సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tollywood: మరోసారి వెండితెరపై 'ముత్యమంత ముద్దు'

ABN, Publish Date - Feb 02 , 2026 | 03:30 PM

యండమూరి రాసిన 'థ్రిల్లర్' నవల అప్పట్లో 'ముత్యమంత ముద్దు' పేరుతో సినిమాగా వచ్చింది. దానిని రవిరాజా పినిశెట్టి డైరెక్ట్ చేశారు. ఇప్పుడు ఆ నవలను సాయి రాజేశ్‌ కూడా సినిమాగా తీయబోతున్నారని యండమూరి చెబుతున్నారు.

Mutyamantha Muddu Movie

ప్రఖ్యాత రచయితలు, రచయిత్రులు రాసిన నవలలు సినిమాలుగా రూపుదిద్దుకోవడమన్నది కొన్నేళ్ళ క్రితమే అటకెక్కేసింది. ఇప్పుడు యేడాదికి ఒకటో రెండో నవలా చిత్రాలు వస్తున్నాయి. తెలుగులో గతంలో యండమూరి వీరేంద్రనాథ్‌ (Yandamuri Veerendranath), మల్లాది వెంకట కృష్ణమూర్తి (Malladi Venkata Krishnamurthy) రాసిన నవలలు చాలా సినిమాలుగా వచ్చాయి. యండమూరి రాసిన నవలా చిత్రాలైతే సూపర్ హిట్ అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. యండమూరి రాసిన 'థ్రిల్లర్' నవల 1989లో 'ముత్యమంత ముద్దు' (Mutyamantha Muddu) పేరుతో సినిమాగా వచ్చింది. ప్రముఖ నిర్మాత కె. ఎస్. రామారావు (K.S. Ramarao) సోదరుడు బెనర్జీ నిర్మించిన ఈ సినిమాకు రవిరాజా పినిశెట్టి (Raviraja Pinisetty) దర్శకుడు. రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad), సీత (Sitha) జంటగా నటించిన 'ముత్యమంత ముద్దు' అప్పట్లో విమర్శకుల ప్రశంసలు అందుకుంది కానీ కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. ఈ చిత్రానికి హంసలేఖ (Hamsalekha) సంగీతం అందించారు. ఆయన స్వరపర్చిన 'ప్రేమలేఖ రాశా నీకంది ఉంటది' సాంగ్ ఇప్పటికీ సంగీతాభిమానుల నోళ్ళలో నానుతూనే ఉంది. యండమూరి తన రెగ్యులర్ ఫార్మాట్ కు భిన్నంగా ఈ నవల రాశారు. దానిని రవిరాజా పినిశెట్టి ఆసక్తికరంగా తెరకెక్కించారు. నటీనటులంతా చాలా బాగా నటించారు. కానీ అప్పటి ప్రేక్షకులు ఈ కథ ఎక్కలేదు. ఇదే నవల ఇప్పుడు సినిమాగా వస్తే బాగుంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. వారి కోరిక త్వరలోనే తీరబోతోందని తెలుస్తోంది.


ఇటీవల 'ముత్యమంత ముద్దు' సినిమా కథ, కథనం, దానికి ప్రేక్షకుల నుండి లభించిన ఆదరణ వగైరా అంశాలపై సోషల్ మీడియాలో చర్చ జరిగింది. దానికి సమాధానంగా యండమూరి వీరేంద్రనాథ్‌ ఓ ఆసక్తికరమైన విషయాన్ని తెలియచేశారు. 'ముత్యమంత ముద్దు' సినిమాను ఇప్పుడు ప్రముఖ దర్శకుడు, 'బేబీ' ఫేమ్ సాయిరాజేష్ తెరకెక్కిస్తున్నారని తెలిపారు. 'బేబీ' సినిమా ఘన విజయం తర్వాత సాయి రాజేష్ (Sai Rajesh) నిర్మాతగా బిజీ అయ్యాడు. ఆయన నిర్మించిన 'చెన్నయ్ లవ్ స్టోరీ' విడుదలకు సిద్థంగా ఉంది. ఇందులో కిరణ్‌ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా నటించారు. అయితే ఈ సినిమాను మొదట్లో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) తో నిర్మించాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత హీరోహీరోయన్లు మారిపోయారు. కానీ యండమూరి చెప్పినట్టు 'ముత్యమంత ముద్దు'ను సాయిరాజేశ్‌ ఎప్పుడు తెరకెక్కిస్తారు? ఎవరితో తెరకెక్కిస్తారు? అనేది తెలియాల్సి ఉంది. ఈ తరం ఆడియెన్స్ పల్స్ తెలిసిన సాయి రాజేశ్‌... యండమూరి 'థ్రిల్లర్' నవలను సినిమాగా తీస్తే అది తప్పకుండా టాక్ ఆఫ్‌ ద ఇండస్ట్రీగా నిలిచే ఆస్కారం ఉంది.

Updated Date - Feb 02 , 2026 | 03:46 PM