నాగార్జున: రాజమౌళి సినిమాకు 'నో'.. కారణం అదేనా
ABN, Publish Date - Mar 10 , 2026 | 03:59 PM
దర్శకధీర రాజమౌళి చిత్రంలో నటించడానికి యంగ్ హీరోస్ తో పాటు సీనియర్ స్టార్స్ సైతం ఆసక్తి కనబరుస్తారు. అయితే 'వారణాసి'లో ఓ కీ రోల్ ను నాగార్జునకు ఆఫర్ చేసినా - ఆయన 'నో' చెప్పినట్టు తెలుస్తోంది
దర్శకధీర రాజమౌళి చిత్రంలో నటించడానికి యంగ్ హీరోస్ తో పాటు సీనియర్ స్టార్స్ సైతం ఆసక్తి కనబరుస్తారు. అయితే 'వారణాసి'లో ఓ కీ రోల్ ను నాగార్జునకు ఆఫర్ చేసినా - ఆయన 'నో' చెప్పినట్టు తెలుస్తోంది... ఎందుకలాగా...!
ప్రస్తుతం ఆల్ ఇండియాలోని మూవీ లవర్స్ ను విశేషంగా ఆకర్షిస్తోన్న ప్రాజెక్ట్ ఏది అంటే రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు నటిస్తోన్న 'వారణాసి' అనే చెప్పాలి. ఈ మూవీకి ముందు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సిరీస్, ' ఆర్ఆర్ఆర్' చేసిన మ్యాజిక్ కారణంగానే 'వారణాసి'కి కూడా దేశవ్యాప్తంగానే కాదు ప్రవాస భారతీయులు ఉన్న దేశాల్లోనూ క్రేజ్ నెలకొంది. 2027 ఏప్రిల్ 7వ తేదీన 'వారణాసి' సినిమా జనం ముందుకు రానుంది. ఆ తేదీ ఎప్పుడు వస్తుందా అని సినీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతటి క్రేజ్ ఉన్న మూవీలో నాగార్జునను ఓ పాత్రలో నటించమని రాజమౌళి అడిగినా 'నో' చెప్పారని ఇప్పుడు తెలుస్తోంది. రజనీకాంత్ 'కూలీ' సినిమాలో నాగార్జున విలన్ గా నటించారు. ఈ సినిమా కమిట్ కాగానే రాజమౌళికి తమ 'వారణాసి'లోనూ నాగ్ ను ప్రతినాయక పాత్రలో చూపించాలన్న ఆలోచన కలిగిందట. ఇదే విషయాన్ని నాగార్జునతోనే ముచ్చటించగా అందుకు నాగ్ 'నో' చెప్పారని విశేషంగా వినిపిస్తోంది.
అసలు కారణం... !
'వారణాసి'లో ప్రస్తుతం మళయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషిస్తోన్న విలన్ పాత్రనే ముందుగా నాగార్జునతో ధరింప చేయాలని రాజమౌళి భావించారట. అయితే 'వారణాసి'లో విలన్ పాత్ర తల మినహా మొత్తం బాడీ పనిచేయని స్థితిలో ఉంటుందట. కేవలం కనుసైగలతో తన మనుషులకు ఆర్డర్స్ వేస్తూ 'వారణాసి' విలన్ పాత్ర సాగుతుందని తెలుస్తోంది. అలాంటి పాత్రను గతంలో 'ఊపిరి'లో పోషించారు నాగార్జున. అందువల్లే 'వారణాసి'లోని కీలక పాత్ర తన దరికి చేరినా, అందులో తనకు కొత్తదనం కనిపించక పోవడంతో నాగార్జున 'నో' చెప్పారని సమాచారం. అదీగాక తన 100వ చిత్రంపై నాగ్ కాన్సంట్రేట్ చేయడానికి కూడా సమయం కేటాయించారు. ఈ కోణంలోనూ 'వారణాసి'లో నటించలేనని నాగ్ చెప్పినట్టు తెలుస్తోంది.
తప్పకుండా ఓ రోజు...
టాలీవుడ్ సీనియర్ స్టార్స్ లో చిరంజీవి 150 చిత్రాలకు పైగా నటించారు. బాలకృష్ణ 100 సినిమాలు దాటి ముందుకు సాగుతున్నారు. ఆ స్టార్స్ ఇద్దరూ తమ మైల్ స్టోన్ మూవీస్ తో ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకున్నారు. అదే తీరున తానూ తన వందో చిత్రం 'లాటరీ కింగ్'తో మురిపించాలని నాగ్ ఆశిస్తున్నారు. ఈ చిత్రానికి తమిళ డైరెక్టర్ రా.కార్తిక్ దర్శకత్వం వహిస్తున్నారు. 'లాటరీ కింగ్' చిత్రాన్ని దసరా బరిలో నిలపాలని నాగార్జున ఆశిస్తున్నారు. అందువల్ల రాజమౌళి అడిగిన డేట్స్ కూడా నాగార్జున అడ్జెస్ట్ చేయడానికి కష్టమై ఉంటుందని, అందువల్లే 'వారణాసి'లో నటించడానికి 'నో' చెప్పి ఉంటారనీ ఫ్యాన్స్ భావిస్తున్నారు. గతంలో రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో 'రాజన్న' చిత్రాన్ని నటించి, నిర్మించారు నాగార్జున. ఆ సినిమాలో ఓ యాక్షన్ సీక్వెన్స్ ను రాజమౌళి రూపొందించారనీ అంటారు. అలా రాజమౌళితో బాండింగ్ ఉన్న నాగార్జున రాబోయే రోజుల్లో తప్పకుండా జక్కన్న డైరెక్షన్ లో ఓ స్పెషల్ రోల్ చేస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి రాజమౌళి 'వారణాసి'ని కాదని 'లాటరీ కింగ్'గా రాబోతున్న నాగార్జునకు ఎలాంటి విజయం దక్కుతుందో చూడాలి.