జానకి పాట విని స్టేజ్ పైనే దీవించిన పి. సుశీల తండ్రి..
ABN, Publish Date - Jul 11 , 2026 | 09:35 PM
ఇవాళంటే టీవీలో వచ్చే కార్యక్రమాలలో పాటలు పాడేసి చాలామంది సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంటారు. కొంతమంది చిన్న వయసులోనే సరిగమలు నేర్చుకుంటున్నారు. అయితే జానకి తరంలో మాత్రం ఎంతో కఠోరశ్రమ చేస్తే తప్పితే సినిమాల్లో అవకాశాలు వచ్చేవి కాదు.
ఇవాళంటే టీవీలో వచ్చే కార్యక్రమాలలో పాటలు పాడేసి చాలామంది సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంటారు. కొంతమంది చిన్న వయసులోనే సరిగమలు నేర్చుకుంటున్నారు. అయితే జానకి తరంలో మాత్రం ఎంతో కఠోరశ్రమ చేస్తే తప్పితే సినిమాల్లో అవకాశాలు వచ్చేవి కాదు. జానకి (S.Janaki) సుదీర్ఘకాలం సినిమాల్లో గాయనిగా రాణించడానికి బలమైన పునాది స్టేజ్ షో మీద జరిగింది. ఆమె పిన్న వయసులోనే ఎన్నో కచేరీలలో పాటలు పాడారు. ఆ రోజుల్ని తలుచుకుంటూ జానకి ఒకసారి ఇలా తెలిపారు. 'అప్పట్లో రాజమండ్రిలో 'క్రాంతి కళా మండలి' అని ఓ కల్చరల్ యూత్ అసోసియేషన్ వుండేది. దాని నిర్వాహకులు వి.రామచంద్రరావు గారు (సినీ దర్శకులు). ఈ అసోసియేషన్ తరపున సినిమా పాటల కచ్చేరీల్లో నేను పాడేదాన్ని. కాలేజీ ప్రోగ్రామ్స్ తెలుగు, హిందీ రెండు భాషల్లోనూ పాటలు పాడేదాన్ని. నేను పాడుతుంటే అందరూ రికార్డ్స్ వేశారని అనుకునేవారట. కె.ఎల్.నరసింహారావు, పంపన సూర్యనారాయణగార్లు అప్పట్లో నాతో కలిసి పాడేవారు. మా మ్యూజిక్ ప్రోగ్రామ్ కు చాలా ఎక్కువమంది ప్రేక్షకులు వచ్చేవారు.
నాకెందుకో గానీ చిన్నప్పటి నుంచీ కూడా భయమనేది వుండేది కాదు. ఎంతమంది ముందరైనా బిడియం, భయం లేకుండా పాడేసేదాన్ని. అప్పుడే రాయలసీమ కరువు బాధితులకు సహాయం చేయడం కోసం మ్యూజిక్ ప్రోగ్రామ్స్ కండెక్టు చేసి విరాళాలు సేకరించారు. నేను ఆ బృందంతో కలసి వెళ్లేదాన్ని. ఆ 'క్రాంతి కళామండలి' లోనే ఓ డాన్స్ ట్రూపు కూడా వుండేది. వాళ్ల ప్రదర్శనలకి నేను ప్లేబాక్ పాడేదాన్ని. అలా మ్యూజిక్ ప్రోగ్రాంలకు వెళ్లడం నా గాత్ర శుద్ధికి ఎంతో తోడ్పడింది. ఒకసారి విజయనగరంలో లైట్ మ్యూజిక్ కచేరీ చేస్తూ తెనాలి రామకృష్ణ చిత్రంలో పి.సుశీల గారు పాడిన 'చందన చర్చిత నీలకళేబర...' అన్న జయదేవుని అష్టపదిని పాడాను. శ్రోతల నుంచి మంచి స్పందన వచ్చింది. ఒక పెద్దాయన స్టేజి మీదికొచ్చి 'చాలా బాగా పాడావమ్మా. నీకు నా ఆశీస్సులు' అని దీవించి వెళ్లిపోయారు. ఆ తర్వాత వాకబు చేస్తే తెలిసింది ఆయన పి. సుశీల గారి తండ్రిగారేనని! ఆ సమయంలో నేను పొందిన ఆనందానికి అంతేలేదు. ఆ సమయంలోనే మా అమ్మ చనిపోవడంతో నేను మా అక్కయ్యల దగ్గరికి అంటే హైదరాబాద్ వచ్చేశాను.
అలా సాగుతున్న నా జీవితాన్ని ఫన్ డాక్టర్ చంద్రశేఖర్ గారు అంటే మా మామగారు ఒక మలుపు తిప్పారని చెప్పుకోవచ్చు. ఆయనతో చుట్టరికం కన్నా చనువు ఎక్కువగా ఉండేది. నెల్లూరు, హైదరాబాదులో ఈయన ప్రదర్శనలు ఇచ్చేవారు. స్టేజీ మీద రెండే రెండు నిముషాల్లో వేషాలు మార్చుకుని గాంధీ, నెహ్రూ, జాకీర్ హుస్సేన్లను అనుకరించేవారు. ఆయన మేకప్ మార్చుకునే రెండు నిముషాల గ్యాప్ లో నేను పాటలు పాడేదాన్ని. అలా ఆయన కారణంగానే ఆ తర్వాత నాకు సినిమాల్లో పాటలు పాడే ఛాన్స్ వచ్చింది. తమిళ, తెలుగు భాషల్లోనే కాదు... మలయాళంలో పాడిన మొదటి పాట కూడా శోక గీతమే. చివరకు ఏ.వి.ఎం. వారికి తొలిసారిగా సింహళంలో పాడిన పాట కూడా అలాంటి సందర్భంలోనిదే. కన్నడంలో మాత్రం హుషారైన పాట పాడాను. ఇక్కడ మరో తమాషా. నేను కన్నడ భాషలో మొదట హుషారు పాట పాడినా, ఆ చిత్రం విడుదలకంటే ముందే నేను ఏడుపు పాట పాడిన మరో చిత్రం విడుదలైంది. అలా అన్ని భాషల్లోనూ మొదట నేనన్నీ శోకగీతాలే పాడాను. ఏ భాషలో పాడినా నేటివిటీ ధ్వనించేలాగా పాడేదాన్ని. ఆ సామర్థ్యమే నన్ను అందరి అభిమానం చూరగొనేలా చేసింది. ఆ ఏడాదిలోనే ఆరు భాషల్లో సుమారు ఆరువందల పాటలు పాడాను'' అని జానకి తెలిపారు.