Manjummel Boys Movie Review: నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందంటే...

ABN , Publish Date - Apr 06 , 2024 | 12:09 PM

నిజంగా జరిగిన ఒక సంఘటన ఆధారాంగా తీసిన మలయాళం సినిమా 'మంజుమ్మల్ బాయ్స్'. మలయాళం సినిమా పరిశ్రమలో చరిత్ర సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులోకి అనువాదం చేసి విడుదల చేశారు. ఈ సినిమా ఎలా వుందో చదవండి.

Manjummel Boys Movie Review: నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందంటే...
Manjummel Boys Movie Review

సినిమా: మంజుమ్మల్ బాయ్స్

నటీనటులు: సౌబిన్ షాహిర్, శ్రీనాథ్, డిలన్ డెరిన్, బాలు వర్గిస్, గణపతి, లాల్ జూనియర్, దీపక్ పరంబోల్, అభిరాం, అరుణ్ కురియన్, చందు సలీమ్ కుమార్, విష్ణు రేగు తదితరులు

ఛాయాగ్రహణం: షైజు ఖలీద్

సంగీతం: సుశిన్ శ్యామ్

నిర్మాత: సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ, తెలుగులో మైత్రి మూవీస్

దర్శకత్వం: చిదంబరం

విడుదల తేదీ: 6-4-2024 (తెలుగులో)

రేటింగ్: 3.5

-- సురేష్ కవిరాయని

ఈమధ్య మలయాళం సినిమాలు చాలా మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. చిన్న సినిమాలు అక్కడ వందకోట్లకి పైగా డబ్బులు బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తున్నాయి. ఆమధ్య 'ప్రేమలు' అనే చిన్న సినిమా సంచలనం సృష్టించి తెలుగులో విడుదలైంది. ఇప్పుడు ఇంకో సినిమా 'మంజుమ్మల్ బాయ్స్' అనే సినిమా మలయాళ సినిమా పరిశ్రమలోనే చరిత్ర సృష్టించే దిశగా వెళ్ళింది. రూ.200 కోట్లకి పైగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూల్ చేసి మలయాళం సినిమా పరిశ్రమలో అత్యంత ఎక్కువ డబ్బులు వసూల్ చేసిన సినిమా గా విజయం సాధించింది. ఇది ఒక నిజ సంఘటన ఆధారంగా తీసిన సినిమా, దీనికి దర్శకుడు చిదంబరం. ఈ సినిమాని తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేశారు.

Manjummel Boys 100cr Telugu.webp

Manjummel Boys Story కథ:

కేరళలోని కొచ్చి పట్టణానికి చెందిన కొంతమంది స్నేహితులు కుట్టన్ (సౌబిన్ షాహిర్) నేతృత్వంలో తమిళ నాడులోని కొడైకెనాల్ చూడటానికి విహారంగా వెళతారు. అక్కడ వీరందరూ కొడైకెనాల్ లోని అందాలను చూస్తూ, అన్నీ తిరుగుతూ ఉంటే, ఒక స్నేహితుడు 'గుణ' గుహలు కూడా చూద్దాం అని చెప్పి అక్కడికి వెళదాం అంటాడు. కమల్ హాసన్ నటించిన 'గుణ' సినిమా అక్కడ షూటింగ్ చేసిన సందర్భంగా వాటికి 'గుణ' గుహలు అని పేరొచ్చింది. సెక్యూరిటీ గార్డు, గైడ్, అక్కడ వున్న మిగతా వాళ్ళు ఈ స్నేహితులని మరీ లోపలికి వెళ్లొద్దు, అవన్నీ చాలా ప్రమాదకరమైనవి అని వారిస్తున్నా వినకుండా ఈ స్నేహితులు అందరూ ఆ కొండల్లోకి వెళతారు. అక్కడ ఒక చిన్న కొండపైన చాలామంది తాము వచ్చినట్టుగా ఏవో రాతలు రాసి ఉంటే, 'మంజుమ్మల్ బాయ్స్' అని మనం కూడా రాద్దాం అని అంటాడు ఈ గ్రూపులో వున్న ఒక స్నేహితుడు. సరే అందరూ ఆ కొండల్లోకి దిగుతారు, అక్కడ కొండమీద పేరు రాసి ఎలా ఉందిరా అని అడుగుతారు. ఇదే గ్రూపులో వచ్చిన సుభాష్ అనే స్నేహితుడు ఆ పేరు ఎలా వుందో చూస్తూ ఒక్కసారిగా ఒక గుహలోపలికి పడిపోతాడు. అది చాలా లోతుగా ఉంటుంది, డెవిల్స్ కిచెన్ అని కూడా దానికి పేరు. ఎందుకంటే అందులో ఇలా పడిపోయిన వారు ఎవరూ ఇంతవరకు బతికి బట్టకట్టలేదు. ఆ లోయ ఎంత లోతు ఉంటుందో ఎవరికీ తెలియదు, మరి పడిపోయిన సుభాష్ అందులో బతికే వున్నాడా? అతన్ని వదిలేసి స్నేహితులు వెళ్లిపోయారా? పోలీసులకి చెపితే వాళ్ళు స్నేహితులని ఎందుకు కొట్టారు? ఈ గ్రూపుకి నాయకత్వం వహించిన కుట్టన్ చివరికి ఏమి చేసాడు? ఇవన్నీ తెలియాలంటే ఈ థ్రిల్లర్ సినిమా 'మంజుమ్మల్ బాయ్స్' చూడాల్సిందే.

Manjummel Boys: ఇలాంటి.. స్నేహితులు మ‌న‌ జీవితంలోనూ ఉండాలని కోరుకుంటారు

విశ్లేషణ:

మలయాళం సినిమా మొదటి నుండీ సహత్వానికి చాలా దగ్గరగా వుంది, నిజ జీవితాలకి, నిజ సంఘటనలకు, లేదా వాళ్ళు తీసిన సినిమాలు చాలావరకు రియలిస్టిక్ గా ఉంటాయి. అందుకే మొదటి నుండీ మలయాళం సినిమాలకి అవార్డులు, రివార్డులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈమధ్యనే ఎన్నో మలయాళం సినిమాలు చాలా రియలిస్టిక్ గా వుండి మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు 'మంజుమ్మల్ బాయ్స్' అనే సినిమా కూడా నిజంగా జరిగిన ఒక సంఘటన ఆధారంగా తీసిన సినిమా. చిదంబరం అనే అతను దర్శకుడు. ఈ సినిమా మొదటి నుండి దర్శకుడు ఒక ఆసక్తికరమైన అంశాలతో సాగేటట్టు తీసాడు. సంఘటన చిన్నదే అయినా, ఆ సంఘటన చుట్టూ అల్లిన కథ, ఆ ప్రదేశాలు, ఆ ఛాయాగ్రహణం, నేపధ్య సంగీతం ఒకటేమిటి అన్నీ ఈ చిత్రానికి సరిగ్గా అమిరాయి అని చెప్పొచ్చు.

Untitled-10.jpg

2006లో కొంతమంది స్నేహితులు కొడైకెనాల్ పర్యాటక కేంద్రానికి వెళతారు, అక్కడ కొండల్లో తిరుగుతూ ఉండగా అందులో ఒక స్నేహితుడు అక్కడ వున్న ఒక గుహలో చిక్కుకొని పోతాడు. అతను బతికున్నాడో లేదో తెలియదు, అతడిని వదిలి వెళ్ళటానికి అతని స్నేహితుల బృందం అంగీకరించక అక్కడే వుండి, గుహలోంచి అరుపులు వస్తున్నాయని, తమ మిత్రుడు బతికే వున్నాడని, అతన్ని రక్షించుకోవాలని తాపత్రయ పడతారు. తమ మిత్రుడిని ఆ మిత్ర బృందం ఎలా రక్షించారు అన్నదే సినిమా. అయితే ఎలా రక్షించారు అని ఇక్కడ ఒక్క మాటలో నేను చెప్పేసాను కానీ, మీరు వెండి తెరపై ఆ సన్నివేశాలు చూస్తున్నంత సేపూ, థ్రిల్ గా ఫీలవటుహారు. అలాగే మీరు మీ చుట్టుపక్కల ఎవరున్నారు అనే సంగతి కూడా మరిచిపోయి కథలో లీనమై పోతారు. అంతలా దర్శకుడు ఈ సన్నివేశాలను చూపించగలిగాడు. ప్రతి సన్నివేశానికి ఛాయాగ్రహణం, నేపధ్య సంగీతం తోడై ఈ సినిమా ఒక థ్రిల్లర్ లా రావటానికి దోహద పడింది. ఆ కొండలు, ఆకుపచ్చని ప్రకృతి, చెట్లు, అడవి ప్రాంతం, కొండ గుహలు ఇవన్నీ ఎంతో అందంగా, చూడటానికి అద్భుతంగా చిత్రీకరించారు. ఈ సినిమాకి పని చేసిన సాంకేతిక నిపుణులు అందరికీ నిజంగా 'హేట్సాఫ్' చెప్పాలి, అంత చక్కగా చూపించినందుకు. షైజు ఖలీద్ ఈ సినిమా ఛాయాగ్రాహకుడు అతనికి నిజంగా అభినందనలు చెప్పాలి. ఈ సినిమాకి అతని చిత్రాలే హైలైట్ అవుతాయి. గుహలోపల, వెలుపల జరుగుతున్న సంఘటనలు, ప్రకృతి సహజసిద్ధమైన ఆ వాతావరణం అన్నీ బాగా చూపించాడు.

The Family Star Movie Review: విజయ్ దేవరకొండకి 'ది ఫ్యామిలీ స్టార్' బ్రేక్ ఇచ్చిందా...

manjummelboysstill.jpg

ఇక ఈ సినిమాలో నటీనటులు అందరూ సహత్వానికి దగ్గరగా ఉండేట్టు నటించడమే కాకుండా, ప్రతి పాత్రలో ఒక్కొక్కరు మమేకమై నటించారు. ముఖ్యంగా సౌభిన్ షాహిర్ తో పాటు మిగతా అందరు నటులు చాలా బాగా చేశారు. తమ బృందంలోని మిత్రుడు ఎంతో లోతుగా వున్న గుహలో పడిపోయినప్పుడు స్నేహితుల మధ్య నడిచే భావోద్వేగాలు అన్నీ హత్తుకుంటాయి. అలాగే ఆ సమయంలో పోలీసుల దగ్గరకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తించారు, ఆ పర్యాటక కేంద్రంపైనే ఆధారపడి జీవిస్తున్న ఒక గైడ్, అక్కడి ప్రజలు ఈ స్నేహితుల పట్ల ఎటువంటి వైఖరి అవలంబించారు, వారికి ఏ విధంగా తోడ్పాటు అందించారు ఇవన్నీ ఎంతో సహజసిద్ధంగా ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి. సినిమా కొంచెం నెమ్మదిగా వెళుతున్నట్టు అనిపించినా, దర్శకుడు ఎక్కడా సాగదీయలేదు. తాను చెప్పాలనుకున్నది ఎంతో నిబద్దతో, నిజాయితీతో చెప్పాడు, అలాగే తీసాడు. అందుకే అంత పెద్ద విజయం మలయాళంలో సాధించింది అనిపిస్తుంది.

'మంజుమ్మల్ బాయ్స్' అనే సినిమా తప్పక చూడాల్సిన సినిమా. ఒక నిజమైన సంఘటన ఆధారంగా దర్శకుడు ఒక అద్భుతమైన కథ ఆవిష్కరించడమే కాకుండా, చివర్లో ఆ నిజ సంఘటన జరిగిన స్నేహ బృందాన్ని కూడా చూపిస్తారు. అందులో తమ స్నేహితుడిని కాపాడిన వ్యక్తికి ఒక పతకం కూడా ప్రధానం చేస్తారు.

Updated Date - Apr 06 , 2024 | 04:33 PM