సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

పంది ముఖం పోస్టర్‌తో పొలిటికల్ హీట్.. తెరపైకి ‘సైలెంట్ పొలిటికల్ పార్టీ’!

ABN, Publish Date - Nov 23 , 2026 | 06:13 PM

తెలుగు రాష్ట్రాల్లో పంది ముఖంతో ఉన్న ‘సైలెంట్ పొలిటికల్ పార్టీ’ పోస్టర్లు వైరల్‌గా మారాయి.

Silent Political Party

రాజకీయాల్లో కొత్త వ్యూహాలు, వినూత్న ప్రచార పద్ధతులు ఎప్పటికప్పుడు తెరపైకి వస్తుంటాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఓ ఆసక్తికరమైన పోస్టర్ చర్చనీయాంశంగా మారింది. ‘పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా?’ అనే ప్రశ్నతో రూపొందించిన ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో పంది ముఖంతో కనిపిస్తున్న వ్యక్తి, దాని కింద ‘సైలెంట్ పొలిటికల్ పార్టీ’ అనే పదాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఈ పోస్టర్ చూసిన వారిలో రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఏదైనా కొత్త సినిమా లేదా వెబ్‌సిరీస్‌కు సంబంధించిన ప్రచారమా? లేక రాజకీయ రంగంలోకి అడుగుపెట్టబోతున్న కొత్త పార్టీకి సంబంధించిన క్యాంపెయినా? అనే చర్చ నడుస్తోంది. ఇప్పటికే ‘కాక్రోచ్ పార్టీ’ పేరుతో వినూత్న ప్రచారం చూసిన నెటిజన్లు.. ఇప్పుడు ఈ కొత్త పేరుపై ఆసక్తి చూపిస్తున్నారు.

ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పోస్టర్లు కనిపించడం వెనుక ఏదైనా పెద్ద వ్యూహం ఉందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఓ మాజీ మంత్రి కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేయబోతున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. యువతను ఆకర్షించేలా వినూత్న ప్రచారంతో తన రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టే ఆలోచనలో ఉన్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రచారానికి, ఆ మాజీ మంత్రికి మధ్య సంబంధం ఉందనే విషయంపై ఇప్పటివరకు అధికారిక స్పష్టత లేదు.

ఇంతకీ పంది ముఖం వెనుక ఉన్న అసలు కథేంటి? ‘సైలెంట్ పొలిటికల్ పార్టీ’ పేరుతో ఎవరైనా కొత్త రాజకీయ శక్తిని తీసుకొస్తున్నారా? ఈ ప్రచారం ద్వారా ఎవరిని లక్ష్యంగా చేసుకున్నారు? ‘కాక్రోచ్ పార్టీ’ తరహాలోనే యువతను ఆకట్టుకునే ప్రయత్నమా? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది.

ప్రస్తుతానికి పోస్టర్లు, సోషల్ మీడియా ప్రచారమే ఈ వ్యవహారంపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ ప్రచారం వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? వారి అసలు లక్ష్యం ఏమిటి? అన్నది రాబోయే రోజుల్లో వెల్లడయ్యే అవకాశముంది. అప్పటివరకు ఈ ‘సైలెంట్ పొలిటికల్ పార్టీ’ వ్యవహారం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చగానే కొనసాగనుంది.

Updated Date - Nov 24 , 2026 | 06:00 AM