ఏండ్లు గడుస్తున్నాయ్.. విడుదల ఎప్పుడు విశ్వంభరా?
ABN, Publish Date - Sep 08 , 2026 | 07:32 PM
తెలుగు చిత్ర పరిశ్రమ, మెగాభిమానులు ఎంతో కాలంగా ఆశగా ఎదురు చూస్తున్న సినిమా విశ్వంభర షూటింగ్ ఎప్పుడో పూర్తయినా విడుదల ఎప్పుడు అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది.
తెలుగు చిత్ర పరిశ్రమ, మెగాభిమానులు ఎంతో కాలంగా ఆశగా ఎదురు చూస్తున్న సినిమా విశ్వంభర (Vishwambhara). మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ షూటింగ్ ఎప్పుడో పూర్తయినా విడుదల ఎప్పుడు అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. ఎప్పుడో రావాల్సిన సినిమా.. 'మన శంకరవరప్రసాద్' కంటే ముందు ఈ సినిమానే విడుదల కావాలి. కానీ కాలేదు. పోనీ ఈ ఏడాది సంక్రాంతి మిస్ అయింది కదా.. వచ్చే సంక్రాంతికి విడుదల ఉంటుందా అనుకుంటే దర్శకుడు బాబీ కాకా' సినిమాతో ఇప్పటికే కర్చీఫ్ వేసేశారు. మరి 'విశ్వంభర పరిస్థితి ఏమిటి? ఈ ఏడాది సమ్మర్‌కు ఈ సినిమా వస్తుందని అంతా ఆశించారు. అయితే రామ్ చరణ్ సినిమా 'పెద్ది' కోసం 'విశ్వంభర' వెనక్కి వెళ్లిందని అన్నారు. ఇలా వరుస వాయిదాలు వేస్తుండడంతో మెగాభిమానులు నిరాశకు గురవుతున్నారు.
చిరంజీవి భరోసా ఇచ్చారు కానీ..
'విశ్వంభర సినిమాలో సెకండాఫ్ మొత్తం గ్రాఫిక్స్ వర్క్ మీదే ఆధారపడి ఉందట. అందుకేనేమో దాదాపు రెండేళ్ల సమయం గ్రాఫిక్స్ కోసమే తీసుకున్నారు. అద్భుతమైన విజు వల్స్ ప్రేక్షకులకు అందించాలంటే కొంత ఆలస్యం అవడం సహజం, సమంజసం కూడా. అయితే గ్రాఫిక్స్‌కు మరీ ఇంత లేట్ అవుతుందా అనేది సామాన్య ప్రేక్షకుడికి కలుగుతున్న సందేహం, చందమామ కథలా సాగిపోతూ పిల్లల్ని, పెద్దవాళ్లనీ 'విశ్వంభర' అలరిస్తుందని ఏడాది క్రితం చిరంజీవి తన పుట్టిన రోజు సందర్భంగా గ్లింప్స్ విడు దల చేస్తూ చెప్పారు. 2026 సమ్మర్‌కు ఈ సినిమా తప్పకుండా విడుదల అవుతుందని ఆయన ఆ సందర్భంగా భరోసా ఇచ్చారు కూడా. ఆ సమ్మర్ వచ్చింది. వెళ్లిపోయింది. కానీ 'విశ్వంభర' మాత్రం విడుదల కాలేదు. తమ హీరో మాటని కూడా అబద్ధం చేసినందుకు మేకర్స్ మీద మెగాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా 'విశ్వంభర రిలీజ్ అప్ డేట్ ఉంటుందని అంతా భావించారు కానీ అదేమీ లేకపోవడంతో నిరాశకు గురయ్యారు.
ఈ సినిమా.. వదిలేసి మరో సినిమా!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'కాకా' చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆయన దృష్టంతా ఇప్పుడు ఆ సినిమా మీదే ఉంది. రిలీజ్ డేట్ ఇప్పటికే ప్రకటించడంతో దర్శకుడు బాబీ పక్కా ప్లానింగ్ తో వర్క్ చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో 'విశ్వంభర దర్శకుడు వశిష్ట ఈ సినిమాను వదిలి పెట్టేసి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తొలి చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు చేపట్టడంతో మరి 'విశ్వంభర' పరిస్థితి ఏమిటనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. సంగీత దర్శ కుడు కీరవాణి కూడా 'విశ్వంభర' చిత్రాన్ని వదిలిపెట్టి 'వారణాసి' సినిమాకు వెళ్లిపోవడంతో మరో సంగీత దర్శకుడు హరి గౌర సారథ్యంలో రీరికార్డింగ్ చేసినట్లు తెలిసింది. ఒక భారీ సినిమా విడుదలకు ముందే ఆ చిత్ర హీరో, దర్శకుడు, సంగీత దర్శకుడు ఇలా వేర్వేరు ప్రాజెక్టులతో బిజీ కావడం నిజంగా ఆరుదైన విషయమే.
ఓటీటీ డీల్.. ప్రధాన కారణమా?
"విశ్వంభర' చిత్రానికి సంబంధించిన వీఎఫ్ఎక్స్ వర్క్ దాదాపుగా పూర్తి కావచ్చిందని, అద్భుతమైన విజువల్స్ వచ్చాయని సమాచారం. అయితే ఇప్పుడు సినిమా విడుదలకు ప్రధాన అడ్డంకి ఓటీటీ డీల్ పూర్తి కాకపోవడమే అని చెబుతున్నారు. అందుకే విడుదల తేదీలో స్పష్టత రావడం లేదనీ, వీళ్లు ఆశిస్తున్న రేటుకి, ఓటీటీ వర్గాలు చెబుతున్న రేటుకీ మధ్య చాలా తేడా ఉండడం వల్లే డీల్ పూర్తి కాలేదని సమాచారం. నిర్మాతలు కోరుకున్నట్లుగా ఓటీటీ డీల్ పూర్తయి త్వరలోనే 'విశ్వంభర ప్రేక్షకుల ముందుకు రావాలని ఆశిద్దాం.