Ravanasura film review: రవితేజ రివెంజ్ డ్రామా ఎలా ఉందంటే...

ABN , First Publish Date - 2023-04-07T14:04:47+05:30 IST

రెండు హిట్ సినిమాలు ఇచ్చిన తరువాత రవితేజ, దర్శకుడు సుధీర్ వర్మతో చేతులు కలిపి 'రావణాసుర' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకి రవి తేజ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం కావటం విశేషం. ఇంతకీ ఈ సినిమా ఎలావుందంటే...

Ravanasura film review: రవితేజ రివెంజ్ డ్రామా ఎలా ఉందంటే...

నటీనటులు: రవితేజ, సుశాంత్, జయరామ్ (Jayaram), శ్రీరామ్, మేఘా ఆకాష్ (Megha Akash), ఫరియా అబ్దుల్లా (Faria Abdullah), పూజిత పొన్నాడ, రావు రమేష్ (Rao Ramesh), మురళీ శర్మ (Murali Sharma) తదితరులు

సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కన్నన్!

సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo) (డిక్కా డిష్యూం)

కథ, మాటలు: శ్రీకాంత్ విస్సా

నిర్మాతలు: అభిషేక్ నామా, రవితేజ

స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుధీర్ వర్మ (Sudheer Varma)

-- సురేష్ కవిరాయని

రవితేజ (Ravi Teja) ముందు సినిమా 'ధమాకా' (Dhamaka) రవితేజ కెరీర్ లో బెస్ట్ కలెక్షన్ చేసిన సినిమాగా నిలించింది. అలాగే అతను అంతకు ముందు చిరంజీవి (MegaStar Chiranjeevi) తో నటించిన 'వాల్తేర్ వీరయ్య' (Waltair Veerayya) కూడా పెద్ద విజయం సాధించింది. రవితేజ ఇప్పుడు మూడు నాలుగు సినిమాలతో బిజీ గా వున్నాడు. ఈరోజు అతను నటించిన 'రావణాసుర' (Ravanasura) విడుదల అయింది. టైటిల్ కొంచెం నెగటివ్ గా ఉండటం తో ఇందులో రవితేజ (RavanasuraFilmReview) నెగటివ్ షేడ్ తో చేస్తున్నాడు అని అనుకున్నారు. అందుకని ఈ సినిమాపై కొంచెం ఆసక్తి రేగింది. ఇంతకీ అతను హేట్రిక్ విజయం సాధించాడా, ఈ 'రావణాసుర' (Ravanasura Review) సినిమా ఎలా వుందో చూద్దాం. ఈ సినిమాలో సుశాంత్ (Sushanth) ఒక ప్రత్యేకమైన పాత్రలో కనపడతాడు. అలాగే చాలామంది యువ నటీమణులు కూడా ఈ సినిమాలో కనిపిస్తారు.

ravanasura3.jpg

Ravanasura story కథ:

క్రిమినల్ లాయర్ కనక మహాలక్ష్మి (ఫరియా అబ్దుల్లా) దగ్గర రవీంద్ర (రవితేజ) జూనియర్ గా పని చేస్తుంటాడు. హారిక (మేఘ ఆకాష్) అనే అమ్మాయి కనక మహాలక్ష్మి దగ్గరికి వచ్చి తన తండ్రి కేసు టేకప్ చెయ్యమని అడిగితే, ఆమె చెయ్యను అని చెప్తుంది. అప్పుడు రవీంద్ర కలుగజేసుకొని హారిక తో నేను ఒప్పిస్తా అని చెప్పి కనకమహాలక్ష్మి ఈ కేసు టేకప్ చేసేటట్టు చేస్తాడు. ఇంతకీ ఆ కేసు ఏంటంటే తన తండ్రి (సంపత్ రాజ్) మర్డర్ చేసినట్టుగా వీడియోలు, సాక్ష్యాలు అన్నీ పక్కాగా వున్నాయి, కానీ తన తండ్రి నిర్దోషి ఆ హత్య చెయ్యలేదు అని చెప్తుంది హారిక. ఆమె ఓ పెద్ద ఫార్మా కంపెనీకి సీఈవో. అలాంటివే ఇంకొన్ని హత్యలు నగరంలో జరుగుతాయి, అందులో సిటీ కమిషనర్ (మురళి శర్మ) కూడా హత్యకు గురి అవుతాడు. హారిక కూడా హత్యకి గురి కబడుతుంది. రెండు నెలల్లో పదవీ విరమణ చేయబోతున్న హనుమంత రావు (జయరాం) ఈ హత్యలు ఎవరు చేస్తున్నారో దీని వెనక ఎవరున్నారో (RavanasuraReview) కనుక్కోమని ఈ కేసు అతనికి ఇస్తారు. ఇంతకీ ఈ హత్యలన్నీ ఎవరు చేశారు, ఎందుకు చేశారు, వీళ్ళనే హత్య చెయ్యడానికి ఎందుకు పూనుకున్నాడు, ఇవన్నీ తెలియాలంటే 'రావణాసుర' సినిమా చూడాల్సిందే.

ravanasura1.jpg

విశ్లేషణ :

దర్శకుడు సుధీర్ వర్మ కి అప్పుడెప్పుడో తీసిన 'స్వామి రారా' (Swami Ra Ra) మాత్రమే హిట్ అయింది. ఆ తరువాత అతని సినిమాలు అంత పెద్దగా హిట్ అవలేదు, కానీ తీస్తూనే వున్నాడు. అతని సినిమాలు ఫెయిల్ అయినా కూడా కొంచెం స్టైలిష్ గా, క్లాస్ గా తీస్తాడు. ఇప్పుడు రవితేజ తో 'రావణాసుర' (RavanasuraReview) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకి శ్రీకాంత్ విస్సా కథ, మాటలు అందించాడు అని అన్నారు, కానీ ఈ సినిమాకి బెంగాలీ సినిమా 'విన్సీ దా' (Vinci Da) అనే సినిమాకి కొంచెం పోలికలు వున్నాయి. బెంగాలీ సినిమాని అందులో ఉన్నట్టు కాఫీ కొట్టకుండా, తెలుగుకి చాలా మార్పులు చేశారు. కానీ కథ మాతృక మాత్రం బెంగాలీ సినిమా నుండి తీసుకున్నారు అని అనిపిస్తోంది. ఎందుకంటే బెంగాలీ సినిమాలో కూడా కీ పాయింట్ ప్రోస్తేటిక్స్ తయారుచేసేవారు. ఈ 'రావణాసుర' లో కూడా అదే ఒక ముఖ్యమైన పాయింట్. అయితే తెలుగు లో లీడ్ యాక్టర్ (అదేనండీ హీరో అంటారు కదా) ని నెగటివ్ చూపించకూడదు కాబట్టి, అతనికి సరిపోయేటట్టుగా కథని మార్చుకున్నారు, అంతే.

Ravanasura.jpg

అయితే ఇలా కథను ఒక్క లీడ్ యాక్టర్ కోసం మార్చడంతో అక్కడక్కడా గాడి తప్పింది. కథ మొదటి సన్నివేశము ఒక మర్డర్ తో మొదలవుతుంది. తరువాత రవితేజ, హైపర్ ఆది, ఫారియా అబ్దుల్లా కోర్ట్ సన్నివేశాలు కొంచెం కామెడీగా వున్నా, ఆ తరువాత ఈ హత్యలు మొదలవుతాయి. పోలీస్ కమిషనర్ ఆఫీస్ కి వెళ్లి పిస్టల్ తీసుకెళ్లి అంత పెద్ద పోలీస్ అధికారిని కాల్చడం అంత సులువయినా పనా. అలాగే సుధీర్ వర్మ ఈ కథలో చాలా ఫ్లాష్ బ్యాక్ లు వాడేసాడు. లాజిక్ ఎక్కడ కనిపించదు, అలాగే బిలీవబుల్ గా ఉండాలి కొంచెం అయినా. అది ఎక్కడా కానరాదు.

ఏ సినిమా అయినా, థ్రిల్లర్, సస్పెన్స్, హారర్, కామెడీ ఏదైనా కూడా ప్రేక్షకుడికి కనెక్ట్ కావాలి. కొన్నిసార్లు లాజిక్ లేకపోయినా, అది నమ్మేట్టు తీయగలగాలి, ప్రేక్షకుడికి ఆసక్తిని పెంచాలి. ఈ రెండింటిలోనూ సుధీర్ వర్మ ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ఒకసారి ఈ హత్యలు ఎవరు చంపారో తెలిసాక ప్రేక్షకుడికి సినిమా మీద ఆసక్తి పోయేలా చేసాడు దర్శకుడు. ఎందుకంటే ఈ కేసును పరిశోధిస్తున్న అధికారికి తెలుసు హత్యలు ఎవరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు కానీ అతను ఏమీ చెయ్యలేని పరిస్థితి, అదెలా? అదీ కాకుండా ముందు సన్నివేశం ఏమి జరుగుతుందో ప్రేక్షకుల ఇట్టే చెప్పేయగలరు. చివరికి ఇది ఒక రివెంజ్ డ్రామా అని తెలుస్తుంది. అదీ కాకుండా ఇలాంటివి ఎన్ని సినిమాలు రాలేదు ఇంతకుముందు అనిపిస్తుంది. ఇందులో అంత గొప్ప కథా లేదు, సినిమా కూడా ఆసక్తికరంగా లేదు. ఈసారి కూడా సుధీర్ వర్మ ఫెయిల్ అయినట్టే అనిపిస్తోంది. అయితే అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు మాత్రం బాగా తీసాడని చెప్పాలి. స్టైలిష్ గా క్లాసిక్ గా వున్నాయి కొన్ని సన్నివేశాలు. ఈ సినిమాలో పాటలు పరవాలేదు అనిపించాయి. హర్షవర్ధన్ రామేశ్వర్ నేపథ్య సంగీతం (Background music) మాత్రం ఈ సినిమాకి హైలైట్ అనే చెప్పాలి. అలాగే సినిమాటోగ్రఫీ కూడా బావుంది.

నటీనటులు ఎలా చేశారు:

ఇక నటీనటుల విషయానికి వస్తే, సినిమా అంతా రవితేజ కనపడతాడు. మొదట్లో కామెడీ సన్నివేశాల్లో తనదైన పంచ్ డైలాగ్స్ బాగున్నాయి, కానీ అతని నటన మాత్రం మామూలే. ఇలాంటివి అతను ఎన్నో చేసాడు. అలాగే పాటల్లో కూడా బాగా డాన్స్ చేసి చూపించాడు. 'హైపర్' ఆది 'జబర్దస్త్' లో చేసినట్టుగా ఇక్కడ కూడా అతన్ని ఉపయోగించుకున్నారు అంతే. ఫరియా అబ్దుల్లా మిగతా చేసే అమ్మాయిల కన్నా రెండు మూడు సన్నివేశాల్లో ఎక్కువ కనపడుతుంది. అంతే. ఎవరికీ ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వలేదు. మేఘా ఆకాష్ పరవాలేదు. అను ఇమ్మానుయేల్ రెండు సీన్స్ లో కనపడుతుంది. దక్ష కూడా అంతే. సుశాంత్ ని పరిచయం చేసినప్పుడు బాగా చేశారు, కానీ ఆ తరువాత మామూలే. పూజితా పొన్నాడ కూడా పోలీస్ పాత్రలో కనపడుతుంది. అన్నట్టు శ్రీరామ్ కూడా వున్నాడు ఇందులో. చాలామంది ఒకటి రెండు సన్నివేశాలే. రావు రమేష్ పాత్ర నిడివి పెద్దగా ఉంటే బాగుండేది, కానీ అలాంటి బాగా చెయ్యగలిగే నటుడిని కూడా రెండు సన్నివేశాలకు కుదించారు, ఎలా ఉపయోగించుకోవాలో తెలియలేదు దర్శకుడికి.

Ravanasura.jpg

ఇక చివరగా, 'రావణాసుర' సినిమా మొదట్లో కొంచెం ఆసక్తికరంగా వున్నా, కొంతసేపటి తరువాత ఇది ఒక రివెంజ్ డ్రామాలా వుంది అనుకుంటారు. సినిమా అంతా రవితేజ కనపడతాడు, మిగతా నటీనటులు అందరూ ఒకటి రెండు సన్నివేశాల్లో కనపడి వెళ్ళిపోతూ వుంటారు. యాక్షన్ థ్రిల్లర్ అనుకుంటాం, కానీ తీరా వెళ్ళాక ఇది మామూలు సినిమా అని తేలిపోతుంది. బెంగాలీ సినిమా నుండి మెయిన్ పాయింట్ తీసుకున్నారు, కానీ తెలుగు హీరో కి తగ్గట్టుగా మార్చేశారు.

Updated Date - 2023-04-07T14:04:48+05:30 IST