Sridevi)ని అనుకున్నారంట. ఈ విషయాన్ని రాజమౌళి ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పకొచ్చాడు.


అయితే శ్రీదేవి ఈ పాత్రను కాదు అనడానికి ఆమె గొంతెమ్మ కోరికలే కారణం అని అప్పట్లో ఎన్నో వార్తలు వచ్చాయి. శ్రీదేవి శివగామి పాత్ర చేయడానికి రూ. 10 కోట్లు డిమాండ్ చేసిందని అంతేకాకుండా హోటల్ రూమ్ లో ఒక ఫ్లోర్ మొత్తం కావాలని అడిగిందని అందుకే ఆమెను రిజెక్ట్ చేశామని జక్కన్న చెప్పుకొచ్చాడు. అయితే ఇందులో ఏది నిజం ఏది అబద్దం అని చెప్పడానికి శ్రీదేవి ఇప్పుడు జీవించలేదు ఇక ఈ విషయమై ఏ రోజు కూడా రాజమౌళి నోరు విప్పింది కూడా లేదు. అయితే ఇన్నేళ్ల తర్వాత శ్రీదేవి భర్త బోనికపూర్ బాహుబలి సినిమాను శ్రీదేవి రిజెక్ట్ చేయడానికి కారణం ఆమె గొంతెమ్మ కోరికలు కావు అని ఆ సినిమా నిర్మాతలే అని చెప్పుకు రావడం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.


ఒక ఇంటర్వ్యూలో బోనీ కపూర్ మాట్లాడుతూ 'మొదట రాజమౌళి ఆ పాత్రకు శ్రీదేవిని అనుకున్నారు. రాజమౌళి ఆ సినిమా సమయంలో మా ఇంటికి వచ్చేవాడు. సినిమా కోసం శ్రీదేవి ఎంతలా తపించేదో చూసి రాజమౌళి ఆమెపై మరింత గౌరవాన్ని పెంచుకున్నాడు। శ్రీదేవి అభిమానిని అని రాజమౌళి పంపిన మెసేజ్ ఇప్పటికీ నా ఫోన్లో ఉంది. అయితే ఈ సినిమా నిర్మాతల వలన శ్రీదేవి ఆ పాత్రను చేయలేకపోయింది. రాజమౌళి సినిమా కథ చెప్పడానికి మా ఇంటికి వచ్చినప్పుడు శ్రీదేవితో మాట్లాడుతూ ఉండేవాడు. ఆయన వెళ్ళగానే నిర్మాతలు వచ్చేవాళ్ళు. ఈ పాత్రకు వారు శ్రీదేవికి చాలా తక్కువ పారితోషికం ఇస్తానని చెప్పారు. అప్పుడే ఆమె ఇంగ్లీష్ వింగ్లీష్ అనే సినిమా చేస్తుంది. ఆ సినిమాకి ఇచ్చిన పారితోషికం కన్నా ఇంకా తక్కువ ఆఫర్ చేశారు. ఆమె ఏమి చిన్ననాటి కాదు. ఆమె వల్ల కూడా సినిమాకు ఎంతో కొంత పబ్లిసిటీ అనేది వస్తుంది. హిందీలో మరింత హైప్ తీసుకొచ్చే స్టార్ ఆమె. అలాంటప్పుడు ఆమెను ఒక మెట్టు దిగి ఆ సినిమా చేయమని నేనెందుకు చెప్పాలి.


అక్కడ జరిగిన విషయం ఇదే.. కానీ, నిర్మాతల రాజమౌళికి జరిగిందంతా రివర్స్ లో చెప్పారు. శ్రీదేవి హోటల్లో ఒక ఫ్లోర్ మొత్తం కావాలని అడిగినట్లు.. చాలా ఎక్కువ వారితో పారితోషికం డిమాండ్ చేసినట్లు చాడీలు చెప్పుకొచ్చారు. అయితే మేము డిమాండ్ చేసిందల్లా ఒకే ఒక్క విషయంలో.. అప్పుడు మా పిల్లలు చిన్న పిల్లలు.. వారితో ఎక్కువ సమయాన్ని గడపాలని మేము అనుకున్నాము. పిల్లలకు హాలిడేస్ వచ్చినప్పుడు మాత్రమే పెద్ద షెడ్యూల్స్ ప్లాన్ చేయకుండా ఉండాలని కోరాము. అంతకుమించి వేరే డిమాండ్ ఏది.. శ్రీదేవి చేయలేదు. కానీ, నిర్మాతలు వేరే విధంగా చెప్పడంతో ఆ పాత్ర శ్రీదేవి చేయలేదు. నిర్మాత శోభు యార్లగడ్డకు డబ్బులు ఖర్చు చేయడం అనేది అసలు ఇష్టం ఉండదు. అందుకే శ్రీదేవి పై ఇలాంటి పుకార్లు పుట్టించాడు. ఆమె అసలు ప్రొఫెషనల్ కాదు అని రూమర్స్ స్ప్రెడ్ చేశాడు.


ఇక వారి మాటలు విన్న రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో శ్రీదేవి గొంతెమ్మ కోరికలు కోరిందని తెలిపాడు. ఆ ఇంటర్వ్యూ చూశాక శ్రీదేవి చాలా బాధపడింది. 50 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. 300కు పైగా సినిమాలు చేశా.. అయినా నేనెప్పుడూ ఇలాంటి డిమాండ్లు చేయలేదు. అలా డిమాండ్ చేసే స్థాయికి నేను చేరుకుంటే ఇప్పుడు ఇండస్ట్రీలో నేను ఉండేదాన్నా ..? నా గురించి అలా తప్పుగా మాట్లాడుతుంటే చాలా బాధగా ఉంది. అని ఎంతో ఆవేదన వ్యక్తం చేసింది' అని బోనీ కపూర్ ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక బోనీ వ్యాఖ్యలపై శోభు యార్లగడ్డ ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి.

Sunday Tv Movies: ఆదివారం, Sep 07.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

SSMB29: ఇదెక్కడి ట్విస్ట్ రా మావా.. శ్రీరాముడిగా మహేష్

Updated Date - Sep 06 , 2025 | 09:02 PM