అస‌లు.. రిలీజ్‌ అయ్యేనా లేదా! పూరీ జగన్నాథ్.. ‘స్లమ్‌డాగ్’కు కొత్త చిక్కులు

ABN , Publish Date - Sep 30 , 2026 | 11:33 AM

ఒకప్పుడు పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో సినిమా వస్తోందంటే థియేటర్ల దగ్గర పండగ వాతావరణం కనిపించేది.

ఒకప్పుడు పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) డైరెక్షన్‌లో సినిమా వస్తోందంటే థియేటర్ల దగ్గర పండగ వాతావరణం కనిపించేది. డైలాగుల్లో పదును, హీరో క్యారెక్టరైజేషన్‌లో పిచ్చెక్కించే ఆటిట్యూడ్, రా అండ్ రస్టిక్ మేకింగ్... ఇదీ ఒకప్పటి పూరీ బ్రాండ్. టాలీవుడ్ స్టార్ హీరోలకు కెరీర్ బెస్ట్ మాస్ హిట్స్ ఇచ్చిన ఘనత ఆయన సొంతం. సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లా చకచకా స్క్రిప్ట్ రాయడం, అంతే వేగంగా షూటింగ్ పూర్తి చేసి బాక్సాఫీస్‌ను షేక్ చేయడం పూరీ స్టైల్. కానీ, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా..!

గత కొంతకాలంగా పూరీ జగన్నాథ్ ట్రాక్ రికార్డ్ చూస్తే అభిమానులకే బాధ కలుగుతోంది. వరుస పరాజయాలు ఆయన మార్కెట్‌ను భారీగా దెబ్బతీశాయి. పూరీ సినిమా అనగానే నిన్న మొన్నటి వరకు ఉన్న బజ్ ఇప్పుడు కనిపించట్లేదు. బాక్సాఫీస్ వద్ద ఎదురైన చేదు అనుభవాలు ఆయన క్రేజ్‌పై తీవ్ర ప్రభావం చూపించాయి. అయినప్పటికీ పూరీలో ఉన్న ఫైర్ ఏమాత్రం తగ్గలేదని, ఒక్క సాలిడ్ హిట్ పడితే చాలు ఆయనను అందుకోవడం ఎవరి తరం కాదని నమ్మే వీరాభిమానులు ఇప్పటికీ ఉన్నారు.

లైగర్, డబుల్ ఇస్మార్ట్ లాంటి భారీ డిజాస్టర్స్ తర్వాత పూరీ జగన్నాథ్ కాస్త గ్యాప్ తీసుకుని మొదలుపెట్టిన తాజా ప్రాజెక్ట్ స్లమ్‌డాగ్-33 టెంపుల్‌ రోడ్ (Slumdog). ఈసారి ఆయన తెలుగు హీరోలతో కాకుండా తన ఫోకస్‌ను కోలీవుడ్ హీరోల వైపు మళ్లించారు. విలక్షణ నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ని రంగంలోకి దించారు. పూరీ రా డైలాగ్స్, క్యారెక్టరైజేషన్‌కు విజయ్ సేతుపతి నేచురల్ యాక్టింగ్ తోడైతే స్క్రీన్ మీద పూనకాలే అని ప్రాజెక్ట్ మొదలైనప్పుడు టాక్ నడిచింది.

ఇందులో విజయ్ సేతుపతికి జోడీగా టాలెంటెడ్ బ్యూటీ సంయుక్త మీనన్ (Samyuktha) నటిస్తోంది. వీరితో పాటు కన్నడ స్టార్ దునియా విజయ్ (Duniya Vijay kumar), బాలీవుడ్ సీనియర్ నటి టబు (Tabu), జరీనా వాహబ్ లాంటి భారీ తారాగణమే ఈ సినిమాలో భాగమయ్యారు. షూటింగ్ మొదలైనప్పటి నుంచే వేగం పెంచిన టీమ్, ఇప్పటికే షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకుంది.

సినిమా అయితే రెడీ అయిపోయింది కానీ, థియేటర్లలోకి ఎప్పుడు వస్తుందనే దానిపై మాత్రం తీవ్ర సందిగ్ధత నెలకొంది. స్లమ్‌డాగ్ చుట్టూ అసలు సౌండే వినిపించట్లేదు. దీనికి ప్రధాన కారణం సరైన రిలీజ్ డేట్ దొరకకపోవడమే అని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనికి తోడు మరో పెద్ద చిక్కు వచ్చి పడింది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో ఓటీటీ బిజినెస్ క్లోజ్ కావడం ఈ ప్రాజెక్ట్‌కు అత్యంత కీలకంగా మారింది.

గత చిత్రాల ఫలితాల కారణంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ భారీ మొత్తాన్ని ఆఫర్ చేయడానికి వెనకాడుతున్నట్లు ఇన్సైడ్ టాక్. ఓటీటీ డీల్ ఒక కొలిక్కి వస్తే తప్ప థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసే పరిస్థితి లేదని సమాచారం. ఈ ఫైనాన్షియల్ అండ్ బిజినెస్ టార్గెట్‌ను పూరీ టీమ్ ఎప్పుడు రీచ్ అవుతుందో వేచి చూడాల్సిందే. కంటెంట్ పరంగా చూస్తే సినిమాపై పాజిటివ్ సంకేతాలు ఉన్నాయి.

ఇప్పటికే విడుదలైన విజయ్ సేతుపతి, టబు, జరీనా వాహబ్ పాత్రలకు సంబంధించిన టీజర్స్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించాయి. సినిమా రా అండ్ ఎమోషనల్‌గా ఉండబోతోందన్న వైబ్ క్రియేట్ అయ్యింది. అయితే, కేవలం టీజర్ల ద్వారా వచ్చిన ఆ ప్రామిసింగ్ వైబ్ సినిమా రిలీజ్ బిజినెస్‌కు, మార్కెటింగ్‌కు ఎంతవరకు మైలేజ్ ఇస్తుంది? డిజిటల్ పార్ట్‌నర్స్ ముందుకు రావడానికి ఇది సరిపోతుందా? అనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

Updated Date - Sep 30 , 2026 | 11:33 AM