Ashwathama: అశ్వత్థామ చిరంజీవి ఎందుకయ్యాడు, అతన్ని చూడకూడదు అంటారు ఎందుకు?

ABN , Publish Date - Apr 23 , 2024 | 02:16 PM

'కల్కి 2898 ఏడి' సినిమా నుండి అమితాబ్ బచ్చన్ పోషించిన అశ్వత్థామ పాత్రను ఆ చిత్ర నిర్వాహకులు విడుదల చేశారు. పురాణంలో మాత్రమే కనపడే, వినపడే అశ్వత్థామ చిరంజీవి ఎందుకయ్యాడు? అతను చింపి గుడ్డలు కట్టుకొని ఎందుకు అలా తిరుగుతున్నాడు? అతను ఎందుకు కొన్ని వేలమందిని చంపవలసి వచ్చింది? ప్రేక్షకుల కోసం అశ్వత్థామ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చదవండి

Ashwathama: అశ్వత్థామ చిరంజీవి ఎందుకయ్యాడు, అతన్ని చూడకూడదు అంటారు ఎందుకు?
Ashwatthama

అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః, కృపః పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః, సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మార్కండేయమథాష్టమం. ఇది వేదంలో వుండే ఒక శ్లోకం. ఇందులో ఏడుగురు చిరంజీవులు వున్నారు. అందులో మొదటివాడు అశ్వత్థామ.. తరువాత బలి చక్రవర్తి, వ్యాసమహర్షి, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు వీరందరికీ మరణం లేదు, చిరంజీవులుగా తిరుగుతూ వుంటారు. కలియుగంలో కూడా వీళ్ళు తిరుగుతూ ఉంటారని ప్రతీతి, చాలామందికి కనిపించారని అంటూ వుంటారు.

విభీషణుడు రామేశ్వరంలో రాముడు ప్రతిష్టించిన శివలింగానికి పూజ చెయ్యడానికి వస్తూ ఉంటాడు అని అంటారు. అలాగే వ్యాస మహర్షి కాళిదాసు మహాకవికి కనిపించారని తన రచనల్లో చెప్పారు. పరశురాముడు కూడా హిమాలయాల్లో తిరుగుతూ ఉంటాడని అంటారు. అయితే ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే, ఇప్పుడు పైన చెప్పిన ఏడుమంది చిరంజీవుల్లో అశ్వత్థామ గురించిన చర్చ జరుగుతోంది. ఎవరీ అశ్వత్థామ అని అందరూ వెతకటం మొదలెట్టారు.

ఎందుకంటే 'కల్కి 2898 ఏడి' సినిమా నుండి అమితాబ్ బచ్చన్ లుక్ ని నిన్న చిత్ర నిర్వాహకులు విడుదల చేశారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా, దీపికా పడుకొన్, దిశా పటాని నటించిన సినిమా ఇది. ఇందులో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో కనపడతారు. అతను తన ఒంటికి గాయాలతో, చిరిగిన బట్టలు కట్టుకొని కనపడతారు. ఒక పిల్లవాడు ఎవరు నువ్వు అని అనేక భాషల్లో అడిగితే, అతను 'నేను ద్రోణాచార్య తనయుడిని అశ్వత్థామను' అని చెప్తాడు.

ఎవరీ అశ్వత్థామ?

ద్రోణాచార్యుడుకి, కృపికి పుట్టిన కుమారుడు అశ్వత్థామ. ద్రోణాచార్యుడు శివుడి కోసం తపస్సు చేసి కుమారుడిని పొందుతాడు. ఒక గుహలో పుడతాడు అశ్వత్థామ. ద్రోణాచార్యుడి తపస్సు మెచ్చి ఈశ్వరుడు అశ్వత్థామ నుదిటిపై ఒక అద్భుతమైన మణితో పుట్టిస్తాడు. అందువలన అతనికి ఆకలిదప్పికలు, అలసట, వృద్ధాప్యం లాంటివి రావు, వ్యాధులు సోకవు, ఆయుధాలు అతనిపై పనిచేయవు. అతనికి మరణం లేదు, చిరంజీవి. ద్రోణాచార్యుడికి కుమారుడు అశ్వత్థామ అంటే ఎనలేని ప్రేమ. ద్రోణాచార్యుడు, ద్రుపదుడు (ద్రౌపది తండ్రి) స్నేహితులు. వారిద్దరు ఒకే గురువు భరద్వాజ మహర్షి వద్ద విద్యాభ్యాసం నేర్చుకుంటారు. అప్పుడే ద్రుపదుడు, ద్రోణుడికి మాటిస్తాడు, పాంచాల దేశానికి తాను రాజు అయిన తరువాత తన రాజ్యభాగంలో సగం ద్రోణుడికి కూడా ఇస్తాను అని అంటాడు. అయితే ద్రోణుడికి అటువంటి సంపదలపై వ్యామోహం లేక వదిలేసుకుంటాడు, పేదవాడుగానే జీవిస్తూ వుంటారు. అశ్వత్థామ పుట్టిన తర్వాత పాలకోసం ఏడుస్తాడు, బిడ్డకి పాలివ్వడానికి తన దగ్గర ఒక ఆవు కూడా లేదు అని, ద్రుపదుడి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి, పాంచాల దేశం వెళ్లి ద్రుపదుడిని కొన్ని గోవులు అడుగుతాడు. ద్రుపదుడు ఇచ్చినమాట తప్పి, ద్రోణాచార్యుడిని అవమానపరుస్తాడు.

ashwatthama.jpg

అలా తిరిగి తిరిగి ద్రోణాచార్యుడు చివరికి హస్తినాపురం చేరుకొని అక్కడ కౌరవుల, పాండవులకు అనేక విద్యలు బోధిస్తూ గురువుగా ఉండిపోతాడు. విద్యలు పూర్తయిన తరువాత శిష్యులు గురుదక్షిణగా ఏమి కావాలని అడగ్గా, ద్రుపదుడిని పట్టి బంధించి తీసుకురమ్మని చెపుతాడు ద్రోణాచార్యుడు. ఎందుకంటే ద్రుపదుడు చేసిన అవమానం, అతనిపై క్రోధం వలన ద్రోణాచార్యుడు ఆ కోరిక కోరారు. దుర్యోధనాదులు వెళ్లి ద్రుపదుడు చేతిలో ఓడిపోయి వచ్చేస్తే, అర్జునుడు వెళ్లి ద్రుపదుడిని బంధించి ద్రోణాచార్యుడు కాళ్లదగ్గర పడేస్తాడు. అప్పుడు ద్రోణాచార్యుడు, ద్రుపదుడిని చూచి అతడు ఇచ్చిన మాటను గుర్తు చేస్తాడు, పాంచాల దేశానికి ఇప్పుడు నా కుమారుడైన అశ్వత్థామని రారాజుగా చేస్తే నువ్వేమి చేయగలవు అని అంటాడు ద్రోణుడు. అయినా ద్రుపదుడుని క్షమించి వదిలేస్తాడు. ద్రుపదుడు తన రాజ్యం చేరుకొని ద్రోణాచార్యుడిని చంపే కుమారుడు, అర్జునుడిని పెళ్లాడే కుమార్తె కావాలని గొప్ప యజ్ఞం చేస్తాడు. అప్పుడు ద్రౌపది, దుష్టద్యుమ్నుడు కుమార్తె, కుమారులుగా అగ్నిలోంచి పుడతారు.

పాండవ, కౌరవుల మధ్య తగాదాలు, అవి చివరికి కురుక్షేత్ర యుద్ధానికి దారితీసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. యుద్ధంలో భీష్మణాచార్యుడు పడిపోయాక, ద్రోణాచార్యుడు సారధ్యం తీసుకుంటాడు. అతనిని జయించటం కష్టం అని తెలిసిన కృష్ణుడు మాయోపాయంతో ఓడించాలని, భీముడిని అశ్వత్థామ అనే ఏనుగుని చంపమంటాడు. భీముడు ఆ ఏనుగుని చంపి, అశ్వత్థామ చనిపోయాడు అని చెపుతాడు. అది విన్న ద్రోణాచార్యుడు తన పుత్రుడు మరణించాడు అనుకొని, అదే విషయం ధర్మరాజుని అడుగుతాడు. ధర్మరాజు 'అశ్వత్థామ హతః' అని పెద్దగా చెప్పి, 'కుంజరః' అని గోణికినట్టు చెపుతాడు. అంటే 'అశ్వత్థామ అనే ఏనుగు చనిపోయింది' అని. అశ్వత్థామ చనిపోయాడు అని ధర్మరాజు చెప్పగానే, ద్రోణాచార్యుడు అస్త్ర సన్యాసం చేసేస్తాడు, ప్రాణాలు విడుస్తాడు, అప్పుడు అతన్ని చంపటానికే పుట్టిన దుష్టద్యుమ్నుడు వెళ్లి కత్తితో ద్రోణుడి తల నరికేస్తాడు. అది అశ్వత్థామ చూసి, తన తండ్రిని చంపినా దుష్టద్యుమ్నుడిని, పాండవులను నాశనం చెయ్యాలని అప్పటినుండి పగ పెంచుకుంటాడు.

కురుక్షేత్ర యుద్ధం ముగిసింది, దుర్యోధనుడు తొడలు విరిగి యుద్ధభూమిలో పడిపోతాడు. కేవలం కౌరవుల పక్షాన అశ్వత్థామ, కృపాచార్యులు, కృతవర్మ ముగ్గురే వీరులు బతికి వుంటారు. ఆ రాత్రి అశ్వత్థామ కాగడా వెలుగులో దుర్యోధనుడి దగ్గరికి వెళ్లి తనని సైన్యానికి అధిపతిని చేస్తే, అపాండవం చేసి వస్తా అని మాటిస్తాడు. అపాండవం అంటే పాండవ వంశం లేకుండా చెయ్యడం. దుర్యోధనుడు సరే అంటాడు. అదేరోజు అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ తో కలిసి పాండవ శిబిరంలోకి చొరబడి, అందరూ నిద్రిస్తుండగా, ముందుగా తన తండ్రిని చంపిన దుష్టద్యుమ్నుడిని లేపి చంపుతాడు. తరువాత ఉప పాండవులను, మిగతా పాండవ వీరులందరినీ, గుర్రాలని, ఏనుగులని చంపుకుంటూ వెళతాడు. కృష్ణభగవానుడికి ముందుగానే తెలుసు కనక, పాండవులని ఆ రాత్రి శిబిరానికి దూరంగా గంగాతీరానికి తీసుకువెళ్లడంతో పాండవులైదుగురు బయటపడతారు. తెల్లవారగానే పాండవులు శిబిరానికి వచ్చి కుమారులు చనిపోయి ఉండటం చూసి, అశ్వత్థామ చేసిన పని అని తెలుసుకొని అతన్ని పట్టుకోవటానికి అర్జునుడు వెళతాడు.

అది తెలుసుకున్న అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే, దానికి విరుగుడు అర్జునుడు కూడా తిరిగి బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. లోకాలు తల్లడిల్లుపోతాయి ఉపసంహరించండి రెండు బ్రహ్మాస్త్రాలు అని మహర్షులు, మునులు అర్థిస్తే అర్జునుడు ఉపసంహరిస్తాడు. అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం అభిమన్యుడి భార్య ఉత్తర గర్భంలో వున్న శిశువును దహించబోతే, ఉత్తర కృష్ణుడిని ప్రార్ధిస్తుంది కుమారుడిని రక్షించమని. అప్పుడు కృష్ణుడు ఉత్తరా గర్భంలో వున్న శిశివును రక్షించి, అశ్వత్థామకి శాపం ఇస్తాడు. అశ్వత్థామ నుదిటిపైన వున్న మణిని తీసివేసి, అరణ్యాలలో, చీము నెత్తురుతో, అరుస్తూ ఉగ్రభూతంలా తిరుగుతూ ఉంటావు, చావు కోసం పరితపిస్తూ ఉంటావు అని కృష్ణుడు, అశ్వత్థామకి శాపం ఇస్తాడు. కానీ అతను చావడు, ఉగ్రభూతంగా తిరుగుతూ ఉంటాడు. అందుకే అతన్ని ఎవరూ చూడకూడదు అని అనుకుంటూ వుంటారు అని పురాణాల్లో చెపుతూ వుంటారు. అటువంటి అశ్వత్థామ ఇప్పటికీ హిమాలయాల్లో తిరుగుతూ ఉంటాడు అని పురాణాలు చెపుతూ ఉంటాయి.

విషయానికి వస్తే, ఇప్పుడు 'కల్కి 2898 ఏడి' సినిమాలో అమితాబ్ బచ్చన్ పోషించిన అశ్వత్థామ పాత్ర ఒక బాలుడికి కనిపించడం, ఆ బాలుడికి తాను ద్రోణాచార్య తనయుడు అశ్వత్థామని అని చెప్పడంతో ఈ అశ్వత్థామ ఎవరు అనే విషయం అందరికీ ఆసక్తికరంగా అనిపించింది. అదీ కాకుండా అమితాబ్ ఒంటికి చిరిగిన గుడ్డలు చుట్టుకొని చూపించటంలో రహస్యం కూడా అశ్వత్థామకి కృష్ణుడు ఇచ్చిన శాపం వలన అని అర్థం అవుతోంది. ఇంతకీ నాగ్ అశ్విన్ దర్శకత్వం చేస్తున్న ఈ సినిమా ఇప్పుడు కథ కొంత వరకు ప్రేక్షకులకి అర్థం అయ్యే ఉంటుంది. ఈ కథలో కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి, తరువాత కొన్ని వందల సంవత్సరాలు ముందుకి వెళ్లొచ్చు అని ఈ అమితాబ్ బచ్చన్ సన్నివేశంతో ఊహాగానాలు ప్రారంభం అయ్యాయి.

Updated Date - Apr 23 , 2024 | 02:16 PM