ప్రభాస్ దెబ్బకు వెనక్కి తగ్గుతున్న బాలయ్య
ABN, Publish Date - Jul 17 , 2026 | 01:57 PM
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. అందులో హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ(Fauzi) ఒకటి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. అందులో హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ(Fauzi) ఒకటి. యుద్ధం రాసిన ప్రేమకథగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేశాయి. ఈ క్రేజీ విజువల్ వండర్‌ను ఈ ఏడాది డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. అయితే, ఫౌజీ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఇప్పుడు నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ NBK 111 విడుదలను తీవ్ర సందిగ్ధంలోకి నెట్టింది.
వాస్తవానికి దసరా బరిలోనే రావాల్సిన NBK 111.. షూటింగ్ ఆలస్యం కారణంగా డిసెంబర్ 4న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ అంతర్గతంగా భావించింది. కానీ, అంతకంటే ఒక్క రోజు ముందే డిసెంబర్ 3 న ప్రభాస్ ఫౌజీ థియేటర్లలోకి అడుగుపెడుతుండటంతో బాలయ్య సినిమా విడుదలపై సస్పెన్స్ నెలకొంది. ప్రభాస్ లాంటి భారీ పాన్ ఇండియా కటౌట్ బరిలో ఉన్నప్పుడు, బాలయ్య సినిమాకు థియేటర్ల కొరత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి తోడు, బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల మధ్య కనీసం రెండు వారాల గ్యాప్ ఉండాలని టాలీవుడ్ నిర్మాతలు ఇటీవల చేసుకున్న అంతర్గత ఒప్పందం కూడా ఇప్పుడు బాలయ్య సినిమాకు పెద్ద అడ్డంకిగా మారింది.
ఈ ఒప్పందం ప్రకారం చూసుకుంటే ఫౌజీ కంటే కనీసం రెండు వారాల తర్వాతే NBK 111 రిలీజ్ కావాల్సి ఉంటుంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో మంచు మనోజ్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషిస్తుండగా, ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటివరకు మేకర్స్ అధికారికంగా ఎలాంటి రిలీజ్ డేట్ ప్రకటించకపోవడం NBK 111 టీమ్‌కు కలిసొచ్చే అంశం. ఈ నేపథ్యంలో ప్రభాస్ దూకుడుకు బ్రేక్ పడకుండా, బాలయ్య సినిమాను వెనక్కి జరిపి కొత్త రిలీజ్ డేట్‌ను ప్లాన్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్.