ఎన్టీఆర్ కొత్త బ్యానర్.. అన్న కళ్యాణ్ రామ్ తో విభేదాలా
ABN, Publish Date - Aug 19 , 2026 | 02:45 PM
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నుంచి ఓ అదిరిపోయే సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పటివరకు వెండితెరపై నటనతో విశ్వరూపం చూపించిన తారక్..
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నుంచి ఓ అదిరిపోయే సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పటివరకు వెండితెరపై నటనతో విశ్వరూపం చూపించిన తారక్.. ఇప్పుడు ఇండస్ట్రీలో మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త అవతారం ఎత్తబోతున్నాడు. నటుడిగానే కాకుండా.. బిగ్ స్క్రీన్‌పై సరికొత్త కంటెంట్‌ను అందించేందుకు ఒక పవర్‌ఫుల్ నిర్మాతగా మారబోతున్నాడు. అవును, తారక్ సొంతంగా ఒక భారీ ప్రొడక్షన్ హౌస్‌ను లాంచ్ చేయబోతున్నారనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాకుండా యావత్ సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
గ్లోబల్ స్థాయిలో తనకంటూ తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న తారక్.. ప్రస్తుతం వరుసగా భారీ పాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటివరకు హీరోగానే కాకుండా కొన్ని ప్రతిష్టాత్మక చిత్రాల్లో ప్రత్యేక పాత్రల్లో కూడా కనిపించి మెప్పించాడు. అయితే, ఎప్పుడూ ఒకే దారిలో కాకుండా ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేయడానికి ఇష్టపడే తారక్.. ఇప్పుడు సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టేందుకు బలమైన స్కెచ్ వేశాడు. తన ఆలోచనలకు రూపమిస్తూ సరికొత్త కథలను, భారీ ప్రాజెక్టులను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతోనే ఈ ముందడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రొడక్షన్ హౌస్‌కు పెట్టిన పేరు ఇప్పుడు అందరి దృష్టినీ విపరీతంగా ఆకర్షిస్తోంది. తన పేరులోని వైబ్రేషన్‌తో పాటు అసలైన వినోదాన్ని కలిపి 'NTRTAIN' (ఎంటర్‌టైన్) అనే క్రేజీ టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. పేరులోనే పూర్తి వినోదం దాగి ఉండటంతో.. ఈ బ్యానర్ నుంచి వచ్చే సినిమాలు ఏ రేంజ్‌లో ఉంటాయోనని ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
ఇప్పటికే మన టాలీవుడ్‌లో పలువురు అగ్ర హీరోలు సొంత బ్యానర్లు స్థాపించి భారీ విజయాలను అందుకుంటున్నారు. అదే బాటలో తారక్ కూడా అడుగులు వేస్తూ.. కేవలం తన సినిమాలే కాకుండా, వినూత్నమైన కథలతో వచ్చే ఇతర హీరోల ప్రాజెక్టులను, క్రేజీ కాంబినేషన్లను ఈ బ్యానర్ ద్వారా నిర్మించే ప్లాన్‌లో ఉన్నట్లు ఫిలింనగర్ టాక్. ఇక ఈ బ్యానర్ పూర్తి బాధ్యతలు భార్య లక్ష్మీ ప్రణతికి అప్పగించనున్నాడని టాక్. నిజానికి ఇప్పటివరకు ఎన్టీఆర్ సినిమాలు ఎక్కువగా అన్న నందమూరి కళ్యాణ్ రామ్‌కు చెందిన నందమూరి తారకరామ ఆర్ట్స్ బ్యానర్‌లోనే రూపుదిద్దుకుంటూ వచ్చాయి. ఎన్టీఆర్ కెరీర్‌లోని ఎన్నో బ్లాక్‌బస్టర్స్ ఆ బ్యానర్‌లోనే వచ్చాయి. అయితే ఇప్పుడు రూటు మార్చి తారక్ స్వయంగా కొత్త బ్యానర్ 'NTRTAIN' (ఎంటర్‌టైన్) అనౌన్స్ చేయనుండటంపై నందమూరి అభిమానుల్లో రకరకాల చర్చలు నడుస్తున్నాయి.
నందమూరి హరికృష్ణ మరణం తరువాత ఎన్టీఆర్- కళ్యాణ్ రామ్ అన్నదమ్ముల కన్నా ఎక్కువగా మెలిగారు. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ అయితే.. తారక్ ని నాన్న.. నాన్న అని పిలుస్తూ తండ్రిస్థానంలో నిలబెట్టాడు. ఎక్కడకి వెళ్ళినా ఇద్దరు అన్నదమ్ములు కలిసే వెళ్ళేవారు. ఇక ఇప్పుడు తారక్ కొత్త కుంపటి పెడుతుండడంతో ఈ అన్నదమ్ముల మధ్య ఏమైనా విభేదాలు తలెత్తేయా అనే అనుమానం ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఇక కొంతమంది ఫ్యాన్స్ ఈ నిర్ణయంతో ఆశ్చర్యానికి గురైనా.. గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ మరింత వేగంగా, విస్తృతంగా కంటెంట్‌ను ప్రపంచానికి అందించేందుకే తారక్ NTRTAIN (ఎంటర్‌టైన్) ప్రొడక్షన్ హౌస్‌ను తీసుకొస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇప్పుడు వేరువేరుగా ఉన్నా భవిష్యత్తులో ఈ రెండు బ్యానర్లు కలిసి భారీ కొలాబరేషన్స్ చేసే అవకాశాలు కూడా మెండుగా ఉండొచ్చు అనేది కొందరి మాట. ఏదేమైనా, వెండితెరపై తన నటనతో కోట్లాది మందిని అలరిస్తున్న తారక్.. నిర్మాతగా ఎలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తారో చూడాలి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే ఒక అదిరిపోయే గ్రాండ్ ఈవెంట్ ద్వారా వెలువడనుందని సమాచారం.