Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై 'అర్జున్ రెడ్డి' దర్శకుడు సంచలన కామెంట్స్

ABN , Publish Date - Apr 18 , 2024 | 05:35 PM

సందీప్ రెడ్డి వంగా హిందీ సినిమా 'కబీర్ సింగ్' పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఒక బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. నా సినిమాలో ఎందుకు మిమ్మల్ని తీసుకున్నానా అని నేను కూడా బాధపడుతున్నా అంటూ, ఇంకా అతని గురించి ఏమి చెప్పారో చదవండి

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై 'అర్జున్ రెడ్డి' దర్శకుడు సంచలన కామెంట్స్
Sandeep Reddy Vanga

సందీప్ రెడ్డి వంగా తన సినిమాని, తనని ఎవరైనా విమర్శిస్తుంటే చూస్తూ కూర్చునే రకం కాదు. అటువంటి వారందరికీ చాలా ఘాటుగా సమాధానం చెపుతూ ఉంటాడు. తన మొదటి సినిమా 'అర్జున్ రెడ్డి' ఘన విజయం సాధించిన తరువాత, అదే సినిమాని హిందీలో 'కబీర్ సింగ్' అనే పేరుతో రీమేక్ చేశాడు సందీప్ వంగా. తాజాగా 'యానిమల్' అనే హిందీ సినిమా తీసి బాలీవుడ్ లో తన జయకేతనాన్ని దృఢ పరచుకున్నాడు సందీప్.

sandeepreddyvanga.jpg

'కబీర్ సింగ్' లో కాలేజీ డీన్ పాత్ర చేసిన అదిల్ హుస్సేన్ ఒక ఇంటర్వ్యూ లో 'కబీర్ సింగ్' సినిమా గురించి ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "ఇప్పటి వరకు నా కెరీర్ లో ఏదైనా సినిమాలో ఎందుకు నటించానా అని అనుకున్నది వున్నది అంటే, అది ఒక్క 'కబీర్ సింగ్' మాత్రమే" అని వ్యాఖ్యలు చేశారు అదిల్ హుస్సేన్. అందులో తాను డీన్ పాత్ర వేశానని, మొదట్లో తాను ఆ పాత్ర చెయ్యను అని చెప్పినా, ఎక్కువ పారితోషికం ఇస్తామని చెప్పారని, ఒక్కరోజే చిత్రీకరణ ఉంటుందని చెప్పారని, అందుకే చేశానని ఆ ఇంటర్వ్యూలో అదిల్ హుస్సేన్ చెప్పారు. అయితే చిత్రీకరణ జరిగిన తరువాత తన పాత్ర చాలా బాగుందని, సినిమా కూడా అలాగే ఉంటుందని భావించానని, కానీ సినిమా చూసాక తాను ఎందుకు ఈ సినిమా చేశానా అని ఇబ్బంది పడ్డాను, అని చెప్పారు ఆదిల్ హుస్సేన్. స్నేహితుడితో సినిమా చూశానని, కానీ మధ్యలోనే బయటకి వచ్చేశాను అని, తన భార్యకి ఈ సినిమా చూడవద్దు అని చెప్పాను అని చెప్పుకొచ్చారు ఆదిల్ హుస్సేన్.

adilhussain.jpg

అయితే ఆదిల్ చేసిన వ్యాఖ్యలు దర్శకుడు సందీప్ రెడ్డి చూసి, వెంటనే చాలా ఘాటుగా సమాధానం 'ఎక్స్' లో ఇచ్చాడు. "మీరు గొప్పగా భావించి చేసిన 30 సినిమాలలో రాని గుర్తింపు, విజయాన్ని మీరు ఎందుకు 'ఈ సినిమాలో నటించానా' అనే ఈ ఒక్క సినిమాతో సొంతం చేసుకున్నారు. నా సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు నేను ఇప్పుడు బాధపడుతున్నాను, అని చెప్పారు సందీప్ వంగా. ఇంకా చెపుతూ, ఇకపై మీరు సిగ్గుపడాల్సిన పనిలేదు, ఎందుకంటే మీ మొహాన్ని ఏఐ సహాయంతో నేను మార్చేస్తా, అప్పుడు మీరు హాయిగా నవ్వుకోవచ్చు, అని పోస్ట్ చేశారు సందీప్ వంగా. ఇప్పుడు ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఆదిల్ హుస్సేన్ ఇంతకు ముందు కొన్ని హిందీ సినిమాల్లో నటించారు. అందులో 'ఇంగ్లీష్ వింగ్లిష్', 'ఏజెంట్ వినోద్', 'లైఫ్ ఆఫ్ పై', 'కాంచి: ది అన్ బ్రేకబుల్', 'బెల్ బాటమ్', 'పరీక్ష', 'సార్జెంట్' లాంటి సినిమాల్లో కనిపించారు.

Updated Date - Apr 18 , 2024 | 05:37 PM