The Family Star Movie Review: విజయ్ దేవరకొండకి 'ది ఫ్యామిలీ స్టార్' బ్రేక్ ఇచ్చిందా...

ABN , Publish Date - Apr 05 , 2024 | 01:15 PM

'గీత గోవిందం' లాంటి పెద్ద విజయం తరువాత దర్శకుడు పరశురామ్ పెట్ల, విజయ్ దేవరకొండ కలిసి 'ది ఫ్యామిలీ స్టార్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అందుకని ఈ సినిమాపై అంచనాలు పెద్దగా వున్నాయి, మరి సినిమా ఎలా ఉందంటే...

The Family Star Movie Review: విజయ్ దేవరకొండకి 'ది ఫ్యామిలీ స్టార్' బ్రేక్ ఇచ్చిందా...
The Family Star Movie Review

సినిమా: ది ఫ్యామిలీ స్టార్

నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, జగపతి బాబు, దివ్యాంశ కౌశిక్, రోహిణి హట్టంగడి, వాసుకి, అభినయ తదితరులు

సంగీతం: గోపీ సుందర్

ఛాయాగ్రహణం: కె యు మోహనన్

రచన, దర్శకత్వం: పరశురామ్ పెట్ల

నిర్మాతలు: రాజు, శిరీష్

విడుదల తేదీ: ఏప్రిల్ 5, 2024

రేటింగ్: 2.5 (Two and half)

-- సురేష్ కవిరాయని

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' సినిమాలతో ఒక పెద్ద స్టార్ అయ్యాడు. ఆ తరువాత 'టాక్సీవాలా' అనే సినిమా కూడా హిట్ అయింది. ఇవన్నీ 2018 సంవత్సరం వరకు చేసిన సినిమాలు. కానీ ఆ తరువాత చేసిన సినిమాలు వ్యాపారాత్మకంగా విజయ్ కి బ్రేక్ ఇవ్వలేదనే చెప్పాలి. 'డియర్ కామ్రేడ్' సినిమా బాగుంది అన్నారు, కానీ వ్యాపారాత్మకంగా నడవలేదు. తరువాత ఇంకో పెద్ద సినిమా 'వరల్డ్ ఫేమస్ లవర్' వచ్చింది, అది కూడా నడవలేదు. (The Family Star Review) ఆ తరువాత పాన్ ఇండియన్ సినిమా అంటూ 'లైగర్' వచ్చింది, అది విజయ్ కెరీర్ లో ఒక పెద్ద మైనస్ అయింది. గత సంవత్సరం 'ఖుషీ' సినిమా విడుదలైంది, మిశ్రమ ఫలితం వచ్చింది. అంటే విజయ్ కి ఒక పెద్ద బ్రేక్ వచ్చి చాలా సంవత్సరాలు అవుతోంది. అటువంటి సమయంలో ఇప్పుడు ఈ 'ది ఫామిలీ స్టార్' సినిమా విడుదలైంది. దీనికి పరశురామ్ పెట్ల దర్శకుడు, మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించింది. దిల్ రాజు, శిరీష్ సోదరులు నిర్మాతలు. గోపి సుందర్ సంగీతం అందించారు. మరి ఈ సినిమా విజయ్ కి బ్రేక్ ఇచ్చిందో, లేదో చూద్దాం. (The Family Star Movie Review)

Thefamilystar.jpg

The Family Star Story కథ:

గోవర్ధన్ (విజయ్ దేవరకొండ) ఒక మధ్యతరగతి కుటుంబంలో ఆఖరివాడు. ఇద్దరు అన్నయ్యలు, వదినలు, వాళ్ళ పిల్లలు, బామ్మ, ఇలా ఒక మధ్యతరగతి కుటుంబంలో చిన్నవాడైన గోవర్ధన్ కుటుంబాన్ని తన భుజస్కందాలపై నడిపిస్తూ వుంటారు. ఎప్పుడూ ఎక్కడ అదా చెయ్యాలి, ఎలా డబ్బులు అదా చేయొచ్చు అని చూస్తూ ఉంటాడు. ఒక అన్నయ్య ఎప్పుడూ తాగుతూ మద్యం నడిపే దుకాణదారుడితో గొడవపడుతూ ఉంటాడు. అన్నయ్య పిల్లల స్కూల్ ఫీజులు, వాళ్ళ అవసరాలు అన్నీ గోవర్ధన్ చూసుకుంటూ సంపాదనలో అన్నీ జాగ్రతగా ఖర్చు పెడుతూ ఉంటాడు. అలాగే తన కుటుంబసభ్యులని ఎవరైనా ఏమైనా అన్నా ఊరుకునే మనస్తత్వం కూడా కాదు గోవర్ధన్ ది, ఎదురుతిరిగి తగిన బుద్ధి చెపుతూ వుంటాడు. అలాంటి సమయంలో ఆ ఇంట్లోకి వస్తుంది ఇందు (మృణాల్ ఠాకూర్) అనే అమ్మాయి. గోవర్ధన్ ఉంటున్న ఇంట్లోనే మేడ మీద ఒక గది ఖాళీగా ఉంటే అద్దెకి దిగుతుంది. గోవర్ధన్ మొదట్లో ఆమెని వ్యతికేరించినా, మెల్లగా ఆమె చేస్తున్న పనులు నచ్చి ఆమెతో ప్రేమలో పడతాడు, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటాడు. అదే సమయంలో ఆమె గోవర్ధన్ మీద ఒక థీసిస్ రాస్తుంది, అది తను చేసే మధ్యతరగతి కుటుంబం గురించిన రీసెర్చ్ అని యూనివర్సిటీ లో సబ్మిట్ చేస్తుంది. అందులో గోవర్ధన్ మధ్యతరగతి కుటుంబం గురించిన వివరాలు అన్నీ ఉంటాయి. గోవర్ధన్ ఆ పుస్తకం చదివి తన కుటుంబాన్ని మొత్తం రోడ్డుమీదకు ఇందు తీసుకువచ్చిందని, ఆమెని అసహ్యించుకుంటాడు. మధ్య తరగతి కుటుంబం అంటే పస్తులుండే కుటుంబం కాదని, తలుచుకుంటే మేము కూడా సంపన్నులం అవగలమని చూపిస్తాడు. వెంటనే తనకి ఇంతకు ముందు ఆఫర్ ఇస్తామన్న ఒక పెద్ద వ్యాపారవేత్త (జగపతి బాబు) దగ్గరికి వెళ్లి తాను ఇప్పుడు ఆ జాబ్ తీసుకుంటానని ప్రాధేయపడితే అతను గోవర్ధన్ కి ఆ జాబ్ ఇస్తాడు, అలాగే రెండు సంవత్సరాల జీతం అడిగితే అది కూడా ముందే ఇస్తాడు. తాను మధ్యతరగతి కుటుంబం కాదని, ధనవంతుల కుటుంబం అని ఇందుకు చెప్తాడు, ఆమె మీద ద్వేషం పెంచుకుంటాడు. ఇంతకీ ఈ ఇందు అనే అమ్మాయి ఎవరు? ఆమె నిజంగానే గోవర్ధన్ మధ్యతరగతి కుటుంబాన్ని వీధిలోకి లాగడం కోసమే థీసిస్ రాసిందా? ఆ వ్యాపారవేత్త గోవర్ధన్ అడగగానే వుద్యోగం, జీతం ఇచ్చి ఎందుకు పెట్టుకున్నాడు? గోవర్ధన్, ఇందు మళ్ళీ కలిసారా? వాళ్ళు పెళ్లిచేసుకున్నారా? తరువాత ఏమైంది, గోవర్ధన్ జీవితం ఎటువంటి మలుపులు తిరిగింది తెలియాలంటే 'ది ఫామిలీ స్టార్' సినిమా చూడాల్సిందే.

TheFamilystarstill.jpg


విశ్లేషణ:

దర్శకుడు పరశురామ్ మంచి రచయిత. అతని ముందు సినిమాలు చూస్తే అవన్నీ అర్థం అవుతాయి. అతను, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఇంతకు ముందు వచ్చిన 'గీత గోవిందం' చాలా పెద్ద హిట్ అయిన సినిమా. ఇప్పుడు మళ్ళీ ఈ ఇద్దరూ ఒకటై ఈ 'ది ఫ్యామిలీ స్టార్' సినిమాతో రావటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. స్వతహాగా సమాజం, కుటుంబ విలువలు ఇలాంటి వాటి గురించి పరశురామ్ ఇంతకు ముందు సినిమాలలో బాగా చెప్పగలిగాడు, ఈ 'ది ఫ్యామిలీ స్టార్' కూడా మధ్యతరగతి కుటుంబానికి చెందిన కథ అని ముందుగా చెప్పడంతో కొంచెం ఆసక్తి పెరిగింది. అయితే ఈ సినిమా కథ ఏమీ కొత్తది కాదు, చాలా పాతదే.

*The Family Star: అయ్య‌బాబోయ్‌.. ఫ్యామిలీస్టార్ రివ్యూస్ ఏంటి ఇలా ఉన్నాయ్‌


హిందీ సినిమాలు కూడా ఇలాంటివి ఎన్నో వచ్చాయి. రాజేష్ ఖన్నా, గోవిందా లాంటి నటులు ఇలాంటి సినిమాలు ఎన్నో చేశారు. ముఖ్యంగా రాజేష్ ఖన్నా నటించిన 'బవార్చి', గోవిందా నటించిన 'హీరో నంబర్ వన్' లాంటి సినిమాలలా ఇవి అనిపిస్తుంది. అలాగే తెలుగు సినిమాలు కూడా చాలానే వచ్చాయి. అందులో చిరంజీవి నటించిన 'గ్యాంగ్ లీడర్' కథ కూడా కొంచెం ఇలానే ఉంటుంది కదా. అయితే పరశురామ్ ఈ కథలన్నీ తీసుకొని కొంచెం అటు ఇటు మార్చినట్టుగా కనపడుతుంది. మధ్య తరగతి కుటుంబంలోకి ఒక ధనవంతురాలు/ ధనవంతుడు సాధారణ మనిషిలా వచ్చి ఆ కుటుంబలో ఒక సభ్యుడిగా మారిపోయి, ఆ కుటుంబాన్ని వాళ్ళకి తెలియకుండా ఆదుకుంటూ ఉండటం, ఆ తరువాత ఒక చిన్న సంఘటనతో వాళ్ళిద్దరిమధ్య తేడాలు రావటం మళ్ళీ కలుసుకోవటం. ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి, ఇక్కడ పరశురామ్ కూడా అలాంటి ఒక పాత కథనే ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఆధునికంగా చెప్పాలని అనుకున్నాడు. (The Family Star Movie Review)

vijaydmrunal.jpg

అతను చేసే ప్రయత్నం మంచిదే. మధ్య తరగతి కుటుంబాలు ఎలా కలిసిమెలిసి ఉంటాయి, కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులున్నా వాటిని ఎలా వాళ్లలో వాళ్ళే పరిష్కరించుకుంటారు, ప్రతి మధ్యతరగతి కుటుంబంలో ఒక వ్యక్తి ఎప్పుడూ కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉండటం, ఇవన్నీ మొదటి సగంలో బాగానే చూపించాడు దర్శకుడు పరశురామ్. ఇందు అనే అమ్మాయి ఆ ఇంట్లోకి రావటం, ఆమెతో గోవర్ధన్ ప్రేమలో పడటం, ఆమె ఈ కుటుంబం గురించి రీసెర్చ్ చేసి థీసిస్ రాయటం, వాళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ చిన్న తేడాలు రావటం వరకు బాగానే వుంది. అయితే ఇక్కడే పరశురామ్ కొంచెం కథ మీద దృష్టి పెట్టలేదు అనిపిస్తోంది. ఎందుకంటే రెండో సగం మొదట్లో వచ్చే ఈ అమెరికా సన్నివేశాలన్నీ ప్రేక్షకుడికి చాలా బోర్ ఫీలవటమే కాకుండా, అవన్నీ వేరే కథలా అనిపిస్తుంది. రెండో సగం అంతా దానిపైనే ఉండటం అదీ సాగదీసినట్టుగా అనిపిస్తుంది. సినిమాకి ఆయువుపట్టు అయిన పతాక సన్నివేశం కూడా దర్శకుడు అంత బాగా తీయలేదు అన్నట్టుగా అనిపిస్తుంది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాడు సూపర్ మాన్ లో పోరాటాలు చెయ్యడు, అవతలి వాళ్ళని ఒప్పిస్తాడు. చివర్లో అంతమందిని కొట్టడం కాకుండా, ఇంకొంచెం వైవిధ్యంగా అలోచించి పతాకసన్నివేశం మెరుగ్గా తీస్తే బాగుండేది అనిపిస్తుంది. ఈ సినిమాకి ఇంకొక మైనస్ గోపి సుందర్ సంగీతం, నేపధ్య సంగీతం సినిమా సన్నివేశాలకి తగినట్టుగా లేకపోవటం. అది కొన్ని సన్నివేశాలని ఎలివేట్ చెయ్యాలి, కానీ సినిమాలు అదే పెద్ద మైనస్. (Family Star Review)

*Vijay Deverakonda: అలా చెప్పడం తప్పు కాదు.. అలా చెప్పి కొట్టకపోవడం తప్పు


అయితే సినిమాలో పరశురామ్ రచన బలాన్నీ మాత్రం కొన్ని మాటల్లో చూపించగలిగాడు. కొన్ని మాటలు మనసుకు హత్తుకుంటాయి, చప్పట్లు కొట్టిస్తాయి కూడా. విజయ్ దేవరకొండ, తన అన్నయ్య మధ్య వచ్చే సన్నివేశం బాగుంటుంది, అలాగే రోహిణి హట్టంగడి, మృణాల్ సేన్ తో చెప్పే మాట, 'వంద మంచి పనులు చేసిన, ఒక చిన్న తప్పు చేస్తే ఆ మంచి పనులన్నీ పోతాయి' లాంటివి బాగుంటాయి. మధ్య తరగతి వాడిని కెలికితే మధ్యాహ్నానికి సీన్ రివర్స్ అవుతుంది అనే మాట, అలాగే లైబ్రరీ లో వచ్చే సన్నివేశం ఇలా కొన్ని సన్నివేశాల్లో మాటలు బాగా హత్తుకుంటాయి. చివర్లో కూడా కాళ్ళు, చేతులు వున్నప్పుడు చూసుకోవటం కాదు, అవి లేనప్పుడు కూడా మనం ఆ మనిషిని చూసుకోవాలి, వాడిని ఇచ్చేయండి, నేను తీసుకుపోయి నాకు ఇంకో అన్న వున్నాడు అని చూసుకుంటామని విజయ్ చెప్పే మాట కూడా హత్తుకుంటుంది. అయితే అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు బాగున్నా, ఈ సినిమా రెండో సగం అంతగా లేదు కాబట్టి, సినిమా యావరేజ్ గా వుండే అవకాశముంది.

Thefamilystarstillone.jpg

ఇక నటీనటుల విషయానికి వస్తే విజయ్ దేవరకొండ మధ్యతరగతి కుటుంబంలో బాధ్యతలు మోసే అబ్బాయిగా చాలా బాగా చేసాడు. 'గీత గోవిందం' సినిమా తరువాత అటువంటి పాత్రలాగే ఇది కూడా కొంచెం వుంది అనిపిస్తుంది. విజయ్ మంచి ప్రతిభ గల నటుడు తనకిచ్చిన పాత్రల్లో ఇమిడిపోతాడు, ఇందులో కూడా అలానే గోవర్ధన్ పాత్రలో ఇమిడిపోయాడు. కానీ కథ బలంగా లేనప్పుడు అతనుమాత్రం ఏమి చేస్తాడు. ఇక మృణాల్ ఠాకూర్ పాత్ర అంత బలంగా లేదు, అదీ కాకుండా విజయ్, మృణాల్ మధ్య ఆ కెమిస్ట్రీ అంతగా వర్కవుట్ కాలేదు అనిపిస్తుంది. రెండో సగంలో వెన్నెల కిశోర్ వస్తాడు, అతని కామెడీ చూసి చూసి మరీ బోర్ అయిపొయింది. ఏ సినిమాలో చూసిన అదే వినోదం, అవే సన్నివేశాలు అతనివి అనిపిస్తుంది.

అలాగే విజయ్ అతని కుటుంబం మధ్యలో కొన్ని బలమైన సన్నివేశాలు పెట్టి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబంలో జరిగే సంఘర్షణ ఈ సినిమాలో కనిపించదు. రెండో సగం అంతా కుటుంబం నుండి విడిపోయి వేరే కథ చూస్తున్నాము అన్నట్టుగా ఉంటుంది. రోహిణి హట్టంగడి పాత్ర అంతగా లేదు. ఒక తెలుగు తెలిసిన నటిని పెడితే ఆ పాత్రలో కొంచెం భావోద్వేగాలు ఉండేవేమో. క్లైమాక్స్ లో కూడా ఆమె సన్నివేశం అంతగా పండలేదు. జగపతి బాబు పాత్ర కామియో లా ఉంటుంది. వాసుకి, అభినయ తమ పాత్రల పరిధి మేరకి చేశారు. అల్లరి రవిబాబు పాత్ర ఎందుకు పెట్టారో దర్శక నిర్మాతలకు మాత్రమే తెలియాలి. దివ్యాంశ కౌశిక్ పాత్ర పరిమితం అయినా ఆమె చూడటానికి అందంగా వుంది. మిగతా పాత్రలన్నీ తమ పరిధి మేరకి చేశారు.

Thefamilystarstilltwo.jpg

చివరగా, 'ది ఫామిలీ స్టార్' అనే సినిమా మధ్య తరగతి కుటుంబానికి సంబందించిన కథ అని చెప్పినా, ఆ కుటుంబంలో జరిగే సంఘర్షణలని బలంగా దర్శకుడు పరశురామ్ చూపించలేకపోయాడు. అదీ కాకుండా, రెండో సగంలో కుటుంబం గురించి కథ కాకుండా, ఎదో బలవంతంగా చూపించినట్టుగా ఆ విదేశీ సన్నివేశాలు పెట్టడంతో మొదటి సగంలో జరిగే కథ నుండి ప్రేక్షకుడు వేరే కథకి వెళ్ళిపోతాడు. రెండింటికి పొంతన ఉండదు. మళ్ళీ పతాకసన్నివేశం కూడా అంత బలంగా లేకపోవటంతో, ఈ సినిమా ప్రేక్షకులకి ఎంతమేరకు కనెక్ట్ అవుతుంది అనే దానిమీద ఈ సినిమా ఫలితం ఉంటుంది.

Updated Date - Apr 05 , 2024 | 05:08 PM