Renu Desai: ఆడవాళ్లు రోబోలు కాదు.. వారి కలలకు భర్తలు అండగా నిలవాలి

ABN , Publish Date - Nov 29 , 2026 | 02:39 PM

ఆడవాళ్లేమీ రోబోలు కాదు.. ప్రతి మహిళకు మనసుంటుంది. ఏదో చేయాలి.. సాధించాలనే తపన ఉంటుంది. దానిని అర్థం చేసుకుని సపోర్ట్‌ చేయాలి.

‘‘ఆడవాళ్లేమీ రోబోలు కాదు.. ప్రతి మహిళకు మనసుంటుంది. ఏదో చేయాలి.. సాధించాలనే తపన ఉంటుంది. దానిని అర్థం చేసుకుని సపోర్ట్‌ చేయాలి. అది కని పెంచిన తల్లిదండ్రులైనా, తాళి కట్టిన భర్త అయినా! భార్యాభర్తలిద్దరూ కలిసికట్టుగా ఆలోచించుకుని జీవితాన్ని ముందుకు సాగిస్తే ఈ జీవితం బాగుంటుంది’’ అని రేణు దేశాయ్ అన్నారు.

నివేదా థామస్‌ కీలక పాత్రలో తెరకెక్కిన ‘శ్రీమతి’ సిరీస్‌లో ఆమె కీలక పాత్ర పోషించారు. తిరువీర్‌, హరితేజ, గోపరాజు రమణ ఇతర పాత్రధారులు. విశ్వక్‌ ఖండేరావు దర్శకత్వంలో నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించారు. డిసెంబర్‌ 4 నుంచి జీ5లో స్ట్రీమింగ్‌ కానుంది.


ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకలో రేణు దేశాయ్ మాట్లాడుతూ.. ‘‘ఆడబిడ్డ పుట్టినప్పటి నుంచి ఫలానా వాళ్ల అమ్మాయి, ఫలానా వ్యక్తికి భార్య అనే గుర్తింపే ఉంటుంది. అది తప్పేమీ కాదు. మనం 2026లో ఉన్నాం.. అయినా స్వతహాగా అమ్మాయికంటూ ఒక ఐడెంటిటీ అనేది ఇప్పటికీ రావడం లేదు. మనలో భార్యలకు అండగా నిలిచే మగవారి సంఖ్య కాస్త తక్కువే. ప్రతి భర్త భార్యకు అండగా నిలవాలని కోరుకుంటున్నా. అప్పుడే ఆడవారి అస్తిత్వానికి ఓ అర్థం ఉంటుంది. ఇద్దరూ ఒక మాట మీద ముందుకు సాగితే జీవితం కూడా సాఫీగా, ఆనందదాయకంగా ఉంటుంది. అలాంటి స్ఫూర్తి కలగాలంటే ‘శ్రీమతి’ లాంటి సినిమాలు అన్ని భాషల్లోనూ రావాలి. ఇది చాలా మంచి సినిమా. స్త్రీ అస్తిత్వాన్ని తెలియజేస్తుంది. నివేదాతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. నేను ఎక్కువ సినిమాలు చేయలేదు. కానీ, ఈ సినిమా నాకు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఈ సినిమా డిసెంబర్‌ 4న.. అంటే నా పుట్టినరోజున విడుదల కానుంది’’ అని అన్నారు.

ALSO READ:
Nithya Menen: యంత్రంలా ఆగకుండా పనిచేయలేను.. కృత్రిమంగా నటించలేను

Naga Chaitanya: ఆ సమయంలో అసలు నేనేం చేస్తున్నానో అర్థం కాలేదు..

‘బేబీ’ కథ వివాదం.. సాయి రాజేష్, SKNలకు హైకోర్టు నోటీసులు!

Updated Date - Nov 29 , 2026 | 02:51 PM