అభివృద్ధి చెందిన దేశాల్లో సింగర్స్ కూ రాయల్టీ
ABN, Publish Date - Feb 28 , 2026 | 07:16 PM
క్రియేటర్ కన్నా ఆ క్రియేటివిటీని సొమ్మిచ్చి కొన్నవారికి ఎక్కువ లాభం చేకూరుతోంది. ముఖ్యంగా పాటల విషయంలో 'రాయల్టీ' అన్న అంశం మన దేశంలో ఈ నాటికీ చర్చలకు తావిస్తూనే ఉంది... మరి సొల్యూషన్ ఏంటి?
క్రియేటర్ కన్నా ఆ క్రియేటివిటీని సొమ్మిచ్చి కొన్నవారికి ఎక్కువ లాభం చేకూరుతోంది. ముఖ్యంగా పాటల విషయంలో 'రాయల్టీ' అన్న అంశం మన దేశంలో ఈ నాటికీ చర్చలకు తావిస్తూనే ఉంది... మరి సొల్యూషన్ ఏంటి?(Indian music industry royalties)
సవరణ ఉన్నా... లాభం సున్నా...
మన దేశంలో ఎప్పటి నుంచో గీత రచయితలు, సంగీత దర్శకులు, గాయనీగాయకులు తమ పాటలకు వచ్చే రాయల్టీలో తమకూ వాటా ఇవ్వాలని పోరాడుతూ ఉన్నారు... చిత్రమేమిటంటే ఓ పాట రూపొందడానికి వీరందరూ తప్పనిసరిగా కావలసినవారే! - అయితే పాట పూర్తయి వెలుగు చూశాక, ఆ పాటపై ఆడియో రైట్స్ కొందరికి, వీడియో హక్కులు మరికొందరికి అమ్మేస్తారు నిర్మాతలు. పలు మాధ్యమాల్లో ఆ పాట సాగితే, దానిపై వచ్చే ఆదాయంలో నిర్మాతకూ వాటా ఉంటుంది. అంటే రాయల్టీ లభిస్తుంది. కానీ, పాట రూపకల్పనకు అసలు కారకులైన గీతరచయితలు, సంగీతదర్శకులు, గాయనీగాయకులకు ఏ మాత్రం 'రాయల్టీ'లో వాటా లభించేది కాదు. దీనిపై ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేశారు కొందరు పాటల రచయితలు, సంగీతదర్శకులు. 2012లో కాపీరైట్ యాక్ట్ 1957లో ఓ సవరణ చోటు చేసుకుంది. తద్వారా గీత రచయితలు, సంగీత దర్శకులకు కూడా 'రాయల్టీ'లో వాటా దక్కుతోంది... కానీ, గాయనీగాయకులకు కూడా ఈ విధానం వర్తింప చేయాలని లతా మంగేష్కర్ వంటి మేటి గాయనీమణులు ఎన్నో ఏళ్ళుగా పోరాడారు. ఇప్పటి దాకా సింగర్స్ కు రాయల్టీ లభించక పోవడం విచారకరం...
అది గమనార్హం...
రాయల్టీ విషయంలో గాయనీగాయకులు మోసపోతున్నారనే చాలా ఏళ్ళుగా వినిపిస్తోంది... అయితే కళలను ఎంతగానో గౌరవించే అభివృద్ధి చెందిన దేశాల్లో గీత రచయితలు, సంగీత దర్శకులతో పాటు సింగర్స్ కు కూడా 'రాయల్టీ' లభిస్తోంది. బ్రిటిష్- ఇండియన్ కంపోజర్ బిడ్డు కేవలం రెండు పాటల ద్వారానే నెలకు 80 లక్షల రూపాయల రాయల్టీ అందుకుంటున్నారని సమాచారం. ఇక టాప్ సింగర్స్, కంపోజర్స్ కు ఎంత రాయల్టీ దక్కుతుందో ఊహించలేం. ఆ లెక్కలు చూసిన మన దేశంలోని ప్రముఖ గాయనీ గాయకుల్లో మళ్ళీ తమకు అన్యాయం జరుగుతోంది అన్న భావన కలుగుతోంది. వాస్తవానికి 2012లో కాపీరైట్ యాక్ట్ 1957లో చోటు చేసుకున్న అమెండ్ మెంట్ కారణంగా సింగర్స్ కూ రాయల్టీ లభించాలి. కానీ, ఇప్పటి దాకా అది కార్యరూపం దాల్చక పోవడం గమనార్హం !
భయంతోనే వెనుకడుగు...
కాపీరైట్ యాక్ట్ లో చోటు చేసుకున్న సవరణతో లేబుల్ ఉన్న సంస్థలు, నిర్మాణ సంస్థతో పాటు గీత రచయితలు, సంగీత దర్శకులకు రాయల్టీ షేర్ దక్కుతోంది. సింగర్స్ కు మాత్రం ఇప్పటి దాకా రాయల్టీలో వాటా దక్కింది లేదు. కొందరు సంగీత దర్శకులు తమ ట్యూన్స్ లోనే పాటలు పాడిన గాయనీగాయకులు ఎక్కడైనా ఆ పాటలు పాడినా కేసులు పెడుతూ ఉన్నారు. ఇలా ఎటు చూసినా గాయనీ గాయకులకే అన్యాయం జరుగుతోంది. దీనిని ఎదిరిస్తే తమకు అవకాశాలు పోతాయేమో అన్న భయంతోనూ ఈ నాటి సింగర్స్ 'రాయల్టీ' గురించి పట్టించుకోవడం లేదు. వచ్చిందే చాలు అనుకుంటూ తమకు లభించిన పారితోషికంతోనే సంతృప్తి చెందుతున్నారు... సింగర్స్ కూ రాయల్టీ దక్కాలని పోరాటం చేసేవారెవరు వస్తారో?... వారికి రాయల్టీలో న్యాయం ఎప్పుడు జరుగుతుందో చూడాలి...