Yandamuri Veerendranath: చప్పట్లు కొట్టని వారి కుటుంబాలు.. నాశనం అయిపోవాలి! యండమూరి.. సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - Jan 10 , 2026 | 06:07 AM
'చప్పట్లు కొట్టని వారి కుటుంబాలు నాశనం అయిపోవాలని సరస్వతీ దేవిని కోరతాను' అంటూ ప్రముఖ నవలా రచయిత యండమూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
'చప్పట్లు కొట్టని వారి కుటుంబాలు నాశనం అయిపోవాలని సరస్వతీ దేవిని కోరతాను' అంటూ ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్ర నాథ్ (Yandamuri Veerendranath) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆవకాయ్ - అమరావతి కార్యక్రమాల్లో భాగంగా నగరంలోని భవాని ద్వీపంలో శుక్రవారం జరిగిన ప్యూర్ ఈవిల్ (సినిమాల్లో ప్రతి నాయకుల పాత్రలు) చర్చలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి.
ప్రముఖ జర్నలిస్ట్ బాలాజీ మిట్టల్ సమక్షంలో జరిగిన చర్చకు బాలీవుడ్ రచయిత సుధీర్ మిశ్రాతో కలిసి యండమూరి హాజరయ్యారు. సినిమాల్లో విలన్ పాత్రల సృష్టిపై జరుగుతున్న చర్చను అక్కడున్న వారం దరూ శ్రద్ధగా వింటూ మధ్యమధ్యలో చప్పట్లు కొట్టారు. అయితే కొందరు వ్యక్తులు చప్పట్లు కొట్టకుండా ఉండటాన్ని యండమూరి గమనించారు. వారిని ఉద్దేశించి.. నేను సరస్వతీ దేవి గుడి కట్టిస్తున్నాను.. చప్పట్లు కొట్టని వారి కుటుంబాలు నాశన మైపోవాలని సరస్వతీ దేవికి మొక్కుతాను' అని ఆయన వ్యాఖ్యానించారు.
చర్చ ముగిసిన తరవాత ఓ గృహిణి యండమూరి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వేదిక వద్దకు వెళ్లి 'మీరు వస్తున్నారని, మిమ్మల్ని చూడాలని, మీ మాటలు వినాలని ఎంతో ఆశతో వచ్చాం, మా కుటుంబాలు నాశనం అయిపోవాలని మీరు దేవుడిని కోరటం ఏమిటి' అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకో వాలని, ప్రేక్షకులకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. దీంతో యండ మూరి ఓకే.. ఓకే.. అంటూ వేదిక దిగి వెళ్లిపోయారు.