సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

తమిళం, హిందీ పాటలకు అవార్డుల పంట.. నాటి నుంచి నేటి వ‌ర‌కు తెలుగు పాటలపై ఎందుకీ నిర్లక్ష్యం?

ABN, Publish Date - Nov 22 , 2026 | 09:36 AM

శ్రీశ్రీ, దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆత్రేయ, ఆరుద్ర, సినారె, వేటూరి, సిరివెన్నెల వంటి మహా గేయరచయితలు ఎన్నో అద్భుతమైన పాటలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. కానీ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు సినీ గీతాలకు తగిన గుర్తింపు లభించిందా? ఇతర భాషల గేయరచయితలతో పోలిస్తే తెలుగుకు ఎందుకు తక్కువ పురస్కారాలు దక్కాయి? డా. పైడిపాల ప్రత్యేక విశ్లేషణ.

Telugu Lyricists

సినిమా పాట నేడు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం కలిగిన ఏకైక కళారూపం, మొదటి తెలుగు సినిమా పాట (భక్త ప్రహ్లాద-1932) నూరేళ్లకు చేరువలో ఉన్న ఈ తరుణంలోనైనా తెలుగు సినిమా పాట (Telugu Songs) కు జాతీయ స్థాయిలో లభించిన గుర్తింపు గురించి సమీక్షించుకోవడం అవసరం. ఉత్తమ చలనచిత్ర గీతానికి జాతీయ పురస్కారాన్ని(National Film Awards) ప్రకటించడం 1969లో ఆరంభమైంది. ప్రథమ తాంబూలాన్ని తమిళ కవి కణ్ణదాసన్ (కుళనైక్కాగ-1968) అందుకున్నారు. నాటి నుంచి 1975 వరకూ పలువురు కవులు (Telugu Lyricists) జాతీయ అవార్డులు పొందారు. కానీ 1975 నుంచి 1983 వరకు ఎందువల్లనో చలనచిత్ర గీతానికి జాతీయ పురస్కారాలను ఇవ్వలేదు..

తెలుగు సినిమా పాటకు జాతీయ పురస్కారంతో శ్రీకారం చుట్టింది మహా కవి శ్రీశ్రీ (Sri Sri) ఆయన 'అల్లూరి సీతారామరాజు' (1974) చిత్రం కోసం రాసిన 'తెలుగు వీర లేవరా, దీక్షబూని సాగరా' అనే ప్రబోధాత్మక గీతానికి ఈ పురస్కారం లభించింది. తర్వాత వేటూరి (Veturi) 'మాతృదేవోభవ' (1993) చిత్రానికి రాసిన రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే!.' అనే పాటకు, సుద్దాల అశోక్ తేజ ఠాగూర్ (2003) చిత్రానికి 'నేను సైతం ప్రపంచాగ్నికి సమిద నొక్కటి ఆహుతిచ్చాను. అనే పాటకు పురస్కారాలు అందుకున్నారు. దాదాపు రెండు దశాబ్దాల విరామం తర్వాత ఇటీవల చంద్రబోస్ రాసిన కొండపొలం' (2021) చిత్రంలోని పచ్చపచ్చ సెట్టు సేమ పట్టు సీరెలంటా', కాసర్ల శ్యామ్ కలం నుంచి వెలువడిన 'బలగం' (2023) సినిమాలోని 'ఊరు పల్లెటూరు, దీని తీరే అమ్మ తీరు' అనే గీతాలకు జాతీయ పురస్కారాలు దక్కాయి. ఇప్పటికి ఐదుగురు తెలుగు కవులకు ఒక్కొక్కరికి ఒక పాట చొప్పున మాత్రమే పురస్కారాలు లభించడం తెలుగు పట్ల నిర్ణేతలకు ఉన్న చిన్నచూపును తెలియజేస్తోంది.

కృష్ణదేవరాయల నుంచి కృష్ణశాస్త్రి వరకు 'దేశ భాషలందు లెస్సగా, 'చెక్కెర మాటల మూటగా' ప్రశంసింపబడిన తెలుగు వెలుగు ఇంతేనా? సినిమా పాటకిచ్చే జాతీయ పురస్కారం తమిళ కవి వైరముత్తుకు ఏడుసార్లు, హిందీ కవి జావేద్ అక్తరు ఐదు సార్లు రాగా, తెలుగులో ఒక్కరికైనా కనీసం రెండవసారి ద‌క్కకపోవడం ఎంత దౌర్భాగ్యం? బాలీవుడ్ తర్వాత సినీరంగంలో అగ్రస్థానంలో ఉన్న టాలీవుడ్‌లో ఇతర భాషలకు దీటుగా ఉత్తమ సినీ గీతాలను రాయగలిగిన ప్రతిభామూర్తులు లేరా? లేక పురస్కార న్యాయ నిర్ణేతలకు తెలుగు సాహిత్య సౌందర్యాన్ని ఆస్వాదించే సామర్థ్యం లేదా? దక్షిణ భారత చలనచిత్ర రంగాలలో 1950-60 దశాబ్దాలలో తెలుగు సినిమాలు, పాటలు అత్యున్నత ప్రమాణాలతో ఇతర భాషలకు ఆదర్శప్రాయమయ్యాయి. మల్లాది రామకృష్ణశాస్త్రి సీనియర్ సముద్రాల, పింగళి, కొసరాజు వంటి దిగ్గజాలు అజరామర చలనచిత్ర గీతాలను రచించి చిత్ర పరిశ్రమను సుసంపన్నం చేశారు. అప్పటికి జాతీయ పురస్కారాలు లేకపోయినా వారు చరిత్రలో చెరగని స్థానాలతో నిలిచారు. కానీ జాతీయ పురస్కారాలను ప్రారంభించిన తర్వాత విడుదలైన తెలుగు చిత్రాలలోని అనర్ఘ‌రత్నాల్లాంటి పాటలకు అ గౌరవం ఎందుకు దక్కలేదో సోదాహరణంగా ప్రశ్నిద్దాం.

మహాకవి శ్రీశ్రీ 'ఆంధ్రా షెల్లీ'గా ప్రశంసించిన, 'మల్లీశ్వరి' చిత్రగీతాలతో సినిమా పాటకు కావ్య గౌరవం తెచ్చిన దేవులపల్లి కృష్ణశాస్త్రి (Devulapalli Krishnasastri) కి ఒక్క పురస్కారమూ దక్కలేదు. అవార్డులు రద్దయిన సంవత్సరాలలో వచ్చిన 'పాడనా తెలుగు పాట' (1976), 'మావి చిగురు తినగానే' (1978) వంటి రసగుళికలను పక్కన పెట్టినా, 'ప్రతిరాత్రి వసంతరాత్రి, ప్రతిగాలి పైరగాలి' (ఏకవీర-1969), 'ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది' (సంపూర్ణ రామాయణం- 1972), 'నేలతో నీడ అన్నది నను తాకరాదని' (మంచి రోజులు వచ్చాయి-1972) వంటి అద్భుత గీతాలు ఆ పెద్దలకు అర్హమైనవిగా కనిపించలేదా? కలకానిది. విలువైనది.." అంటూ బ్రతుకు విలువను తెలియజేసిన యుగకర్త శ్రీశ్రీకి 'తెలుగు వీర లేవరా' (1974) తప్ప మరో పురస్కారం అందుకునే అర్హత లేదా? ఆయన జాతీయ పురస్కారం అమలులో ఉన్న కాలంలో రాసిన 'మహాత్ముడే కలలు గన్న మరో ప్రపంచం' (మరో ప్రపంచం-1970), 'బంగరు పండిన భాగ్యం నిండిన మంగళ భారతదేశం' (దేశమంటే మనుషులోయ్-1970), 'అర్ధరాత్రి స్వతంత్రం అంధకార బంధురం' (నేటి భారతం-1983) వంటి దేశభక్తి గీతాలు కూడా ఈ అవార్డుకునోచుకోదగినవి కావా?

సమగ్ర ఆంధ్ర సాహిత్య చరిత్రను ఒంటి చేత్తో రచించిన ఋషి వంటి సినీ కవి ఆరుద్ర (Aarudra) కు ఒక్క జాతీయ బహుమానమే కాదు, నంది పురస్కారం కూడా ఇవ్వకపోవడం తెలుగు సాహిత్యానికే అవమానం. 'ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ' (ముత్యాల ముగ్గు-1974), 'శ్రీరస్తు శుభమస్తు' (పెళ్లి పుస్తకం-1991) వంటి మణిపూసల్లాంటి పాటలతో దాంపత్య జీవితానికి భాష్యం చెప్పిన ఆరుద్ర గీతాలు నిర్ణేతలను కదిలించలేదా? అతిచిన్న పదాలతో అనల్పార్థ రచన చేసిన సినీ వేమన, మనసు కవి ఆత్రేయ (Atreya) రాసిన అమూల్య రత్నాల్లాంటి గీతాలు జాతీయ పురస్కారాలు పొందిన ఏ పాటలకు తీసిపోతాయి? 'మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే' (ప్రేమనగర్-1971), 'ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో (జీవన తరంగాలు-1978) వంటి తాత్త్విక గీతాలు ఎంపిక చేసే పెద్దలకు వినపడలేదా?

జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత సినారె (C Narayana Reddy) రసరమ్య గీతాలు ఏ రసహృదయులను ఉన్మత్తులను చేయవు? 'చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన' (చెల్లెలి కాపురం-1971)లోని పదగుంఫనం, శబ్దార్ధ సౌందర్యం, 'వటపత్ర శాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి (స్వాతిముత్యం-1986) వంటి మధుర లాలి పాట ఏ పురస్కారాలకు తులతూగవు? తెలుగు సినీగేయ చరిత్రలో స్వరపద మైత్రి తెలిసి అవలీలగా రాసిన పద మాంత్రికుడు, జనగేయ శిరోమణి వేటూరి, శంకరాభరణం' (1980) పాటలకు 'జ్ఞానపీఠ్' వంటి ఉన్నత పురస్కారం ఇవ్వవచ్చని సాహితీవేత్తలు అభిప్రాయ పడ్డారు. కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి' (సితార-1984) వంటి అలంకార సమన్వితమైన సమ్మోహన గీతం, 'ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో (ప్రతిఘటన-1985) వంటి విప్లవ గీతాలను రాసిన సంచలన కవి వేటూరికి 'మాతృదేవోభవ'లోని ఒక్క పాటకు మాత్రమే పురస్కారం ఇచ్చి చేతులు దులుపుకోవడం భావ్యమా?

11 సార్లు నంది పురస్కారాలు, పద్మశ్రీ గౌరవం పొందిన సిరివెన్నెల‌ సీతారామ శాస్త్రి (Sirivennela)కి ఒక్కసారి కూడా జాతీయ పురస్కారం ఇవ్వకపోవడం దారుణం. 'చాలా ఆవార్డులు వచ్చేవి కావు, తెచ్చుకొనేవే' అనేది ఈ సందర్భంగా సత్యమేననిపిస్తుంది. ఆర్ష‌ ధర్మం, భారతీయ సంస్కృతి ధ్యేయాలుగా సినీ గేయ రచనను ఒక పవిత్ర యజ్ఞంలా భావించి రాసిన ఆయన కలం నుంచి జాలువారిన 'తెలవారదేమో. స్వామీ' (శ్రుతిలయలు-1987), 'తెలిమంచు కరిగింది' (స్వాతికిరణం-1992), 'ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి' (పట్టుదల-1902), 'చిలకా ఏ తోడు లేక (శుభలగ్నం-1994), 'ఆర్థ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా?" (సిందూరం-1987), 'ఏ శ్వాసలో చేరితే' (నేనున్నాను-2004), 'జగమంత కుటుంబం నాది' (చక్రం-2005) వంటి ఎన్నో గీతాలకు ఆ అర్హత లేదా?

తెలుగు సినిమా పాటకు జాతీయ స్థాయిలో తగిన స్థానం లభించలేదనే ఆవేదన తప్ప ఎవరినీ నిందించడం నా ఉద్దేశం కాదు. పురస్కార నిర్ణేతలు ఆదరాబాదరాగా ఎంపికలు చేయకుండా, సాహిత్య విలువలతో కూడిన పాటలను గుర్తించాలి. గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన 'నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది' (ముత్యాల ముగ్గు-1975) వంటి మరెన్నో ఆణిముత్యాలను విస్మ రించడం బాధాకరం. రాబోయే సంవత్సరాలలోనైనా తెలుగు సినిమా పాటకు జాతీయ స్థాయిలో తగిన గుర్తింపు లభిస్తుందని ఆశిద్దాం!

- డా. పైడిపాల

Updated Date - Nov 22 , 2026 | 10:19 AM