Allu Arjun: ప్రతి సన్నివేశ చిత్రీకరణ ముందు రిహార్సల్, అందుకే పుష్పకి అంత పేరు

ABN , Publish Date - Apr 24 , 2024 | 01:36 PM

అల్లు అర్జున్ తను చేస్తున్న పని ఎంత బాగా రావాలని అనుకుంటారో తెలిస్తే షాకవుతారు. ఇప్పుడు చేస్తున్న 'పుష్ప 2' సినిమా కోసం ప్రతి సన్నివేశం చిత్రీకరణ జరిపే ముందు, అల్లు అర్జున్ ప్రతి సన్నివేశాన్ని రెండు గంటలపాటు రిహార్సల్స్ చేస్తారని తెలిసింది. పని అంటే అంత నిబద్ధత వుండటంవలనే అతనికి అంత పేరు వచ్చింది అని అంటున్నారు

Allu Arjun: ప్రతి సన్నివేశ చిత్రీకరణ ముందు రిహార్సల్, అందుకే పుష్పకి అంత పేరు
Allu Arjun as Pushpa

అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' కోసం ప్రపంచం అంతా ఎదురు చూస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సీక్వెల్ ఆగస్టు 15వ తేదీన విడుదలవుతోంది. రష్మిక మందన్న కథానాయిక కాగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా 'పుష్ప' సినిమాకి సీక్వెల్ గా వస్తోంది. 'పుష్ప' సినిమాతో అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా, మిగతా భాషల్లో కూడా ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో 'తగ్గేదే లే' అనే అల్లు అర్జున్ పాత్రని అభినయిస్తూ సెలబ్రటీలతో వందల, వేలమంది ఎన్నో రీల్స్ చేశారు.

alluarjuninberlin.jpg

'పుష్ప' విడుదలైంది, విజయం సాధించింది, ఇప్పుడు 'పుష్ప 2' పైనే అందరి కళ్ళు వున్నాయి. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ సినిమాకోసం అల్లు అర్జున్ ఎంత కష్టపడుతున్నారు అంటే, దర్శకుడు సుకుమార్ ఇచ్చిన ప్రతి సన్నివేశాన్ని చిత్రీకరణ జరిగే ముందు, రిహార్సల్స్ చేసుకొని అప్పుడు చిత్రీకరణకు వెళుతున్నారని తెలుస్తోంది. అదీ కాకుండా ఈ చిత్రానికి సింక్ సౌండ్ (అంటే చిత్రీకరణలో చెప్పే మాటలనే నేరుగా రికార్డు చేస్తారు) కూడా చెపుతున్నారు, అందుకని అల్లు అర్జున్ ప్రతి సన్నివేశాన్ని రిహార్సల్ చెయ్యకుండా చిత్రీకరణ జరపటం లేదని యూనిట్ సభ్యులు చెపుతున్నారు.

alluarjunpushpa2.jpg

ఇలా చెయ్యడం వలన 'పుష్ప' సినిమాకి అంత ప్రజాదరణ వచ్చింది, అల్లు అర్జున్ కి అంత మంచి పేరు వచ్చింది. అందుకనే ఆ సినిమాకి వస్తున్న ఈ సీక్వెల్ కి ఇంకా కష్టపడాలని, అందుకని రిహార్సల్ అసలు మిస్ అవ్వకూడదు అని అల్లు అర్జున్ చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ రిహార్సల్స్ లో అల్లు అర్జున్ తో పాటు మిగతా నటులు కూడా పాల్గొంటున్నారని తెలుస్తోంది. చిత్రీకరణకు ముందు రెండు గంటలు రిహార్సల్స్ కి అవుతుందని, తరువాత చిత్రీకరణకు వెళుతున్నారని అంటున్నారు. ఈ సినిమాలో మలయాళం నటుడు ఫహాద్ ఫాజిల్ తో పాటు రావు రమేష్, జగపతి బాబు, సునీల్, అనసూయ ఇంకా చాలామంది నటీనటులు వున్నారు.

Updated Date - Apr 24 , 2024 | 01:36 PM