Sandeep Reddy Vanga: మహేష్ బాబుకి ఒక కథ చెప్పా.. కానీ?

ABN , First Publish Date - 2023-11-25T19:10:48+05:30 IST

బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన వైల్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం ‘యానిమల్’. ఈ సినిమా ప్రమోషన్స్‌ను ఓ రేంజ్‌లో మేకర్స్ నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం.. మొత్తంగా 5 భాషల్లో ఏకకాలంలో గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ఈ సినిమా సిద్ధమైంది. ఈ నేపధ్యంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. మీడియాకు చిత్ర విశేషాలను తెలిపారు.

Sandeep Reddy Vanga: మహేష్ బాబుకి ఒక కథ చెప్పా.. కానీ?
Sandeep Reddy Vanga

బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కిన వైల్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం ‘యానిమల్’ (Animal). ఈ సినిమా ప్రమోషన్స్‌ను ఓ రేంజ్‌లో మేకర్స్ నిర్వహిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ఈ సినిమాలో ర‌ణ్‌బీర్ క‌పూర్‌కు జోడిగా ర‌ష్మిక మంద‌న్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించింది. అనిల్ కపూర్, బాబీ డియోల్ ఇతరకీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ అండ్ క్రిషన్ కుమార్ టి-సిరీస్, ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం.. మొత్తంగా 5 భాషల్లో ఏకకాలంలో గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ నేపధ్యంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. మీడియాకు చిత్ర విశేషాలను తెలిపారు.

మీ తొలి చిత్రం ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy)లో అమ్మాయి అబ్బాయి మధ్య ప్రేమకథ కనిపించింది. ‘యానిమల్’ ట్రైలర్ (Animal Trailer) చూస్తే ఇది తండ్రీకొడుకుల ప్రేమకథ అనిపిస్తుంది.. అవునా?

అవునండీ. ఒక విధంగా దీన్ని తండ్రీ కొడుకుల ప్రేమకథగా అనుకోవచ్చు. ప్రైమరీ స్టోరీ అదే. ఒక వ్యక్తి కుటుంబం కోసం ఎంత దూరం వెళ్తాడనేది ఈ కథ యొక్క సారాంశం.

‘అర్జున్ రెడ్డి’ పాత్రలో చాలా కోపం వుంటుంది. యానిమల్‌లో రణ్‌బీర్ పాత్రలో కూడా ఆ ఛాయలు కనిపిస్తున్నాయి. పాత్రలు పరంగా అర్జున్ రెడ్డికి యానిమల్‌కి సిమిలారిటీస్ ఉన్నాయా?

ఇద్దరూ చాలా నిజాయితీ వున్న వ్యక్తులు(నవ్వుతూ). అదొక్కటే కామన్ ఫ్యాక్టర్. అర్జున్ రెడ్డికి కోపం వస్తే కంట్రోల్ చేయలేని పాత్ర. యానిమల్ పాత్రకు మాత్రం సామాన్యంగా అందరి వ్యక్తులకు వుండే కోపమే వుంటుంది. అర్జున్ రెడ్డి, యానిమల్.. ఈ రెండూ కూడా క్యారెక్టర్ బేస్డ్ సినిమాలే. అదొక సిమిలారిటీగా చెప్పొచ్చు. ఇది తప్పించి కథ, పాత్ర కంప్లీట్ డిఫరెంట్‌గా వుంటుంది.

మీ చిత్రాలలో హీరో పాత్రని తీవ్రమైన ఎమోషన్, ఇంటెన్స్‌తో డిజైన్ చేయడానికి కారణం?

అర్జున్ రెడ్డి విషయానికి వస్తే.. ప్రేమ విషయంలో చాలా నిజాయితీగా వుండే పాత్ర అది. అలాంటిది ప్రేమ దూరమైనపుడు సహజంగానే ఇంటెన్స్ ఎమోషన్ వుంటుంది. యానిమల్‌లో తండ్రి కోసం ఏదైనా చేయగలిగే ఓ కొడుకు పాత్రని రాసుకున్నపుడు, అతని ఎమోషనల్ కోషేంట్ సహజంగానే హై వుంటుంది. ఎమోషనల్‌గా హై వున్న వాళ్ళే అలా చేయగలుగుతారు. అంతే గానీ కావాలని చేసింది కాదు. (Sandeep Reddy Vanga Interview)


Animal-1.jpg

ట్రైలర్ చూస్తే ఎమోషన్ చాలా కనిపిస్తోంది. అయితే ఆ ఎమోషన్‌ని వయలెన్స్ డామినేట్ చేస్తుందా? ఇందులో ఎమోషన్, వయలెన్స్ ఏది ఎక్కువ వుంటుంది?

ఎమోషన్, వయలెన్స్ అన్నీ సరిగ్గా బ్యాలెన్స్ చేశాననే అనుకుంటున్నాను(నవ్వుతూ).. సినిమా చూసి అది ప్రేక్షకులే చెప్పాలి.

‘నా తర్వాత సినిమాలో వయలెన్స్ ఎలా వుంటుందో చూపిస్తా’ అని మీరు ఓ సందర్భంలో చెప్పడం చాలా వైరల్ అయ్యింది కదా?

దాని గురించి మీకు చెప్పాలి(నవ్వుతూ). అర్జున్ రెడ్డి మన తెలుగులో యునానిమస్‌గా అందరికీ నచ్చింది. దాదాపు అందరు విమర్శకులు కూడా ప్రశంసించారు. అదే సినిమా హిందీలో చేసినప్పుడు అందరికీ నచ్చింది. కానీ అక్కడ కొంతమంది విమర్శకులు అందులో వయలెన్స్ ఎక్కువ వుందని అన్నారు. మన సెన్సిబిలిటీస్‌కి వాళ్ళకి తేడా ఉందని అనుకున్నా. ఆ సమయంలో ఒక ఇంటర్వ్యూ‌లో ‘మీ నెక్స్ట్ సినిమాకి ఇంత వయలెన్స్ వుండకూడదు’ అని అనడంతో.. మామూలు కాలేజీలో జరిగే ప్రేమకథే వాళ్లకి వయలెన్స్ అనిపించింది కదా.. తండ్రి కోసం ఏదైనా చేసే కొడుకు పాత్ర ఇంకెంత వయలెన్స్‌గా అనిపిస్తుందనే ఉద్దేశంతో.. ‘నా నెక్స్ట్ సినిమాలో వయలెన్స్ అంటే ఏమిటో చూపిస్తా అన్నాను. అది చాలా వైరల్ అయిపోయింది. (Sandeep Reddy Vanga about Animal)

‘అర్జున్ రెడ్డి’లో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాముఖ్యత వుంటుంది. మరి ‘యానిమల్’లో ర‌ష్మిక పాత్రకు కథలో ఎలాంటి ప్రాముఖ్యత వుంటుంది?

ర‌ష్మిక‌గారిది చాలా ముఖ్యమైన పాత్ర. సినిమా ఆద్యంతం వుంటుంది. రెగ్యులర్‌గా కాకుండా చాలా డిఫరెంట్‌గా వుంటుంది. హీరోని పేరెంట్స్ కంటే ఎక్కువ అర్థం చేసుకున్న పాత్ర. ఇందులో హీరో తర్వాత సమాన ప్రాధాన్యత వున్నది ర‌ష్మిక, అనిల్ కపూర్ (Anil Kapoor) పాత్రలకే. ఇందులో మంచి ప్రేమకథ (Love Story) కూడా వుంటుంది.

యానిమల్ రన్ టైం దాదాపు 3 గంటల 20 నిముషాలు వుంది కదా.. అది ప్రతికూలమయ్యే అవకాశం ఉందా?

లేదండీ. అర్జున్ రెడ్డి మూడు గంటల ఆరు నిమిషాల సినిమా. అది ఒక అమ్మాయి అబ్బాయి కథే. యానిమల్‌లో ఒక కుటుంబం, ప్రత్యర్ధులు ఇలా లేయర్స్ వున్నాయి. అర్జున్ రెడ్డి కంటే పదిహేను నిముషాలే ఎక్కువ. ఇంకో పది నిముషాలు హాయిగా ఏసీలో కూర్చుని సినిమాని ఎంజాయ్ చేస్తారనే నమ్మకం వుంది.


Animal-3.jpg

రణ్‌బీర్ కపూర్‌లాంటి బిగ్గెస్ట్ స్టార్‌తో పని చేయడం ఎలా అనిపించింది?

రణ్‌బీర్ కపూర్ చాలా గొప్ప వ్యక్తిత్వం వున్న మనిషి. ఒక పెద్ద స్టార్, ఇన్ని సినిమాల అనుభవం వుందనే భావన ఆయన ఎప్పుడూ చూపించలేదు. ఆయనకి కథ చెప్పాను. నచ్చింది. తర్వాత కథ గురించి సినిమా గురించి మాట్లాడుకోవడమే కానీ మరో చర్చ వుండేది కాదు. విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda)తో నా మొదటి సినిమా ‘అర్జున్ రెడ్డి’కి పని చేసినప్పుడు ఎలా ఉండేదో.. రణ్‌బీర్‌తో పని చేసినప్పుడు కూడా అలానే అనిపించింది. ఇక రణ్‌బీర్ కపూర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలోనే తను అత్యుత్తమ నటుడు.

ఈ సినిమాకి ‘యానిమల్’ అనే పేరు పెట్టడానికి కారణం? (Animal Title)

మనకి చదువు, తెలివితేటలు వచ్చి హ్యూమన్ బీయింగ్ అని పేరు పెట్టుకున్నాం. అయితే మాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్. మనకి ఐక్యూ వుండి, కమ్యునికేషన్ పెరిగి, ఫుడ్ చెయిన్‌లో మొదటిగా ఉంటూ వస్త్రాలు ధరించాం. కానీ అవి లేకపోతే యానిమల్ కదా అనేది నా పర్శనల్ ఫీలింగ్. చిన్నప్పుడు సోషల్ స్టడీస్ చదువుకునప్పుటి నుంచి అలానే అనిపించేది. అయితే నేను అలోచించినది ఏమిటంటే.. యానిమల్‌కు ఐక్యు వుండదు. తన ప్రవృత్తి (instinct)‌తో ప్రవర్తిస్తుంటుంది. ఇందులో హీరో పాత్ర కూడా అలా బిహేవ్ చేస్తుంది. అలాంటి పాత్రకు సంబంధించిన కథకు ‘యానిమల్’ అనే టైటిల్ బాగుంటుందని ఈ పేరు పెట్టడం జరిగింది.

ఇందులో అనిల్ కపూర్, బాబీ డియోల్ పాత్రలు ఎలా వుంటాయి?

యానిమల్ కథలో అనిల్ కపూర్ గారిది కీలక పాత్ర. అతని వల్లనే, అతని గురించే ఈ సినిమా డ్రైవ్ అవుతుంది. బాబీ డియోల్ విలన్‌గా కనిపిస్తారు. ఆ పాత్రల గురించి ఎక్కువ రివీల్ చేయకూడదు. తెరపై చూడాల్సిందే.

‘యానిమల్’లో రివెంజ్ కోణం చాలా బలంగా ఉన్నట్లు అనిపిస్తోంది?

అవును. రివెంజ్‌ని కంటిన్యూ చేయడం మామూలు ఎనర్జీ కాదు. ప్రేమ కంటే రివెంజ్‌లో ఎక్కువ ఎనర్జీ వుందని అనిపించింది. రివెంజ్ సాధించాడా? లేదా అనే మాట కంటే ఆ ప్రయాణం పట్టుకోవడం చాలా కష్టమైన విషయం. మీరు గమనిస్తే ‘వార్’ చిత్రాలలో కూడా బలమైన రివెంజ్ వుంటుంది. యానిమల్ రాస్తున్నప్పుడు కూడా ప్రేమ కంటే రివెంజ్ పెద్ద ఎమోషన్ అనిపించింది.

Animal-2.jpg

‘యానిమల్’ పాటలు డిఫరెంట్ కంపోజర్స్‌తో చేశారు కదా.. ఆ అనుభవం ఎలా అనిపించింది. హర్ష వర్షన్ రామేశ్వర్ నేపధ్య సంగీతం గురించి?

నా సినిమాలో సౌండ్, మ్యూజిక్‌కి చాలా ప్రాధాన్యత ఇస్తాను. ముంబైలో సోలో కంపోజర్‌తో వెళ్ళడం కష్టమైపోయింది. అయితే కబీర్ సింగ్ సినిమా అయ్యేసరికి నాకు కొంచెం అది అలవాటైంది. డిఫరెంట్ కంపోజర్స్‌తో వెళితే అందరికీ కథ నేరేట్ చేయాలి. దాని కోసం ప్రత్యేకంగా శ్రమ తీసుకోవాలి. మ్యూజిక్ అంతా ఒక ఆల్బమ్‌గా బ్యాలెన్స్ చేయడం కోసం కూడా ఎఫర్ట్ పెట్టాలి. దానిపై ఒక అవగాహన వుంది కాబట్టి నాకు అది వర్కవుట్ అవుతుంది. హర్ష వర్షన్ రామేశ్వర్ నేపధ్య సంగీతం చేశారు. మాకు మంచి సింక్ కుదిరింది. చాలా అద్భుతంగా చేశాడు. (Animal Music Directors)

‘యానిమల్’కు మీ అన్నయ్య కూడా ఒక నిర్మాత.. దీని గురించి?

నన్ను క్రియేటివ్ పరంగా క్రిటిసైజ్ చేసేది మొదటి నుంచి మా అన్నయ్యే. అర్జున్ రెడ్డిని అన్నయ్యే నిర్మించారు. మనం ప్రొడక్షన్‌లో వుంటే క్రియేటివ్‌గా కూడా కంట్రోల్ వుంటుంది. భూషణ్ గారితో ‘కబీర్ సింగ్‌’ (Kabir Singh)కి కలిసి పని చేశాను. ఆయన కూడా క్రియేటివ్‌గా చాలా ఫ్రీడమ్ ఇస్తారు.

‘యానిమల్’ చిత్రానికి ఎడిటర్‌గా కూడా చేయడానికి కారణం?

నేను ఎడిటింగ్ చేస్తా. ఎడిటింగ్ చాలా ఇష్టం. నిజానికి అది చాలా కష్టమైన పని. అయితే నా సినిమా నా కంటే ఎక్కువగా ఎవరికీ అర్థం కాదనేది నా భావన. అయితే ఇంకా బెటర్‌గా చేసే వాళ్ళు వుంటే ఖచ్చితంగా ఇచ్చేస్తా. అలా అయితే నాకు చాలా సమయం కూడా కలిసొస్తుంది.

‘అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్’ లాంటి రెండు పెద్ద విజయాల తర్వాత వస్తున్న ‘యానిమల్’పై చాలా అంచనాలు వున్నాయి కదా.. ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?

నిజంగా నేను ఎలాంటి ఒత్తిడి తీసుకొను. ఇన్స్టింక్ట్‌గా ఆలోచించడం. మంచి అవుట్ పుట్ ఇవ్వడంపైనే దృష్టి ఉంటుంది కానీ మిగతా విషయాలపై ఒత్తిడి తీసుకొను.


Animal-4.jpg

యానిమల్ లిరిక్స్, యాక్షన్ కొరియోగ్రఫీ గురించి?

లిరిక్స్ అనంత శ్రీరామ్ సింగిల్ కార్డ్ రాశారు. లిరిక్స్ తెలుగు నేటివిటీకి తగట్టుగా వున్నాయని మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. పాటలు, లిరిక్స్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ సుప్రీం సుందర్‌గారు చేశారు. ఆయన చాలా సాఫ్ట్ పర్సన్. యాక్షన్ మాత్రం వైల్డ్‌గా చేశారు.

హీరో పాత్రకు తెలుగులో డబ్బింగ్ చెప్పింది ఎవరు?

ఇందులో హీరో పాత్రకు తెలుగులో డబ్బింగ్ చెప్పింది వాసు గారు. చాలా అద్భుతంగా చెప్పారు. ఎమోషన్‌ని చక్కగా క్యారీ చేశారు. రష్మిక తెలుగు, కన్నడ, హిందీలో స్వయంగా డబ్బింగ్ చెప్పింది.

మీరు చేయబోయే నెక్స్ట్ సినిమా ప్రభాస్ (Prabhas) గారిదేనా?

అవునండీ, జూన్ నుండి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అవుతుంది, ఈ గ్యాప్‌లో ట్రీట్ మెంట్ డైలాగ్స్‌పై వర్క్ చేయాలి.

ప్రభాస్, అల్లు అర్జున్‌ (Allu Arjun)గారి తర్వాత ఇంకెవరికైనా కథలు చెప్పారా?

మహేష్ బాబు (Mahesh Babu)గారికి ఓ కథ చెప్పాను. అది ఆయనకి నచ్చింది. అయితే వేరే కమిట్‌మెంట్స్ వలన ముందుకు వెళ్ళలేదు. మహేష్ బాబు, రామ్ చరణ్ (Ram Charan).. ఇలా అందరితోనూ సినిమాలు చేయాలని వుంది.


ఇవి కూడా చదవండి:

====================

*Srikanth: ఈ మ‌ధ్య‌కాలంలో నాకు ఏ చిత్రానికి ఇన్ని ప్ర‌శంస‌లు రాలేదు

*******************************

*Surya: డాడీతో పోలిక లేదు.. ఆ పేరు కూడా వాడుకోనంటోన్న విజయ్‌ సేతుపతి కుమారుడు

*******************************

*Natural Star Nani: సినిమా అనేది నిజంగా నా ఊపిరి.. దానిపై ప్రామిస్ చేస్తున్నా..

******************************

Updated Date - 2023-11-25T19:37:54+05:30 IST