Actress Rekha: మరోసారి జనం ముందుకు 'ఉమ్రావ్ జాన్'

ABN , Publish Date - Jun 03 , 2025 | 12:12 PM

జాతీయ ఉత్తమనటిగా రేఖ కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింప చేసిన సినిమా 'ఉమ్రావ్ జాన్'. ముజాఫర్ అలీ దర్శకత్వం వహించిన ఈ కల్ట్ క్లాసిక్ మూవీ మరోసారి జనం ముందుకు రాబోతోంది.

హిందీ చిత్రసీమలో అందాల సుందరి, పద్మశ్రీ అవార్డు గ్రహీత రేఖ (Rekha) ది ప్రత్యేక స్థానం. ఆమెతో పోల్చదగ్గ నటీమణి మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. చామనఛాయ కలిగిన నటీమణులు బాలీవుడ్ లో చాలామంది ఉన్నా... అందులో రేఖ సమ్ థింగ్ స్పెషల్ గా ఉంటారు. ఆమెలోని గ్రేస్ ను మరొకరిలో ఊహించలేం. అలానే రేఖ నటించిన సినిమాలలో 'ఉమ్రావ్ జాన్' (Umrao Jaan) కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. 1981 జనవరి 2న విడుదలైన ఈ సినిమాను ముజాఫర్ అలీ (Muzaffar Ali) డైరెక్ట్ చేశారు. 1905లో వచ్చిన నవల ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. లక్నోకు చెందిన వేశ్య నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఫరూఖ్ షేక్, నసీరుద్దీన్ షా, రాజ్ బబ్బర్, షౌకత్ ఆజ్మీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రేఖకు 'ఉమ్రావ్ జాన్' మూవీ ఉత్తమ నటిగా జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది. అలానే ఉత్తమ సంగీత దర్శకుడిగా ముహమ్మద్ జహూర్ ఖయ్యం, ఉత్తమ నేపథ్య గాయనిగా ఆశా భోస్లే, జాతీయ ఉత్తమ కళా దర్శకుడిగా మంజూర్ అవార్డులు అందుకున్నారు. అలానే ఉత్తమ దర్శకుడిగా ముజఫర్ అలీ, సంగీత దర్శకుడు ముహ్మద్ జహూర్ ఖయ్యంతో కలిసి ఫిల్మ్ ఫేర్ అవార్డు పొందారు.


అప్పట్లో సంగీతాభిమానుల మనసుల్ని దోచుకున్న 'ఉమ్రావ్ జాన్' మూవీ ఇప్పుడు తిరిగి జనం ముందుకు రాబోతోంది. దీనిని 4 కె వర్షన్ లో జూన్ 27న విడుదల చేయబోతున్నట్టు పీవీఆర్, ఐనాక్స్ (PVR INOX) సంస్థ తెలిపింది. మరి రీ-రిలీజ్ సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్న నేపథ్యంలో 'ఉమ్రావ్ జాన్'ను ఈ తరం ప్రేక్షకులు ఏ తీరున ఆదరిస్తారో చూడాలి.

Also Read: Raja Saab: ప్రభాస్‌ రాజా సాబ్ అప్డేట్ వ‌చ్చేసింది.. ఇక ఫ్యాన్స్ ను ఆప‌డం క‌ష్ట‌మే!

Also Read: Roshan, Sailesh: శైలేష్ డైరెక్ష‌న్‌లో రోష‌న్‌.. భ‌లే సెట్ చేశారుగా!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Jun 03 , 2025 | 04:50 PM