రూట్ మార్చిన విజయ్ దేవరకొండ మేనమామ
ABN, Publish Date - Mar 11 , 2026 | 11:19 AM
విజయ్ దేవరకొండ మేనమామ, నిర్మాత యశ్ రంగినేని ఇప్పుడు నటనపై దృష్టి పెట్టారు. ఇటీవల విడుదలైన 'ఛాంపియన్'లో మాల వీరయ్యగా నటించిన ఆయన మరికొన్ని సినిమాలలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రముఖ కథానాయకుడు విజయ్ దేవరకొండ మేనమామ యశ్ రంగినేని. మార్చి 11 ఆయన పుట్టిన రోజు. యశ్ రంగినేని బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్‌లో మిత్రులతో కలిసి 'పెళ్ళిచూపులు, డియర్ కామ్రేడ్, దొరసాని, అన్నపూర్ణ ఫోటో స్టూడియో' వంటి సినిమాలను నిర్మించారు. సక్సెస్ ఫుల్ నిర్మాతగా చక్కని పేరు తెచ్చుకున్నారు. అయితే యశ్‌లో మంచి నటుడు కూడా ఉన్నాడని గత యేడాది డిసెంబర్‌లో విడుదలైన 'ఛాంపియన్' సినిమాతో రుజువైంది. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన ఈ సినిమాలో యశ్ 'మాల వీరయ్య' పాత్రను పోషించారు. ఆయన నటనకు మంచి గుర్తింపు లభించింది.
నిర్మాత యశ్ నటన గురించి పలువురు దర్శకులు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 'యశ్ గారికి మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. ఆయన వ్యక్తిత్వం, బాడీ లాంగ్వేజ్ వల్ల తెరపై కనిపించే సన్నివేశాలకు ఒక ప్రత్యేకమైన ప్రభావం వస్తుంది' అని అన్నారు. అలానే మరో దర్శకుడు 'నిర్మాతగా ఇప్పటికే మంచి అభిరుచి ఉన్న వ్యక్తిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటుడిగా కూడా పాత్రను అర్థం చేసుకుని పనిచేయడానికి ప్రయత్నిస్తున్నారు' అని కితాబిచ్చారు. ఇంకో దర్శకుడైతే, 'ఆయన ఫిట్‌నెస్, డెడికేషన్ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. కెమెరా ముందు చాలా నేచురల్‌గా కనిపిస్తారు. ముఖ్యంగా ఇంటెన్స్ క్యారెక్టర్స్‌కు ఆయన బాగా సూట్ అవుతారు' అని అభిప్రాయపడ్డారు. విశేషమేమంటే... ఇప్పటికే కొన్ని చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రల కోసం యశ్ రంగినేనిని సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. అలానే ప్రస్తుతం ఆయన నటిస్తున్న కొన్ని చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయని సమాచారం.