scorecardresearch

Latest TV News: రామాయణం తెలుగులో, ఎప్పుడు, ఏ ఛానెల్ లో అంటే...

ABN , Publish Date - May 21 , 2024 | 12:54 PM

కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్, ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో ధృఢవ్రతః, చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః అంటూ పదహారు గుణగణాలు కల వ్యక్తి ఇప్పటి కృత యుగం కాలంలొ ఉన్నాడా అని నారదమహర్షిని, వాల్మీకి మహర్షి అడిగితే వున్నాడు అని రాముడు గురించి చెపుతారు నారద మహర్షి. ఆ తరువాత వాల్మీకి అదే రాముడు గురించి రాసిన కావ్యం 'రామాయణం'. ఇప్పుడు ఆ రామాయణం తెలుగులో మళ్ళీ ప్రసారం అవుతోంది, ఎక్కడ, ఎప్పుడు అంటే...

Latest TV News: రామాయణం తెలుగులో, ఎప్పుడు, ఏ ఛానెల్ లో అంటే...
Srimad Ramayanam is going to telecast in Telugu soon

పురాణాలలో 'రామాయణం' కి వున్నా వైశిష్టం మరెటువంటి పురాణానికి లేదు అని పెద్దల మాట. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు మానవుడిగా జన్మించి ఎలా మసలుకోవాలి, ఎటువంటి ధర్మాలు పాటించాలి, ఎంతటి కష్టమొచ్చినా ధర్మాన్ని విడవకుండా ఎలా జీవనం సాగించాలి అని రాముని పాత్రలో చాటి చెప్పాడు. వాల్మీకి రచించిన ఈ రామాయణం ఎన్ని సార్లు విన్నా, చూసినా తనివి తీరదు అని చెపుతూ వుంటారు. రామ రాజ్యం అన్న మాట రాముడు పరిపాలించిన తీరును బట్టి వచ్చింది. తండ్రి మాటకి కట్టుబడి, తండ్రిని ధర్మపథంలో నిలబెట్టడానికి అడవికి వెళ్లిన రాముడు, తండ్రి మాటని జవదాటని కొడుకుగా, ఏకపత్నీవ్రతుడిగా, ప్రజల క్షేమం కోసం ధర్మం తప్పని రాజుగా, అందరికి ఆదర్శంగా నిలిచిన శ్రీరామగాథను ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు.

ramayanamingemini.jpg

అటువంటి రాముని చరిత్ర 'రామాయణం' మరోసారి తెలుగులో టీవిలో ప్రసారం కానుంది. ఇంతకీ ఈ రామాయణం సీరియల్ ఎక్కడ ప్రసారం అవుతోంది, ఎప్పటి నుండి కానుంది అంటే, ఈ నెల 27వ తేదీ నుండే. జెమిని టివిలో మే 27వ తేదీ సోమవారం సాయంత్రం గం. 6.30 లకు ఈ దృశ్యకావ్యం 'శ్రీమద్ రామాయణం' సీరియల్ ప్రసారం కానుంది అని నిర్వాహకులు చెపుతున్నారు.

మనుష్య జాతికి, సమాజానికి ఆదర్శవంతమైన విలువలను చాటి చెప్పిన రామావతారం 'శ్రీ మధ్ రామాయణం'. ఈ సీరియల్ లో శ్రీరాముని అవతార విశిష్టత, జన్మ వృత్తాంతం, లంకాధిపతి అయిన రావణాసురుడి జన్మ వృత్తాంతం మొదలుకుని రామాయణంలోని అన్ని ఘట్టాలను కనులకు కట్టినట్లుగా అద్భుతమైన సాంకేతిక విలువలతో అత్యద్భుతంగా చిత్రీకరించి శ్రీ రామ గాథను జెమిని టివి అభిమాన ప్రేక్షకులందరికి ఎప్పటికి గుర్తుంది పోయేలా అందించడం జరుగుతోంది అని చెపుతున్నారు.

ramayanonGemini.jpg

శ్రీ వాల్మీకి విరచిత రామాయణం 'శ్రీమద్ రామాయణం' గా సూపర్ గ్రాఫిక్ టెక్నాలజీతో, అనుభవజ్ఞులైన నటీనటుల నటనతో, మనుసుని ఆకట్టుకునే మాటలతో, ప్రతి తెలుగు ప్రేక్షకుడిని అలరించడానికి మే 27వ తేదినుండి సోమవారం నుండి శనివారం వరకు, ప్రతి రోజు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలనుండి 7 గంట 30 నిమిషాల వరకు ప్రసారం కానుంది.

Updated Date - May 21 , 2024 | 12:54 PM