Tillu Square: టిల్లుగాడి అల్లరి ఇక ఇంట్లోనే చూసుకోవచ్చు, ఎప్పుడు, ఎక్కడంటే...

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:12 PM

సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా, మల్లిక్ రామ్ దర్శకత్వంలో వచ్చిన 'టిల్లు స్క్వేర్' సినిమా త్వరలోనే ఓటిటి లో ప్రసారం కానుంది. జిడ్డుగాడు చేసే అల్లరిని ఇక ఇంట్లోనే అందరూ వీక్షించవచ్చు. ఒక్క తెలుగులోనే కాకుండా, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ప్రసారం కానుంది.

Tillu Square: టిల్లుగాడి అల్లరి ఇక ఇంట్లోనే చూసుకోవచ్చు, ఎప్పుడు, ఎక్కడంటే...
A still from Tillu Square

సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 'టిల్లు స్క్వేర్' సినిమా మార్చి 29న థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మల్లిక్ రామ్ దర్శకుడు, సితార ఎంటర్ టైనమెంట్ సంస్థ నిర్మించింది. ఈ సినిమా థియేటర్స్ లో ఇంకా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈమధ్య కాలంలో విడుదలైన సినిమాలో 'టిల్లు స్క్వేర్' బాక్స్ దగ్గర ఘన విజయం సాధించింది అని చెప్పాలి. సిద్దు జొన్నలగడ్డ సినిమా రూ. 125 కోట్ల గ్రాస్ కలెక్టు చేసి ఒక చిన్న సినిమా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఎంతలా ఆదరిస్తారో అని రుజువు చేసి చూపించిన సినిమా ఇది.

ఈ సినిమా ఇంతకు ముందు వచ్చిన 'డీజీ టిల్లు' కి సీక్వెల్ గా వచ్చింది. మొదటి సినిమాకన్నా ఈ సీక్వెల్ ఎక్కువ ప్రజాదరణ పొందటంతో పాటు, రెట్టింపు లాభాలను తెచ్చిపెట్టింది. సిద్దు, టిల్లు పాత్రలో అందరినీ అలరించాడు. అయితే ప్రేక్షకులు ఈ సినిమా ఓటిటిలో ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు చూద్దామా అనే ఆతృతలో వున్నారు.

Tillu Square Movie Review: అంతా సిద్దు జొన్నలగడ్డ మయం

tillusquaresongrelease.jpg

అందుకనే ప్రముఖ ఓటిటి సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ (Tillu Square is streaming on Netflix on April 26) తన సామాజిక మాధ్యమంలో ఈ సినిమా ఎప్పుడు స్ట్రీమింగ్ అవబోతోంది అనేది ప్రకటించారు. ఏప్రిల్ 26న ఈ సినిమా అన్ని భాషల్లోనూ అంటే తెలుగు తో పాటు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో ఈ సినిమాని వీక్షించవచ్చు. టిల్లు గాడు చేసే అల్లరిని ఒక్క తెలుగు ప్రేక్షకుల్లో కాకుండా మిగతా భాషా ప్రేక్షకులు కూడా ఈ ఏప్రిల్ 26న ఇంట్లోనే వీక్షించవచ్చు.

ఈ సినిమా వినోదాత్మకంగా ఉంటూ ఒక చిన్న నేరం నేపథ్యంలో తెరకెక్కించిన సినిమాగా చెప్పొచ్చు. ఇందులో ప్రధానంగా సిద్దు మాటలు, హావభావాలు ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తాయి. అనుపమ పరమేశ్వరన్ లిల్లీ గా గ్లామరస్ గా కనపడుతుంది. అలాగే సిద్దు స్నేహితుడు మార్కస్ ఇంకా మిగతా నటీనటులు అందరూ చాలా బాగా చేశారు. ఇక ఆలస్యం ఎందుకు, నెట్ ఫ్లిక్స్ లో ఈ ఏప్రిల్ 26 న అందరూ చూసెయ్యండి.

Updated Date - Apr 19 , 2024 | 12:13 PM