అసలు రెమ్యునరేషన్ ఎంత.. ఎలాంటి ప్రమోషనల్ కాంట్రాక్టులు ఉన్నాయి! నిధిపై ఈడీ ప్రశ్నల వర్షం
ABN, Publish Date - Aug 19 , 2026 | 04:34 PM
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఈడీ దూకుడు పెంచింది.. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను ప్రశ్నించిన ఈడీ.. తాజాగా నటి నిధి అగర్వాల్‌ను విచారించింది.. దాదాపు రెండు గంటల పాటు నిధి అగర్వాల్‌ను ప్రశ్నించిన అధికారులు.. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్, వాటి ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఆరా తీశారు..
ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారంలోఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను విచారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) తాజాగా నటి నిధి అగర్వాల్ (Nidhhi Agerwal)ను కూడా విచారించింది.. గతంలో ఓసారి ఆమెకు ఈడి అధికారులు నోటీసులు ఇవ్వగా షూటింగ్స్ లో ఉండటంతో మరో తేదీ కేటాయించాలని విజ్ఞప్తి చేశారు..ఆమె విజ్ఞాపన మేరకు ఇవాళ విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. దీంతో ఇవాళ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో నటి నిధి అగర్వాల్‌ను ఈడీ (ED Inquiry) ముందుకు వచ్చింది . ఈడీ సమన్లతో ఇవాళ ఉదయం పదకొండున్నర గంటలకు ఆమె ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.. తన బ్యాంక్ లావాదేవీల వివరాలతో ఈడి అధికారుల ముందు నిధి అగర్వాల్ విచారణకు హాజరయ్యారు.. సుమారు రెండు గంటల పాటు ఈడి అధికారులు నిధి అగర్వాల్ ను వివిధ అంశాలపై ప్రశ్నించారు..
ఈడి విచారణలో నిధి అగర్వాల్ ప్రమోట్ చేసిన బెట్టింగ్, గేమింగ్ యాప్స్ వివరాలను అధికారులు సేకరించారు.. ముఖ్యంగా ఆమె ప్రమోట్ చేసిన జీత్ విన్ బెట్టింగ్ యాప్ తో పాటు ఇతర బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ ప్రమోషన్స్‌పై ప్రశ్నలు సంధించినట్లు సమాచారం.. అసలు ఆయా యాప్స్‌తో నిధి అగర్వాల్‌కు ఎలాంటి ప్రమోషనల్ కాంట్రాక్టులు ఉన్నాయి..? ఒక్కో ప్రమోషన్‌కు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు..? యాప్ నిర్వాహకుల నుంచి నిధి అగర్వాల్ బ్యాంక్ అకౌంట్లలోకి ఎంత మొత్తం జమ అయింది..? ఆ డబ్బు ఏ ఖాతాల నుంచి వచ్చింది..? అనే కోణంలో ఈడీ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ద్వారా వచ్చిన డబ్బుకు సంబంధించిన బ్యాంక్ లావాదేవీల వివరాలను కూడా ఈడీ పరిశీలించినట్లు సమాచారం.. ప్రమోషనల్ కాంట్రాక్టులు, చెల్లింపులు, రెమ్యునరేషన్‌కు సంబంధించిన డాక్యుమెంట్లపై కూడా అధికారులు ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది.యాప్ నిర్వాహకుల నుంచి నిధి అగర్వాల్ ఖాతాలోకి జరిగిన డిపాజిట్లు, వాటి వెనుక ఉన్న లావాదేవీల వివరాలను కూడా అధికారులు సేకరించారు.. ఇదే కేసులో నిధి అగర్వాల్ గతంలో సీఐడీ విచారణను కూడా ఎదుర్కొన్నారు.. బెట్టింగ్ యాప్స్ వల్ల కలిగే అనర్థాలు పూర్తిగా తెలియకుండానే తాను వాటిని ప్రమోట్ చేశానని అప్పట్లో సీఐడీకి ఆమె వాంగ్మూలం ఇచ్చారు.
ఇదిలాఉంటే.. ఫణీంద్ర అనే ఓ వ్యక్తి ఇచ్చిన పిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు 2025లో బెట్టింగ్, గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై కేసు నమోదు చేశారు.. ఈ కేసులో పలువురు సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల పేర్లు వెలుగులోకి వచ్చాయి.. మొత్తం 25 మంది పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో నమోదయ్యాయి. ఈ కేసులో ఎంటర్ అయిన ఈడి ఇప్పటికే రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, అనన్య నాగళ్లతో పాటు పలువురిని విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు..ఇక ఈ కేసులో మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఈడీ సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడం ద్వారా పొందిన పారితోషికాలు, వాటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.. తాజాగా నిధి అగర్వాల్ విచారణతో.. ఈడీ దర్యాప్తు ఏ దిశగా సాగుతుందన్నది ఆసక్తికరంగా మారింది..