Hera Pheri 3: పరేశ్‌ రావల్ పై అక్షయ్ ఆగ్రహం...

ABN , Publish Date - May 20 , 2025 | 04:03 PM

'హేరా ఫేరీ -3' చిత్రం నుండి ప్రధాన పాత్రధారి పరేశ్ రావల్ తప్పుకోవడం బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారిపోయింది. పరేశ్ ప్రవర్తనతో ఆగ్రహించిన అక్షయ్ కుమార్ రూ. 25 కోట్ల నష్టపరిహారానికి లీగల్ నోటీస్ పంపాడు.

బాలీవుడ్ లో సీక్వెల్స్ హవా బాగా వీస్తోంది. అయితే ఒక్కోసారి అందులోని ఆర్టిస్టులు కొందరు అనివార్య కారణాలతో మారిపోతుంటారు. బట్ అక్షయ్ కుమార్ (Akshay Kumar), సునీల్ శెట్టి (Suniel Shetty), పరేశ్‌ రావల్ (Paresh Rawal) కీలక పాత్రలు పోషించిన 'హేరా ఫేరీ' (Hera Pheri), 'ఫిర్ హేరా ఫేరీ' చిత్రాలు మాత్రం ప్రధాన తారాగణం మారకుండానే తెరకెక్కాయి. కానీ చిత్రంగా ఇప్పుడు మూడో భాగం సెట్స్ పైకి వెళ్ళే సరికీ ఇందులో కీలక పాత్రధారి పరేశ్‌ రావల్ మూవీ నుండి తప్పుకుని చిత్రబృందానికి షాక్ ఇచ్చాడు. పరేశ్ రావల్ ఆకస్మిక నిర్ణయంతో ఖంగు తిన్న చిత్ర కథానాయకుడు, నిర్మాత కూడా అయిన అక్షయ్ కుమార్ తన నష్టాన్ని భర్తీ చేయాల్సిందిగా కోరుతూ ఏకంగా 25 కోట్ల రూపాయల నష్టపరిహారానికై డిమాండ్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని లీగల్ నోటీస్ ద్వారా పరేశ్ రావల్ కు పంపాడు.


ప్రస్తుతం సెట్స్ పై ఉన్న 'హేరా ఫేరి -3' సినిమా ప్రియదర్శన్ దర్శకత్వంలో కేప్ ఆఫ్‌ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై అక్షయ్ కుమార్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ ను ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ లకు ముందు విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ సినిమా నుండి హఠాత్తుగా పరేశ్‌ రావల్ తప్పుకోవడంతో వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. దీంతో ఆగ్రహించిన అక్షయ్ ఏకంగా తన సహనటుడికి లీగల్ నోటీసు పంపాడు. పరేశ్‌ రావల్ 'హేరా ఫేరీ'లో బాబూరావ్ గణపత్ రావ్ ఆప్టే పాత్రకు ప్రాణం పోశాడు. ఇద్దరు హీరోలతో సరిసమానంగా అతని పాత్ర కూడా ఉంటుంది. అయితే... తాజా సీక్వెల్ మేకింగ్ పట్ల పరేశ్‌ రావల్ అంత సంతృప్తికరంగా ఉన్నట్టు కనిపించడం లేదు. ఇష్టం లేకుండా నటించడం కంటే తప్పుకోవడం మంచిదని భావించే, పర్యవసానాలను ఊహించే అతను తప్పుకున్నాడని తెలుస్తోంది. బయట అందరూ అనుకుంటున్నట్టుగా దర్శకుడు ప్రియదర్శన్ కు తనకు మధ్య ఎలాంటి క్రియేటివ్ డిఫరెన్సెస్ లేవని పరేశ్‌ రావల్ చెప్పడం విశేషం.


ఇదిలా ఉంటే... 'హేరా ఫేరీ' మొదటి భాగం 2000 సంవత్సరంలో వచ్చింది. ఆ సినిమాను 2002లో తెలుగులో 'ధనలక్ష్మీ ఐ లవ్ యూ' (Dhanalaxmi I Love You) అనే పేరుతో శివ నాగేశ్వరరావు (Siva Nageswara Rao) రీమేక్ చేశారు. 'అల్లరి' నరేశ్‌ (Allari Naresh), ఆదిత్య ఓం (Aditya Om) హీరోలుగా, అంకిత (Ankitha) హీరోయిన్ గా నటించారు. చిత్రం ఏమంటే... హిందీలో పరేశ్ రావల్ పోషించిన పాత్రను తెలుగులో కోట శ్రీనివాసరావు (Kota Srinivasarao) తో చేయించాలని శివ నాగేశ్వరరావు భావించారు. ఒకటి రెండు రోజుల షూటింగ్ కూడా ఆయన జరిగింది. కానీ ఎందుకో హఠాత్తుగా ఆయన సినిమా నుండి తప్పుకున్నారు. దాంతో ఆ పాత్రకు సీనియర్ నటుడు నరేశ్‌ (Naresh) ను తీసుకున్నారు. తెలుగులో మొదటి భాగంలోనే ఆ పాత్ర మారిపోగా... హిందీలో మూడో భాగంలో స్వయంగా పరేశ్‌ రావలే తప్పుకున్నాడు!

Also Read: Allu Arjun - Atlee: అల్లు అర్జున్‌.. అట్లీ.. ఓ అతిథి...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 20 , 2025 | 04:03 PM