సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Ramayan: అప్పుడు రాముడు.. ఇప్పుడు దశరథుడు.. సీత రియాక్షన్‌

ABN, Publish Date - Jul 07 , 2025 | 04:39 PM

రమానంద్‌ సాగర్‌ తెరకెక్కించిన ‘రామాయణం’లో రాముడిగా నటించిన అరుణ్‌ గోవిల్‌ నితేశ్‌ తివారి రామాయణలో దశరథుడి పాత్రలో కనిపించనున్నారు.

Ramayana - Arun Govil

రామాయణం (Ramayana) పేరుతో ఎన్ని సీరియళ్లు, సినిమాలు వచ్చినా మాస్టర్‌ పీస్‌ మాత్రం రమానంద్‌ సాగర్‌ తెరకెక్కించిన ‘రామాయణం’ మాత్రమే! అందులో రాముడిగా అరుణ్‌ గోవిల్‌(Arun Govil), సీతగా దీపికా చిఖాలియా నటించారు. లక్ష్మణుడి పాత్రలో సునీల్‌ లహ్రీ ప్రేక్షకుల్ని అలరించారు. ఇప్పటికీ ఆ పాత్రల పేరు చెబితే వారే గుర్తొస్తారు. అందులో రాముడిగా నటించిన అరుణ్‌ గోవిల్‌ ప్రస్తుతం నితేశ్‌ తివారి (Nitesh Tiwari)‘రామాయణ’లో దశరథుడి (Dasaratha)పాత్రలో కనిపించనున్నారు. దీనిపై దీపికా చిఖాలియా (Dipika Chikhlia) స్పందించారు.


‘‘ఇప్పటికీ దేశవ్యాప్తంగా ప్రేక్షకులంతా అరుణ్‌ గోవిల్‌ను రాముడిగా, నన్ను సీతగా మదిలో గుర్తుండిపోయాం. మాపై ఆ ఆదరణ ఇప్పటికీ అలాగే ఉంది. ఇప్పుడు అరుణ్‌ గోవిల్‌ను దశరథుడిగా వెండితెరపై చూడడం కాస్త కష్టంగానే ఉంటుంది. ఒకసారి రాముడి పాత్రలో చూసిన వ్యక్తులను మరో పాత్రలో ఊహించుకోలేరు. లక్షలాది మందికి అరుణ్‌తో ఇప్పటికీ రాముడిగానే అనుబంధం ఉంది. ‘రామాయణ’ సినిమాలో దశరథుడిగా నటించడానికి అంగీకరించడం ఆయన వ్యక్తిగత నిర్ణయమే అయినప్పటికీ ప్రేక్షకులు దీన్ని అంగీకరించడం కొంచెం కష్టం. నా అభిప్రాయం ప్రకారం మీరు ఒక్కసారి రాముడిగా గుర్తింపు తెచ్చుకుంటే ప్రేక్షకుల దృష్టిలో ఎప్పటికీ మీరు రాముడే’’ అని దీపికా చిఖాలియా అన్నారు. ఇక ఈ సినిమా కోసం తనను ఎవరూ సంప్రదించలేదని ఒకవేళ సంప్రదించినా తనకు రామాయణంలో సీతగా కాకుండా మరో పాత్రలో కనిపించడం ఏమాత్రం ఆసక్తి లేదని ఆమె తెలిపారు.

(అప్పటి దశరథుడు బాల్ ధూరి )
రమానంద్‌ సాగర్‌ రామాయణంలో దశరథ మహారాజుగా బాల్‌ దూరి నటించారు. ఇప్పుడు ఆ పాత్రను అరుణ్‌ గోవిల్‌ చేయనున్నారు. మరోవైపు ‘రామాయణ’కు సంబంధించిన మరో వార్త కూడా  వైరల్‌గా మారింది. ‘హర హర మహాదేవ’ సీరియల్‌తో  శివుడిగా ఆకట్టుకున్న మోహిత్‌ రైనా ఇందులోను శివుడిగా కనిపించనున్నట్లు వార్తలొస్తున్నాయి. సుమారు రూ.1600 కోట్లతో బడ్జెట్‌తో ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కనుంది. ఇందులో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌, సీతగా సాయిపల్లవి,  రావణుడిగా యశ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నమిత్‌ మల్హోత్రా నిర్మిస్తున్నారు. యశ్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 2026 దీపావళికి పార్టు 1, 2027 దీపావళికి రెండడో భాగం విడుదల కానున్నాయి.

Updated Date - Jul 07 , 2025 | 05:01 PM