Gam Gam Ganesha Movie Review: ఆనంద్ దేవరకొండకి హిట్ వచ్చిందా?

ABN , Publish Date - May 31 , 2024 | 05:04 PM

'బేబీ' సినిమా తరువాత ఆనంద్ దేవరకొండ ఈ 'గమ్ గమ్ గణేశా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇదొక క్రైమ్ కామెడీ, ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకుడు. ఈ సినిమా ఎలా వుందో చదవండి.

Gam Gam Ganesha Movie Review: ఆనంద్ దేవరకొండకి హిట్ వచ్చిందా?
Gam Gam Ganesha Movie Review

సినిమా: గమ్ గమ్ గణేశా

నటీనటులు: ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాత్సవ, నయన్ సారిక, వెన్నెల కిశోర్, రాజ్ అర్జున్, సత్యం రాజేష్ తదితరులు

సంగీతం: చైతన్ భరద్వాజ్

ఛాయాగ్రహణం: ఆదిత్య జవ్వాది

నిర్మాతలు: కేదార్ సెలగంశెట్టి, వంశి కారుమంచి

రచన, దర్శకత్వం: ఉదయ్ బొమ్మిశెట్టి

విడుదల: మే 31, 2024

రేటింగ్: 2 (రెండు)

-- సురేష్ కవిరాయని

గత సంవత్సరం 'బేబీ' సినిమాతో ఆనంద్ దేవరకొండ మంచి విజయం సాధించాడు, ఆ సినిమాతో వంద కోట్ల క్లబ్బులోకి కూడా చేరాడు. ఈ సంవత్సరం అతను 'గమ్ గమ్ గణేశా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకుడు, ప్రగతి శ్రీవాత్సవ, నయన్ సారిక ఇద్దరు కథానాయకురాలుగా నటించారు. ఇదొక క్రైమ్ కామెడీ అని విడుదలకి ముందు చెప్పారు. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

ananddeverakondagamgam.jpg

Gam Gam Ganesha Story కథ:

గణేష్ (ఆనంద్ దేవరకొండ) అతని స్నేహితుడు శంకర్ (ఇమ్మాన్యుయేల్) ఇద్దరూ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ వుంటారు. గణేష్, శృతి (నయన్ సారిక) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు, కానీ ఆమె అతనికి చెయ్యిచ్చేస్తుంది, వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. కోపం వచ్చిన గణేష్ చిన్న చిన్న దొంగతనాలు కాదు, ఒక పెద్ద దొంగతనం చేసి సెటిల్ అవ్వాలని అనుకుంటాడు. ఒక బంగారం షాపులో డైమండ్ కొట్టేసి అది అమ్మితే కోట్లు గడించవచ్చు అనుకుంటాడు. నంద్యాలలో కిశోర్ రెడ్డి (రాజ్ అర్జున్) ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి వందకోట్లు డబ్బు కావాలని, ముంబైలో వుండే ఒకతనితో డీల్ కుదుర్చుకుంటాడు. వినాయకచవితి పండగకి గణేష్ విగ్రహంలో ఈ వందకోట్లు పెట్టి ఎవరికీ అనుమానం రాకుండా ముంబై నుండి నంద్యాల తీసుకు వస్తారు. డైమండ్ దొంగతనం చేసి కారులో పారిపోతున్న గణేష్ కి పోలీసులు వాహనాలను చెక్ చేస్తూ ఉండటం గమనించి, తన దగ్గరవున్న డైమండ్ ని ముంబై నుండి నంద్యాల వస్తున్న గణేష్ విగ్రహంలో జారవిడుస్తాడు. నంద్యాలకి విగ్రహం వస్తుంది, కానీ అందులో డబ్బు ఉండదు. డబ్బులు పెట్టి వున్న గణేష్ విగ్రహం కర్నూల్ దగ్గర్లో వున్న ఒక గ్రామానికి చేరుకుంటుంది. డబ్బు కోసం కిషోర్ రెడ్డి మనుషులు, డైమండ్ కోసం గణేష్ అతని స్నేహితుడు, లోకల్ గా వుండే ఒక పూజారి (జగన్), లోకల్ ఎమ్మెల్యే (సత్యం రాజేష్) ఇలా అందరూ ఆ గణేష్ విగ్రహం కోసం అక్కడ తిష్టవేస్తారు. చివరికి ఏమవుతుంది, విగ్రహంలో డబ్బు దొరికిందా, డైమండ్ స్నేహితులకి చిక్కిందా? ఈ ఎలుక, పిల్లి ఆటలో ఎవరు విజయం సాధించారు తెలుసుకోవాలంటే 'గమ్ గమ్ గణేశా' సినిమా చూడండి.

gamgamganeshastill.jpg

విశ్లేషణ:

దర్శకుడు ఉదయ్ బొమ్మిశెట్టి ఒక చిన్న క్రైమ్ కామెడీ కథని ఎంచుకొని ఈ 'గమ్ గమ్ గణేశా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే అతను కథపై దృష్టి పెట్టకుండా, కేవలం వినోదాత్మ సన్నివేశాలపై ఎక్కువ దృష్టి పెట్టడంతో, కథ దారితప్పి ఇదొక మామూలు సినిమాగా తయారయింది. ఇంతకుముందు 'స్వామి రారా' అనే సినిమా ఇలాంటి నేపథ్యంలోనే వచ్చింది, ఈ 'గమ్ గమ్ గణేశా' కథ కూడా అలానే ఉంటుంది. కథలో వినోదం ఉండాలి కానీ, కథ పక్కన పెట్టి, కేవలం వినోదం కోసం సన్నివేశాలను రాస్తే అది ఆసక్తికరంగా ఉండదు. ఇక్కడ దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది, కానీ అది తెరపై చాలా పేలవంగా చూపించాడు.

మొదటి సగంలో కథానాయకుడు ఆనంద్ దేవరకొండ, నయన్ సారిక మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు ఆకట్టులేకపోయాయి, అవన్నీ కృత్రిమంగా వున్నాయి. ఆ కారు ఛేజ్ బోర్ కొట్టింది. మొదటి సగంలో అంత ఆసక్తికరంగా వుండే సన్నివేశాలు లేవు, వినోదం కూడా లేదు. ఇక రెండో సగంలో చాలా సన్నివేశాలు బలవంతంగా చేర్చినట్టు అనిపిస్తుంది. రెండో సగంలో ఇంకో కథానాయకురాలు వస్తుంది, ఆమె ఆనంద్ మధ్య సన్నివేశాలు కూడా సహజంగా వుండవు. ఈమధ్య వెన్నెల కిషోర్ వినోదం సన్నివేశాలని తెరపై చూస్తుంటే చాలా బోర్ గా ఉంటోంది. ఎందుకంటే అదే వినోదం, అదే సన్నివేశాలు, కావాలని అతని పాత్ర బలవంతంగా అవసరం లేకపోయినా పెట్టారు. ఇక విగ్రహంలో డబ్బు, డైమండ్ కోసం అన్ని గ్యాంగ్స్ ప్రయత్నాలు చేస్తూ వుంటారు, ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలని వినోదాత్మకంగా చూపించాను అని దర్శకుడు అనుకొని ఉంటాడు. కాలనీ అవి బోర్ కొట్టిస్తాయి. అనవసర సమయంలో పాటలు చిరాకు తెప్పిస్తాయి. ఛాయాగ్రహణం పరవాలేదు, నేపధ్య సంగీతం అంతగా ఆకట్టుకోలేదు.

gamgamganesha.jpg

ఇక నటీనటుల విషయానికి వస్తే ఆనంద్ దేవరకొండ బాగున్నాడు, 'బేబీ' లాంటి సినిమా తరువాత ఒక వినోదం నేపధ్యంగా వుండే సినిమా ఎంచుకున్నాడు. తన పాత్రకి న్యాయం చేశాడు. రాజ్ అర్జున్ అయితే బోరింగ్. తెలుగు రాని నటులకి డబ్బింగ్ చెప్పేవాళ్ళకి ఒక విన్నపం, మీ గొంతు అరుస్తున్నట్టుగా వుంది, థియేటర్ లో అది రీసౌండ్ లా వస్తోంది. దయచేసి గొంతు తగ్గించి చెపితే, వినటానికి బాగుంటుంది అని అనుకుంటున్నారు. ఇమ్మాన్యుయేల్ సినిమా అంతా ఉంటాడు, అక్కడక్కడా కొన్ని సన్నివేశాల్లో నవ్వించాడు, అంతే. సత్యం రాజేష్, వెన్నెల కిషోర్, జగన్ ల వినోదం అంతగా పండలేదు. ప్రగతి శ్రీవాత్సవ, నయన్ సారిక, కథానాయికలు ఇద్దరికీ పెద్దగా సన్నివేశాలు లేవు. కేవలం పాటలకే పరిమితం అయ్యారు.

చివరగా, 'గమ్ గమ్ గణేశా' అక్కడక్కడా ఒకటి రెండు వినోదాత్మక సన్నివేశాలు తప్పితే, సినిమాలో విషయం లేదు. కథలో తీసుకున్న పాయింట్ మంచిదే కానీ, అది తెరపై సరిగ్గా చూపించలేకపోయాడు దర్శకుడు, అందుకని ఇదొక మామూలు సినిమాగా తయారైంది.

Updated Date - May 31 , 2024 | 05:04 PM