సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Balakrishna: అప్పుడు, ఇప్పుడు బాల‌కృష్ణ‌కు.. తెలంగాణలో తీర‌ని అన్యాయం

ABN, Publish Date - Oct 19 , 2026 | 04:29 PM

నందమూరి బాలకృష్ణకు అవార్డులు, ఇంటి స్థలం పరిహారం విషయంలో తొలి నుంచి అన్యాయం జరిగుతున్న‌దని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Nandamuri Balakrishna

ప్రఖ్యాత తెలుగు నటుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) పెరిగింది - చదువుకున్నది- ప్రస్తుతం ఉంటున్నది అంతా హైదరాబాద్ (Hyderabad) లోనే. మొదటి నుంచీ తెలంగాణ (Telangana) సంస్కృతీ సంప్రదాయాలను బాలకృష్ణ గౌరవిస్తూనే వస్తున్నారు. అయితే ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా బాలయ్యకు అన్యాయం జరుగుతూనే ఉందని ఆయన అభిమానులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. విషయానికి వస్తే బాలకృష్ణ నివాసం ఉంటున్న జూబ్లీ హిల్స్ (Jubilee Hills) రోడ్ నంబర్ 45లోని ఇంటి స్థలంలో 865 గజాలను రోడ్ వైడెనింగ్'లో భాగంగా ప్రభుత్వ రేటు ప్రకారం ఇచ్చివేశారు. వాస్తవానికి ఆ ప్రాంతంలో అందునా బాలకృష్ణ నివాసం ప్రధాన రహదారిపై ఉన్న కారణంగా గజం రూ.5 లక్షల నుంచి ఆరు లక్షల పలుకుతోందట. కానీ, ప్రభుత్వం నష్టపరిహారం కింద బాలయ్యకు ఇచ్చినది అసలు ధరలో నాలుగో వంతు కూడా లేదని వినిపిస్తోంది. ఈ రూపేణా ఆయనకు ఓ పది కోట్ల లోపు నష్టపరిహారం దక్కనుందని తెలుస్తోంది. గజం రూ. 5 - 6 లక్షల చొప్పున 825 గజాల ధర ఎంత పలుకుతుందో ఊహించవచ్చు.

తనకు ప్రప్రథమ గద్దర్ ఫిలిమ్ అవార్డ్స్ (Gaddar Awards) లోనే తన తండ్రి మహానటుడు, మహానాయకుడు నటరత్న యన్టీఆర్ పేరిట ఏర్పాటు చేసిన అవార్డును ప్రదానం చేసినందుకే బాలయ్య ఎంతగానో ఆనందించారు. బాలయ్య మాత్రం తెలంగాణలో ఏ ప్రభుత్వం ఉన్నా తన వంతు సహాయసహకారాలు అందిస్తున్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం 'అఖండ-2' సినిమాతో బాలయ్యకు దక్కవలసిన ఉత్తమ నటుడు అవార్డులో అన్యాయం చేసిందని అభిమానులు గుర్తు చేస్తున్నారు. ద్వితీయ గద్దర్ చలనచిత్ర అవార్డుల ఎంపికలో బాలయ్యకు ఉత్తమ నటుడు విభాగంలో అఖండ-2 (Akhanda 2) సినిమాకు న్యాయనిర్ణేతల్లో అత్యధిక సంఖ్యాకులు ఓటు వేశారు. న్యాయనిర్ణేతలు తయారు చేసిన జాబితాలోనూ ఉత్తమ నటునిగా బాలకృష్ణ పేరే ఉందట. అయితే ప్రభుత్వ నిర్ణయం అంటూ చివరి నిమిషంలో వేరే నటుని పేరును జోడించి, న్యాయనిర్ణేతలతో సంతకాలు తీసుకోవడం విచారకరం అంటున్నారు అభిమానులు.

తెలంగాణలోని కామారెడ్డి ప్రాంతంలో 2025లో సంభవించిన వరదల వల్ల భారీ నష్టం వాటిల్లింది. ఆ సమయంలో బాలకృష్ణ తన వంతుగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఆ విపత్తు సమయంలో విరాళమిచ్చిన ఏకైక నటుడు బాలకృష్ణ మాత్రమే. దానిని కూడా గుర్తుంచుకోకుండా బాలయ్యకు ఉత్తమనటుని విభాగంలో తెలంగాణ ప్రభుత్వం అన్యాయం చేసిందని అభిమానులు భావిస్తున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ బాలయ్యకు 'భైరవద్వీపం'లో ఉత్తమ నటునిగా ఎన్నిక కావలసి ఉన్నా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బాలయ్య వేరే పార్టీకి చెందిన వారని అవార్డు రాకుండా చేసిందని ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

'శ్రీరామరాజ్యం' సమయంలోనూ బాలయ్యను ఉత్తమ నటునిగా ఎంపిక చేయాలని అవార్డుల జ్యూరీ నిర్ణయించినా, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కమర్షియల్ మూవీలో నటించిన హీరోకు బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డును మార్పించడమూ బాధకరమేనని అభిమానులు అంటున్నారు. ఇలా కాంగ్రెస్ హయాములో పలుమార్లు బాలయ్యకు అన్యాయం జరిగిందని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అదే తీరున ప్రవర్తిస్తోందని, తమ హీరో మాత్రం ఎప్పటిలాగే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు పెదవి విప్పుతారో లేదో చూడాలి.

Updated Date - Oct 19 , 2026 | 05:09 PM