Amitabh Bachchan: కేబీసీ నుండి తప్పుకుంటున్న అమితాబ్..
ABN , Publish Date - May 23 , 2025 | 04:14 PM
గ్రేట్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ కెరీర్ లో ఎన్నెన్నో మైల్ స్టోన్స్... అందులో 'కౌన్ బనేగా కరోడ్ పతి' ఓ మరపురాని అంశం... ఇప్పటి దాకా 15 సీజన్స్ లో హోస్ట్ గా కనిపించి అలరించారు అమితాబ్ బచ్చన్ ... కేబీసీ అంటే అమితాబ్ - అమితాబ్ అంటే కేబీసీ గా వెలిగింది... కానీ, ఇప్పుడు బిగ్ బి లేకుండానే కేబీసీ తాజా సీజన్ సాగనుందని వినిపిస్తోంది.
బ్రిటన్ లో విశేషాదరణ పొందిన 'హూ వాంట్స్ టు బీ ఏ మిలియనీర్' షో స్ఫూర్తితో మన దేశంలో 'కౌన్ బనేగా కరోడ్ పతి' (Kaun Banega Crorepati) రూపొందింది... పాతికేళ్ళ క్రితం 2000లో తొలిసారి 'కేబీసీ' జనం ముందు నిలచింది... అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) హోస్ట్ గా సాగిన ఈ షో ఫస్ట్ సీజన్ లో 315 ఎపిసోడ్స్ తో సందడే సందడి అంటూ సాగింది... అప్పట్లో తన నిర్మాణ సంస్థ 'ఏబీసీయల్' (ABCL) మిగిల్చిన నష్టాలను భర్తీ చేయడానికి 'కేబీసీ'లో హోస్ట్ గా నటించడం ఎంతో మేలు చేసిందని బిగ్ బి స్వయంగా చెప్పారు... అలా ఆరంభంలోనే అమితాబ్ కు 'కేబీసీ'కి లంకె కుదిరింది... అయితే రెండో సీజన్ జరుగుతూ ఉండగా, అమితాబ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు... దాంతో అర్ధాంతరంగా 'కేబీసీ' సెకండ్ సీజన్ ఆగిపోయింది... మూడో సీజన్ ను షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) హోస్ట్ గా 'కేబీసీ'ని మొదలెట్టారు నిర్వాహకులు... 53 ఎపిసోడ్స్ లో సాగిన మూడో సీజన్ షారుఖ్ హోస్ట్ కావడంతో అంతగా అలరించలేక పోయింది... మూడేళ్ళ గ్యాప్ తరువాత బిగ్ బి కోలుకోవడంతో 2010లో నాలుగో సీజన్ మొదలైంది... అప్పటి నుంచీ వరుసగా 13 సీజన్స్ లో అమితాబ్ హోస్ట్ గా అలరించారు... అంటే ఇప్పటి దాకా సాగిన మొత్తం 16 సీజన్స్ లో 15 అంకాలను అమితాబ్ రక్తి కట్టించారన్న మాట! అలాంటి బిగ్ బి లేకుండా 17వ సీజన్ రానుందని వినిపిస్తోంది.
బాలీవుడ్ సర్కిల్స్ సమాచారం ప్రకారం కొత్తగా మొదలయ్యే కేబీసీ 17వ సీజన్ కు సల్మాన్ ఖాన్ (Salman Khan) హోస్ట్ గా వ్యవహరించనున్నాడు... హిందీలో 'బిగ్ బాస్' షో ను రక్తి కట్టించడంలో సల్మాన్ ఖాన్ విజయం సాధించారు... ఇప్పటి దాకా 'బిగ్ బాస్' షో 18 సిరీస్ సాగాయి... వాటిలో నాలుగు సిరీస్ తప్ప అన్నిటికీ సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించడం విశేషం! 'బిగ్ బాస్' మూడో సిరీస్ కు అమితాబ్ బచ్చన్ కూడా హోస్ట్ గా వ్యవహరించారు... అయితే 'బిగ్ బాస్' (Bigg Boss) అంటే సల్మాన్ ఖాన్ గుర్తుకు వచ్చేలా చేశాడు... అలాగే సల్మాన్ నిర్వహించిన మరో షో 'దస్ కా ధమ్' కూడా ఆయన క్రేజ్ తోనే సక్సెస్ రూటులో సాగింది... అందువల్లే 'కేబీసీ' 17వ సీజన్ కు సల్మాన్ ఖాన్ ను హోస్ట్ గా ఎంచుకున్నారని టాక్!
'కేబీసీ'ని సోనీ నెట్ వర్క్స్ సంస్థ నిర్వహిస్తోంది... ఇప్పటి దాకా అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా విశేషంగానే అలరించిన 'కేబీసీ' షోను సల్మాన్ ఖాన్ నిర్వహిస్తే కొత్త ఊపు వస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు... పైగా అమితాబ్ బచ్చన్ 82 ఏళ్ళ వయసులో ఉన్నారు... అలాంటి అమితాబ్ కు కూడా శ్రమ కలిగించడం ఇష్టం లేకే 'కేబీసీ' నిర్వాహకులు సల్మాన్ ను ఎంచుకున్నారనీ బాలీవుడ్ టాక్... అమితాబ్ లేకుండా కేబీసిని ఊహించగలమా అని చాలామంది అంటున్నారు... కానీ, ఆయన వయసును కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా అని మరికొందరి మాట!... ఒకవేళ సల్మాన్ ఖాన్ 'కేబీసీ'ని నిర్వహిస్తే ఏ తీరున రేటింగ్స్ ఉంటాయో చూడాలని బాలీవుడ్ బాబులు ఆసక్తిగా చూస్తున్నారు... మరి 'కేబీసీ' 17వ సీజన్ ఎప్పుడు ఎలా మొదలవుతుందో చూద్దాం...
Also Read: Kayadu Lohar: నైట్ పార్టీకి రూ.35 లక్షలు... చిక్కుల్లో డ్రాగన్ బ్యూటీ... లిక్కర్ స్కాంలో పేరు
Also Read: Gamblers: సంగీత్ శోభన్ వర్సెస్ నార్నే నితిన్... ఏం జరుగబోతోంది...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి