Love Me Movie Review: వైష్ణవి చైతన్య, ఆశిష్ రెడ్డి సినిమా ఎలా ఉందంటే...

ABN , Publish Date - May 25 , 2024 | 01:44 PM

'బేబీ' సినిమా తరువాత వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'లవ్ మీ'. దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డి కథానాయకుడు, అరుణ్ భీమవరపు దర్శకుడు. ఎంఎం కీరవాణి, పీసీ శ్రీరామ్ లాంటి అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేసిన ఈ సినిమా ఎలా వుందో చదవండి.

Love Me Movie Review: వైష్ణవి చైతన్య, ఆశిష్ రెడ్డి సినిమా ఎలా ఉందంటే...
Love Me If You Dare Movie Review

సినిమా: లవ్ మీ

నటీనటులు: ఆశిష్ రెడ్డి, వైష్ణవి చైతన్య, రవి కృష్ణ, సిమ్రాన్ చౌదరి, రాజీవ్ కనకాల, తదితరులు

ఛాయాగ్రహణం: పీసీ శ్రీరామ్

సంగీతం: ఎంఎం కీరవాణి

నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, నాగ మల్లిడి

దర్శకత్వం: అరుణ్ భీమవరపు

విడుదల తేదీ: మే 25, 2024

రేటింగ్: 1.5

--సురేష్ కవిరాయని

దిల్ రాజు నిర్మాణ సంస్థ నుండి ఒక సినిమా విడుదలవుతోంది అంటే ప్రేక్షకుల్లో కొంచెం ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే ఒక పెద్ద సంస్థ, దానికితోడు ఆ నిర్మాణ సంస్థ నుండి ఇంతకు ముందు వచ్చే సినిమాలు ఒక అభిరుచితో ఉండేవి. ఇప్పుడు ఆ సంస్థ నుండి దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డి కథానాయకుడిగా 'లవ్ మీ' అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'బేబీ' సినిమాతో మంచి పేరు సంపాదించిన వైష్ణవి చైతన్య ఇందులో కథానాయకురాలు. అరుణ్ భీమవరపు దర్శకుడు. ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి, ప్రముఖ ఛాయాగ్రాహకుడు పీసీ శ్రీరామ్ ఈ సినిమాకి సంగీతం, ఛాయాగ్రహణం అందించారు. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్ల ఈ సినిమాకి ప్రొడక్షన్ చూసుకున్నారు. ఇంతమంది పేరున్న సాంకేతిక నిపుణులు పని చేసిన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం. (Love Me Movie Review)

lovemeifyoudare.jpg

Love Me Story కథ:

సినిమా ప్రారంభానికి ముందు చాలాసేపు ఉపోద్ఘాతం చెపుతాడు దర్శకుడు. రామచంద్రంపురం అనే వూర్లో ఒక పెద్ద బంగళాలో అప్పుడే పెళ్ళైన ఒక జంట వుంటారు, ఆమె మాత్రం ఆ వూర్లో ఎప్పుడూ ఎవరికీ కనపడదు, కానీ రాత్రి 8 అవగానే ఏడుపు మాత్రం వినిపిస్తుంది. ఒకరోజు ఆమె కాలిపోతూ చనిపోతుంది. ఆ ఇంట్లోకి వెళ్లి చూస్తే అక్కడ ఒక చిన్న పాప ఉంటుంది. ఆ తరువాత ఆ పాప ఏమైందో ఎవరికీ తెలియదు. ప్రస్తుతానికి వస్తే, అర్జున్ (ఆశిష్ రెడ్డి) దెయ్యాలు, భూతాలు లాంటివి లేవని చెపుతూ వీడియోలు పెడుతూ ఉంటాడు. అతని స్నేహితుడు ప్రతాప్ (రవి కృష్ణ) అవి యూట్యూబ్ లో పెడుతూ ఉంటాడు, వాటిని లక్షలమంది వీక్షిస్తూ వుంటారు. ప్రతాప్ కి ప్రియ (వైష్ణవి చైతన్య) అనే ప్రియురాలు ఉంటుంది, ఇద్దరూ ప్రేమించుకుంటూ వుంటారు. (Love Me Review) ఒకసారి ప్రతాప్ అప్పుడెప్పుడో కనపడకుండా పోయిన పాప దివ్యావతి చనిపోయి దెయ్యం అయిందని, ఆమెని ఒకసారి చూసినవాళ్లు ఎవరూ రెండో సారి చూడలేరని, ఆమె చంపేస్తుందని చెపుతాడు. ఇక అర్జున్ ఆ దివ్యావతి గురించి తెలుసుకోవాలని బయలుదేరుతాడు. ఆమె ఉంటున్న ఆ పాడుపడ్డ అపార్ట్మెంట్స్ కి వెళతాడు, అక్కడే ఉంటూ ఆమెతో ప్రేమలో పడతాడు. అతనికి అక్కడ కొన్ని విచిత్ర అనుభవాలు ఎదురవుతాయి. ఈలోపు ప్రతాప్, ప్రియ ఇద్దరూ అర్జున్ గురించి కంగారు పడుతూ అర్జున్ కి సహాయం చేయడానికి వస్తారు. (Love Me Movie Review) ఇంతకీ దివ్యావతి ఎవరు? ఆమె నిజంగానే దెయ్యమా, లేక బతికుందా? అర్జున్ కి ఎటువంటి అనుభవాలు ఎదురయ్యాయి? చనిపోయినవాళ్ల పుర్రె తీసుకువస్తే పింకీ వాళ్ళ రూపురేఖలతో బొమ్మని తయారుచేస్తూ ఉంటుంది, మరి ఆమె దివ్యావతి బొమ్మని కూడా చేసిందా? వీటన్నిటికీ సమాధానాలు తెలియాలంటే 'లవ్ మీ' సినిమా చూడండి.

lovemestill.jpg

విశ్లేషణ:

దిల్ రాజు ఒక అనుభవం వున్న నిర్మాత, ఎన్నో సినిమాలను నిర్మించారు. అందుకని అతని సంస్థ నుండి సినిమా వస్తోంది అంటే కొంచెమైనా బాగుంటుంది అని ప్రేక్షకుడు విశ్వసిస్తాడు. ఇప్పుడు ఒక కొత్త దర్శకుడు అరుణ్ భీమవరపు దరక్షత్వంలో ఆ సంస్థ నుండి 'లవ్ మీ' అనే సినిమా వచ్చింది. ఈ సినిమా ప్రారంభంలోనే దర్శకుడు ప్రేక్షకుడికి విసుగు పుట్టించేశాడు. ఎందుకంటే సినిమా ప్రారంభానికి చాలాసేపు రామచంద్రపురం అనే వూరిలో ఏమి జరుగుతోంది అనే విషయాన్ని చెపుతాడు. అబ్బ, ఏంటి ఎప్పుడవుతుందా అని ప్రేక్షకులు కొంచెం అసహనానికి గురవుతారు. అదీ కాకుండా దర్శకుడు తాను ఏమి చెప్పాలని అనుకున్నాడో అది సరిగ్గా చెప్పలేకపోయాడు. ఉపోద్ఘాతమే సరిగ్గా లేకుండా సాగితే, ఇక మిగతా కథ ఎలా ఉంటుందో ప్రేక్షకుడు ఇట్టే ఊహించుకోవచ్చు. (Baby fame Vaishnavi Chaitanya, Ashish Reddy starrer Love Me Movie Review)

దెయ్యాలు, భూతాలు లాంటివి లేవని, అవన్నీ అభూత కల్పనలు అని, ఎటువైపు ఎక్కువ వెళ్ళద్దని అంటారో, అటువైపు వెళ్లే కథానాయకుడికి దివ్యావతి అనే అమ్మాయి దెయ్యంగా మారి చాలామందిని చంపింది అనే విషయంపై ఆసక్తి వచ్చి ఆ దివ్యావతి ఎవరు, ఆమె బతికుందా, లేక దెయ్యమా తేల్చుకోవాలని బయలుదేరతాడు. ఆమె గురించి తెలుసుకునే దారిలో విచిత్రమైన విషయాలు బయటకి వస్తాయి. ఇది టూకీగా కథ. దీనికి దర్శకుడు అరుణ్ భీమవరపు ఎదో చేసి, గందరగోళం చేసి, కథ సరిగ్గా చెప్పకుండా, ప్రేక్షకుడిని కూడా గందరగోళంవైపు నెట్టేస్తాడు. దానికితోడు దెయ్యంతో ప్రేమ అనే భావన కొంచెం మరీ నమ్మకంగా ఉండదేమో.

lovemeifyoudarestill.jpg

పింకీ అనే ఆమెకి ఏదైనా పుర్రెని ఇస్తే ఆమె వెంటనే ఆమె రూపురేఖలు వేసేస్తుందట! అంటే ఆ పుర్రెకి అలంకారం, రంగులు వేసి అచ్చం చనిపోయిన అమ్మాయిలా తయారుచేస్తుంది. ఇవన్నీ నమ్మేయాలి మనం. ఇలాంటివి సినిమాలో చాలా వున్నాయి. మాట్లాడితే కథానాయకుడు ఒక పలుగు తీసుకొని సమాధి తవ్వేసి ఒక పుర్రెని తీసుకొచ్చి పింకీ కి ఇస్తాడు, ఆమె వెంటనే దానికి రూపురేఖలు ఇచ్చేస్తుంది. కొబ్బరి బొండాలు తీసుకొచ్చినట్టు పుర్రెలని తీసుకు వచ్చేస్తాడు మన కథానాయకుడు. ఇవన్నీ ప్రేక్షకులకి జోకులా కనపడుతుంది తప్ప నమ్మేట్టు చూపించలేకపోయారు దర్శకుడు. పోనీ పతాక సన్నివేశాలైన ఏమైనా బాగుంటాయి అంటే అది కూడా సరిగ్గా తీయలేకపోయాడు. ఇక కథానాయకురాలు ముందు ఒక అబ్బాయితో ప్రేమలో పడుతుంది, కానీ రెండో సగంలో సడన్ గా ఇంకో అబ్బాయిని ప్రేమించేస్తూ ఉంటుంది. దానివెనకాల బలమైన కారణం చూపించలేకపోయారు దర్శకుడు, ఆ సన్నివేశాల్ని కూడా సరిగ్గా రాసుకోలేకపోయాడు. (Love Me Movie Review)

ఈ సినిమాలో ఇంకో పెద్ద మైనస్ ఏంటంటే భావోద్వేగాలు అనేవి అసలు లేవు. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుడికి ఎదో మిస్ అవుతున్నాము అనే భావన వస్తూ ఉంటుంది. దానికితోడు ఈ సినిమా పీసీ శ్రీరామ్, ఎంఎం కీరవాణి లాంటి పెద్ద సాంకేతిక నిపుణులు పని చేశారు, కానీ వాళ్ళని సరిగ్గా వాడుకోలేకపోయారు. అది దర్శకుడి తప్పు. సినిమా చూస్తున్నప్పుడు ఒక ఫీల్ ఉంటుంది, ఈ సినిమాకి అది లేదు. దిల్ రాజు లాంటి నిర్మాత ఈమధ్య ఎందుకో తన కథలని తను సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. ఇంతకు ముందు దిల్ రాజు అంటే సినిమా ఆడుతుందో లేదో ఇట్టే చెప్పేసేవారు అని పరిశ్రమలో ఒక టాక్ ఉండేది, మరి అటువంటి రాజు గారు ఇప్పుడు తన సినిమాలవిషయంలో ఎందుకు అంత అలసత్వం తీసుకుంటున్నారో అర్థం కావటం లేదు. అసలు ఈ సినిమా నిజంగా దిల్ రాజు సంస్థ నుండే వచ్చిందా అనేట్టుగా ఈ సినిమా ఉందంటే దర్శకుడు ఎంతగా విఫలం అయ్యాడో ఆలోచించుకోండి.

loveme.jpg

ఇక నటీనటుల విషయానికి వస్తే, ఆశిష్ రెడ్డి తను చేసిన మొదటి సినిమా కన్నా ఈ సినిమాలో కొంచెం పరిణితి చెందాడు అనిపించింది. అతను కష్టపడతాడు అని అర్థం అవుతోంది, ఇది అతనికి రెండో సినిమా, ముందు ముందు మరిన్ని సినిమాలు చేసి ఇంకా నటనలో మంచి వావిధ్యం చూపిస్తాడు అని అనుకుందాం. వైష్ణవి చైతన్య పాత్రని దర్శకుడు బలంగా రాయలేకపోయాడు, మొదటి సగంలో ఆమె కనపడేది చాలా తక్కువ. రెండో సగంలో ఆమె పాత్ర ఉంటుంది, ఆమె తన పాత్రకి న్యాయం చేసింది. అందంగా వుంది, అలాగే ఎంతో సహజంగా నటించింది. ఆమె నటనలో ఈజ్ వుంది. రవి కృష్ణ తన పాత్రని చక్కగా చేశాడు, అతడి నటనలో మంచి పరిపక్వత వుంది. మంచి నటుడు అవుతాడు. సిమ్రాన్ చౌదరి పాత్ర అంత పెద్దగా లేదు. రాజీవ్ కనకాల మధ్యలో ఒకసారి కనపడతాడు. సినిమా బాగోలేనప్పుడు, మిగతా అంశాలు ఏవీ పరిగణలోకి ఎక్కువ రావు. అందుకని ఆ విషయాలు చర్చించడం అవసరం అనిపిస్తుంది.

చివరగా, 'లవ్ మీ' సినిమా దర్శకుడు అరుణ్ భీమవరపు అనుకున్నది ఒకటి, తెరపైన చూపించింది ఇంకొకటి అన్నట్టుగా వుంది. కథ ప్రేక్షకుడికి ముందే తెలిసినా, ఆ కథని నేరుగా చెప్పకుండా, ఏవేవో ట్విస్టులని గందరగోళానికి గురిచేస్తాడు దర్శకుడు. దిల్ రాజు లాంటి నిర్మాణ సంస్థ నుండి ఇటువంటి సినిమా వస్తుందని ఎవరూ ఊహించరు. దిల్ రాజు కి ఎందుకో ఈమధ్య కథలపై పట్టు తప్పుతోంది. ఇంతకు ముందు 'ఫామిలీ స్టార్', ఇప్పుడు ఈ 'లవ్ మీ'.

Updated Date - May 25 , 2024 | 02:55 PM