‘321’ నుంచి మెలోడియస్ సాంగ్.. ఆకట్టుకుంటున్న ‘నను తాకిన’
ABN, Publish Date - Sep 27 , 2026 | 06:41 PM
లవ్ మ్యారేజ్, అరెంజ్డ్ మ్యారేజ్ మధ్య ఉన్న ఆలోచనా విధానాలు, కుటుంబ సంబంధాలు, ప్రేమ, భావోద్వేగాలను ప్రధానంగా తెరకెక్కుతున్న చిత్రం ‘321’.
లవ్ మ్యారేజ్, అరెంజ్డ్ మ్యారేజ్ మధ్య ఉన్న ఆలోచనా విధానాలు, కుటుంబ సంబంధాలు, ప్రేమ, భావోద్వేగాలను ప్రధానంగా తెరకెక్కుతున్న చిత్రం ‘321’. లవ్ మ్యారేజ్ వర్సెస్ అరెంజ్డ్ అనేది ఉపశీర్షిక. శాంతి కుమార్ చిలుముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మోహిత్, లావణ్య జంటగా నటిస్తున్నారు. బ్రహ్మ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై శాంతి కుమార్ చిలుముల, రామానుజ రెడ్డి వంగపాటి నిర్మిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తాజాగా సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు. ‘నను తాకిన’ అంటూ సాగే ఈ పాట చక్కటి మెలోడీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ప్రేమలోని సున్నితమైన భావాలను ఆవిష్కరించేలా ఈ పాటను రూపొందించారు. కాల్విన్ జాయ్ స్వరపరిచిన ఈ గీతానికి సాయి చరణ్, హరిణి గాత్రాన్ని అందించారు.