Vijayashanthi: ఎన్టీఆర్‌తో ఆ సంఘటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది

ABN , First Publish Date - 2023-05-27T19:08:58+05:30 IST

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు శతజయంతిని పురస్కరించుకుని లేడీ సూపర్ స్టార్ విజయశాంతి సోషల్ మీడియా వేదికగా ఆయనని గుర్తు చేసుకున్నారు. ఆమె కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలో ఎన్టీఆర్‌తో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను ఆమె షేర్ చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Vijayashanthi: ఎన్టీఆర్‌తో ఆ సంఘటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది
Legend NTR And Vijayashanthi

‘‘100 సంవత్సరాలైనా... మరో వంద సంవత్సరాలైనా... సినిమాకి ఎన్టీఆర్ (NTR) నేర్పిన క్రమశిక్షణా విధానాలు ఎప్పటికీ శిరోధార్యాలే... సినిమా కళాకారులకు వారు నిర్దేశించిన ప్రమాణాలు నిరంతరం ప్రాతఃస్మరణీయాలే’’ అని అన్నారు లేడీ సూపర్ స్టార్ (Lady Super Star) విజయశాంతి (Vijayashanthi). విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Ramarao) శతజయంతి (మే 28)ని పురస్కరించుకుని సోషల్ మీడియా వేదికగా రాములమ్మ (Ramulamma) ఆయనని తలచుకున్నారు. ఎన్టీఆర్‌తో తనకున్న జ్ఞాపకాలను పంచుకున్నారు. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ శతజయంతి (NTR 100th Birth Anniversary) సందర్భంగా ఆమె చేసిన పోస్ట్‌లో..

‘‘విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న తారక రామారావు గారు...

డాక్టర్ ఎన్టీఆర్ గారు...

నేను 14 సంవత్సరాల చిన్న పిల్లగా, నా సినిమా జీవిత ప్రయాణ ప్రారంభ సంవత్సరాలలో సత్యంశివం సినిమాలో చెల్లెలిగా ఎన్టీఆర్ గారు, ఏఎన్నార్ (ANR) గారితో కలిసి నటించే అవకాశం కలిగింది సుమారు 1980లో...

NTR-and-Vijayashanthi.jpg

ఆ తర్వాత 1985లో నా ప్రతిఘటన (Prathighatana) చిత్రానికి ఉత్తమనటిగా నంది అవార్డును ఎన్టీఆర్ గారే ముఖ్యమంత్రిగా నాకు అందించి, అభినందించి, ప్రజాప్రాయోజిత చిత్రాలలో మరింతగా కొనసాగాలని ఆశీర్వదించారు. నటునిగా, నాయకునిగా వారిది తిరుగులేని జీవన ప్రస్తానం. ఇక ఆయన మహోన్నతమైన వ్యక్తిత్వానికి చిన్న ఉదాహరణ...

బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రం డబ్బింగ్ ఎన్టీఆర్ గారు ఏవీఎం స్టూడియోలో చెబుతున్నప్పుడు 1990లో నేను చిరంజీవి (Chiranjeevi)గారితో అదే స్టూడియోలో సినిమా చేస్తూ వారిని డబ్బింగ్ థియేటర్‌లో కలవడానికి వెళ్లినప్పుడు, డబ్బింగ్ థియేటర్ యొక్క వెలుతురు లేని వాతావరణంలో వారు నన్ను సరిగా గమనించలేదని బాధపడ్డాను. అయితే ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ గారు తర్వాతి రోజు ఉదయం 6 గంటలకే మద్రాసులో మా ఇంటికి వచ్చి, (నేను ఆ ఉదయం ప్లయిట్‌కి హైదరాబాదులో షూటింగ్‌కి వెళ్లాను) అమ్మాయిని మేము చూసుకోలేదు.. పొరపాటు జరిగింది, ఐయామ్ సారీ, బిడ్డకు తెలియజేయండి అని శ్రీనివాస్ ప్రసాద్ (Srinivas Prasad) గారితో చెప్పిన సంఘటన ఎన్ని సంవత్సరాలైనా గుర్తుగానే, గౌరవంగానే మిగులుతాది.

అంతేగాక, ఆ రోజు నేను హైదరాబాదులో ఉన్న ఫోన్ నెంబర్ తెలుసుకుని, ఫోన్ చేసి మరీ ‘‘జరిగింది పొరపాటు మాత్రమే అమ్మా, I am extremely sorry ...’’ అని చెప్పినంతవరకూ.. సాటి కళాకారుల గౌరవాన్ని కాపాడే బాధ్యతను విస్మరించని ఆ మహోన్నత వ్యక్తిని ఎంతగా ప్రశంసించినా తక్కువే...

ఎన్టీఆర్ గారు మద్రాస్ వచ్చిన సందర్భాలలో మధ్యాహ్నం 11 గంటలకల్లా లంచ్ మా ఇంటి నుంచి శ్రీనివాస్ ప్రసాద్ గారు పంపడం, ఎన్టీఆర్ గారు ఎంతో ఆప్యాయంగా స్వీకరించటం జరిగేది. అదే గాకుండా, నేను వారిని కలవడానికి హైదరాబాదులో ఎంతో బిజీగా ఉన్న సమయంలో వెళ్లినా కూడా స్వయంగా టిఫిన్ వడ్డించి తినిపించేవారు. ఆయన ఆతిథ్యానికి మారుపేరు.

NTR-100.jpg

ఆదరాభిమానాలకు మరో రూపు...

ఎన్టీఆర్ గారు బహుశా ప్రపంచం తిరిగి ఎప్పటికీ చూడలేని అరుదైన ఒక కారణజన్ముడు, యుగపురుషుడు.

100 సంవత్సరాలైనా... మరో వంద సంవత్సరాలైనా... సినిమాకి ఎన్టీఆర్ నేర్పిన క్రమశిక్షణా విధానాలు ఎప్పటికీ శిరోధార్యాలే... సినిమా కళాకారులకు వారు నిర్దేశించిన ప్రమాణాలు నిరంతరం ప్రాతఃస్మరణీయాలే...’’ అని రాములమ్మ తెలిపారు.


ఇవి కూడా చదవండి:

************************************************

*Super Star Krishna: సినిమా వచ్చి 52 ఏళ్లు.. అయినా ఆ కటౌట్స్ చూస్తే..!

*Daana Veera Soora Karna: ఒక్క ఎన్టీఆర్‌కే ఇది సాధ్యం..!

*Adi Seshagiri Rao: ‘అసలు నరేష్ ఎవరు?’.. బాంబ్ పేల్చిన సూపర్ స్టార్ సోదరుడు

*Major: మహేష్ బాబు నిర్మించిన సినిమాకు ఘోర అవమానం

Updated Date - 2023-05-27T19:08:58+05:30 IST