మరో మాట లేదు.. ఎక్కడా అగేదే లేదు! ది పారడైజ్.. అనుకున్న టైంకు వచ్చేనా
ABN, Publish Date - Apr 07 , 2026 | 06:21 AM
టాలీవుడ్‌లో ఇప్పుడు ఒకటే టెన్షన్.. అదే రిలీజ్ డేట్స్. ఒక పెద్ద సినిమా డేట్ మారిందంటే, దాని ప్రభావం మిగిలిన అన్ని సినిమాలపై పడుతుంది.
టాలీవుడ్‌లో ఇప్పుడు ఒకటే టెన్షన్.. అదే రిలీజ్ డేట్స్. ఒక పెద్ద సినిమా డేట్ మారిందంటే, దాని ప్రభావం మిగిలిన అన్ని సినిమాలపై పడుతుంది. ముఖ్యంగా భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాల విషయంలో ఈ జాప్యం నిర్మాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కొన్ని ప్రతిష్టాత్మక చిత్రాలు ఇప్పటికే రెండు మూడు సార్లు డేట్లు మార్చినా, ఇప్పటికీ ఫస్ట్ కాపీ సిద్ధం కాలేదు. ఈ పరిస్థితి ఇప్పుడు నేచురల్ స్టార్ నాని (Nani) నటిస్తున్న ది ప్యారడైజ్ (The Paradise) చిత్రానికి ఒక హెచ్చరికలా కనిపిస్తోంది.
నాని, శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబినేషన్‌లో వస్తున్న 'ది ప్యారడైజ్' మీద అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో చెప్పక్కర్లేదు. ఆగస్ట్ 21న సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని టీమ్ ఫిక్స్ అయ్యింది. ఆగస్ట్ అంటే ఇంకా చాలా టైం ఉన్నట్టు అనిపించవచ్చు కానీ, ప్రాక్టికల్ గా ఆలోచిస్తే చేతిలో ఉన్నది కేవలం నాలుగున్నర నెలలే. నాని ఈ ప్రాజెక్ట్‌ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. అందుకే ప్రమోషన్ల కోసమే కనీసం 25 రోజులు కేటాయించాలని గట్టి పట్టుదలతో ఉన్నాడట.
ఈ సినిమాకు అతిపెద్ద బలం, బలహీనత కూడా సంగీత దర్శకుడు అనిరుధ్ (Anirudh) అని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అనిరుధ్ చేతి నిండా నాలుగైదు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ముఖ్యంగా 'జైలర్ 2' వంటి సినిమాలతో ఆయన బిజీగా ఉన్నాడు. ఒకవేళ శ్రీకాంత్ ఓదెల షూటింగ్ పూర్తి చేయడంలో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా, అనిరుధ్ నుంచి ఆశించిన సమయం దొరకదు. ఆఖరి నిమిషంలో రీ-రికార్డింగ్ పెండింగ్ పడితే సినిమా పోస్ట్‌పోన్ అవ్వడం ఖాయం. అలాగే సెన్సార్ పనులు, ఇతర టెక్నికల్ వర్క్స్ అన్నీ జూలై ఆఖరికల్లా పూర్తి కావాల్సిందే.
ఇక నాని సినిమాల పబ్లిసిటీ స్ట్రాటజీ గురించి మనందరికీ తెలిసిందే. 'దసరా', 'హాయ్ నాన్న', 'హిట్ 3' కోసం ముంబై నుంచి చెన్నై వరకు ఆయన చేసిన టూర్లు చిన్న విషయం కాదు. పాన్ ఇండియా లెవల్లో తన మార్కెట్‌ను పెంచుకోవడానికి నాని శ్రమిస్తున్నాడు. అందుకే 'ది ప్యారడైజ్' విషయంలో మళ్ళీ డేట్ మారకూడదని నాని కంకణం కట్టుకున్నాడు. తన వంతుగా షూటింగ్‌ను పరుగులు పెట్టిస్తున్నాడు.
ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu) ఇందులో మెయిన్ విలన్‌గా నటిస్తున్నారు. కయదు లోహర్ (Kayadu Lohar) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ ఇంటెన్స్ డ్రామాలో నానికి, మోహన్ బాబుకు మధ్య వచ్చే సీన్స్ 'నెవర్ బిఫోర్' అన్నట్టు ఉంటాయట. ముఖ్యంగా ఈ సినిమా ఇంటర్వెల్ ఎపిసోడ్ గురించి ఇండస్ట్రీలో ఒకటే టాక్.. అది చూసిన వాళ్ళు "ఇదేం మెంటల్ మాస్ రా బాబు" అని షాక్ అవుతున్నారట. శ్రీకాంత్ ఓదెల 'దసరా' కంటే రెట్టింపు స్థాయిలో ఈ సీన్లను డిజైన్ చేశాడని సమాచారం. మరి నాని-శ్రీకాంత్ కాంబినేషన్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.