Slum Dog: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి.. అడుక్కోవడానికి కాదు
ABN , Publish Date - Sep 28 , 2026 | 03:10 PM
డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కంబ్యాక్ కోసం ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఎదురుచూస్తున్నారు. లైగర్, డబుల్ ఇస్మార్ట్ లాంటి భారీ పరాజయాల తరువాత పూరి దర్శకత్వం వహిస్తోన్న చిత్రం స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్
డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannath) కంబ్యాక్ కోసం ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఎదురుచూస్తున్నారు. లైగర్, డబుల్ ఇస్మార్ట్ లాంటి భారీ పరాజయాల తరువాత పూరి దర్శకత్వం వహిస్తోన్న చిత్రం స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్ (SlumDog - 33 Temple Road). వర్సటైల్ నటుడు విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోండగా టబు కీలక పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమాని పూరి కనెక్ట్స్,జేబీ మోషన్ పిక్చర్స్ పతాకంపై ఛార్మి కౌర్, పూరి జగన్నాథ్, జేబీ నారాయణరావు కొండ్రోల్లా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి సీనియర్ నటి జరీనా వహాబ్ పోషిస్తున్న జుబేదా పాత్రకు సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
జుబేదా పాత్రకు సంబంధించిన ఈ గ్లింప్స్ ఆద్యంతం అత్యంత భావోద్వేగంగా, హృదయవిదారకంగా సాగింది. ఆకలి, పేదరికం, జీవన పోరాటాన్ని పూరి జగన్నాథ్ తన మార్కు డైలాగ్స్‌తో ఎంతో పవర్‌ఫుల్‌గా ఆవిష్కరించినట్లు కనిపిస్తోంది. 'నాంపల్లి స్టేషన్‌కి వెళ్లి రైలు కింద తలపెట్టి చనిపోదామనుకున్నాను.. కానీ ధైర్యం సరిపోలేదు. ఈ ఆకలి ముందు సిగ్గు, లజ్జా, మానం, మర్యాద అన్నీ కొట్టుకుపోతాయి రా..'అంటూ జరీనా వహాబ్ చెప్పిన సంభాషణలు ప్రేక్షకుల మనసులను హత్తుకునేలా ఉన్నాయి.
అలాగే విజయ్ సేతుపతి తన తల్లి జుబేదా గురించి టబు పాత్రతో చెప్పే సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. 'అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి.. అడుక్కోవడానికి కాదు' అంటూ చివర్లో పూరి చెప్పే డైలాగ్ ఈ చిత్రంలోని ఎమోషన్ స్థాయిని తెలియజేస్తోంది. రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు సినిమాల తరువాత జరీనా వహాబ్ మరో ప్రత్యేక పాత్ర చేస్తున్నట్లు ఈ గ్లింప్స్ చూస్తుంటే తెలుస్తోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన నేపథ్య సంగీతం ఈ రస్టిక్ డ్రామాకు ప్రాణం పోసింది. పూరి జగన్నాథ్ మార్కు పవర్ ఫుల్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం త్వరలోనే పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో విడుదల కానుంది. మరి ఈ సినిమాతో పూరి ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.