Hi Nanna: 'దసరా' తరువాత, దీనిమీదే నానీ ఎక్కువ ఆశలు పెట్టుకున్నారా...

ABN , First Publish Date - 2023-11-25T15:44:50+05:30 IST

నాని ఇప్పుడు తన రాబోయే సినిమా 'హాయ్ నాన్న' మీదే ఎక్కువా ఆశలు పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. 'మిడిల్ క్లాస్ అబ్బాయి' తరువాత నాని సినిమా థియేట్రికల్ గా పెద్ద హిట్ అవ్వలేదు, అందుకని ఈ రాబోయే సినిమాతో ఆ కోరిక తీరుతుందని నాని నమ్ముతున్నట్టుగా పరిశ్రమలో టాక్ నడుస్తోంది

Hi Nanna: 'దసరా' తరువాత, దీనిమీదే నానీ ఎక్కువ ఆశలు పెట్టుకున్నారా...
A still from Hi Nanna

ఈమధ్య తెలుగు నటులు అందరూ తమ సినిమా ప్రచారాలను తెలుగులో కాకుండా, ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు వెళ్లి పాన్ ఇండియా లెవెల్లో విడుదలవుతున్నాయని ప్రచారాలు చేస్తున్నారు. ఆమధ్య నాని 'దసరా' సినిమా కోసం ముంబై, తమిళనాడు, కేరళ ఇలా ఇతర భాషల్లో తెలుగు కన్నా ఎక్కువ ప్రచారం చేసాడు, కానీ 'దసరా' సినిమా ఒక్క తెలంగాణాలో మాత్రం బాగా ఆడింది అని అందరికీ తెలిసిన విషయమే. ఇదే విషయం ఆమధ్య ఒక మీడియా ఈవెంట్ లో అడిగితే, అతను తన సినిమా పదిమంది ఎక్కువ చూసినా చాలు అందుకే అక్కడ ప్రచారాలు చేస్తున్నాను అని అన్నారు. అందుకనే నాని తన సినిమాలలో ఎక్కువగా తమిళం, మలయాళం, హిందీ నటుల్ని కూడా పెట్టుకుంటున్నాడు అని ఒక టాక్ నడుస్తోంది.

ఇప్పుడు 'హాయ్ నాన్న' సినిమా ప్రచారాలు కూడా విరివిగా చేస్తున్నారు నాని. ఈ సినిమా ప్రచారాలు మొదలెట్టడమే పక్క రాష్ట్రాల నుంచి మొదలెట్టారు. కొన్ని రోజుల క్రితం రవితేజ తన సినిమా 'టైగర్ నాగేశ్వర రావు' #TigerNageswaraRao పాన్ ఇండియా అంటూ ఏకంగా వారం రోజులపాటు ముంబై లో మకాం పెట్టి, చిన్నా, పెద్దా యూట్యూబ్ చానెల్స్, రేడియో చానెల్స్ ఒకటేమిటి ముంబై లో చాలా ప్రచారం చేశారు. కానీ తీరా విడుదలయ్యాక అక్కడ ఈ సినిమాని ఎవరూ పట్టించుకునే నాధుడే లేదు. 'స్పై' #Spy సినిమాకి నిఖిల్ సిద్ధార్థ (NikhilSiddhartha) కూడా తెలుగులో తప్పితే ఎక్కడెక్కడో ప్రచారం చేసాడు, కానీ ఆ సినిమాకి తెలుగుతో సహా ఎక్కడా ఓపెనింగ్స్ రాలేదు. సందీప్ కిషన్ (SundeepKishan) 'మైకేల్' సినిమా కూడా అంతే.

HiNanna.jpg

ఇప్పుడు నాని కూడా తన 'హాయ్ నాన్న' #HiNanna సినిమాకి ఎక్కువగా ఇతర భాషల మీదే దృష్టి పెట్టినట్టుగా కనపడుతోంది. మొదలెట్టడమే ముంబై నుండి, తరువాత తెలుగులో. 'దసరా' #Dasara సినిమా తరువాత ఈ 'హాయ్ నాన్న' మీద నాని ఎక్కువ ఆశలు పెట్టుకున్నట్టుగా కనపడుతోంది, అందుకే మిగతా భాషల్లో విరివిగా ప్రచారం చేస్తున్నాడు అనిపిస్తోంది అని ఒక టాక్ వినపడుతోంది. కథానాయకురాలితో పాటు, కొంతమంది నటులను కూడా ముంబై నుండి తెచ్చుకొని పెట్టుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ 'హాయ్ నాన్న' అయినా నాని ని తెలుగులోనే కాకుండా, మిగతా భాషల్లో తెలిసేటట్టు చేస్తుందా అని పరిశ్రమలో టాక్. అలాగే ఈ పాన్ ఇండియా పేరు మీద నాని పారితోషికం కూడా ఇప్పుడు విపరీతంగా పెంచినట్టుగా తెలిసింది.

ఒక్కసారి నాని సినిమాలు చూస్తే, అన్నీ థియేట్రికల్ విడుదలలో పెద్దగా విజయం రావటం లేదు అని అర్థం అవుతుంది. ఇంతకు ముందు 'జెర్సీ' అనే సినిమా మీద కూడా ఎక్కువ పెట్టుబడి పెట్టారు, కానీ ఆ సినిమా థియేట్రికల్ విడుదల వలన ఎటువంటి లాభం రాలేదు, ఓటిటి, సాటిలైట్ హక్కులు అమ్మేరు కాబట్టి నిర్మాత సేఫ్ అయ్యారు అని అన్నారు. 'దసరా' #Dasara కూడా ఒక్క తెలంగాణలోనే సేఫ్, మిగతా ఏరియాస్ లో అంతగా లేదు. దానికి ముందు 'అంటే సుందరానికి' #AnteSundaraniki ఫ్లాప్, ఓటిటి, సాటిలైట్ హక్కుల ద్వారా నిర్మాత మళ్ళీ కొంచెం సేఫ్. దానికి ముందు 'టక్ జగదీశ్', ఓటిటి లో విడుదలయింది కాబట్టి నిర్మాత సేఫ్ అయ్యాడు. దానికి ముందు 'వి' పెద్ద డిజాస్టర్ అయింది. 'మిడిల్ క్లాస్ అబ్బాయి' సినిమా తరువాత నాని కి థియేట్రికల్ గా అంత పెద్ద హిట్ రాలేదనే చెప్పాలి. ఓటిటి, సాటిలైట్ హక్కులు ద్వారా ప్రతి సినిమాకి నిర్మాత సేఫ్ అయిపోతున్నారు, లేకపోతే కష్టమే. ఆసక్తికరం ఏంటంటే, ఇన్ని సినిమాలు సరిగ్గా ఆడకపోయినా నాని పారితోషికం మాత్రం బాగా పెరుగుతూ పోతోంది.

ఇప్పుడు 'హాయ్ నాన్న' మీద చాలా ఆశలు నాని పెట్టుకున్నారు అని తెలిసింది. ఈ సినిమాతో ఒక పెద్ద విజయం సాధిస్తే, నాని మార్కెట్ పెంచుకోవచ్చు అని భావిస్తున్నట్టుగా టాక్. అందుకనే తెలుగులో కాకుండా మిగతా భాషల్లో ఎక్కువ ప్రచారాలు చేస్తున్నట్టుగా పరిశ్రమలో వినపడుతోంది. కానీ నానికి తెలుగు మార్కెట్ మాత్రమే ఎక్కువ, సినిమా లో విషయం ఉంటే మిగతా భాషల్లో ఆడుతుంది, ఎక్కువ ప్రచారం కూడా అక్కరలేదు. దానికి ఉదాహరణలే 'కాంతారా', 'పుష్ప', 'కార్తికేయ 2'. 'పుష్ప' #Pushpa సినిమా చిత్తూరు జిల్లాలో జరిగే సినిమా, దానికి తెలుగులోనే ప్రచారం ఎక్కువ చేశారు, మిగతా భాషల్లో చాలా తక్కువ అంటే అస్సలు చెయ్యలేదని చెప్పాలి. కానీ ఆ సినిమా తెలుగుతోపాటు మిగతా భాషల్లో కూడా దుమ్ము దులిపింది, ఎందుకంటే అది తెలుగు సినిమా, చిత్తూరు జిల్లాలో మారేడుమిల్లి దగ్గర జరిగిన కథ. మిగతా భాషల వాళ్ళకి కొత్తగా వుంది, చాలామంది కొత్త నటులు, అందుకని అది మిగతా భాషల్లో కూడా ఆడింది. అందులో ఫహద్ ఫాజిల్ తప్పితే అందరూ తెలుగు నటులే. అలాంటివే కన్నడ సినిమా 'కాంతారా', తెలుగు సినిమా 'కార్తికేయ 2'.

Updated Date - 2023-11-25T15:44:51+05:30 IST