Akhil: ఏంటీ అయ్యగారికి.. భారత సిటిజన్ షిప్ లేదా?
ABN, Publish Date - Jul 25 , 2026 | 02:05 PM
అక్కినేని అఖిల్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పదేళ్లయిన తర్వాత 'లెనిన్' రూపంలో మొదటి ఘన విజయాన్ని అందుకున్నారు.
అక్కినేని అఖిల్ (Akhil Akkineni) సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పదేళ్లయిన తర్వాత 'లెనిన్' రూపంలో మొదటి ఘన విజయాన్ని అందుకున్నారు. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.88 కోట్లకు పైగా వసూలు చేసి అఖిల్ కెరీర్‌కు సరైన బ్రేక్ ఇచ్చింది. నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్సే కథానాయికగా నటించింది. ఈ సినిమా తెచ్చిపెట్టిన విజయంతో కొత్త ఉత్సాహంలో ఉన్న అఖిల్, ప్రమోషన్లలో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలలో తన కెరీర్ మరియు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
ఈ క్రమంలోనే తన పౌరసత్వం గురించి అఖిల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్‌లోనే పెరిగి, తెలుగు చిత్రసీమలోనే హీరోగా కొనసాగుతున్న అఖిల్ ఇప్పటికీ భారతీయ పౌరుడు కాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నాగార్జున (Nagarjuna Akkineni), అమల (Amala Akkineni) అమెరికాలో ఉన్న సమయంలో కాలిఫోర్నియాలోని శాన్ హోసే సిటీలో అఖిల్ జన్మించారు. అక్కడి చట్టాల ప్రకారం పుట్టుకతోనే ఆయనకు అమెరికన్ పౌరసత్వం, పాస్‌పోర్ట్ లభించాయి. దీంతో ఆయన దగ్గర ఇప్పటివరకు ఇండియన్ పాస్‌పోర్ట్ లేదనే నిజం వెలుగులోకి వచ్చింది.
పాస్‌పోర్ట్ విషయంపై అఖిల్ స్పందిస్తూ, "నాకు అమెరికన్ సిటిజన్‌షిప్ ఉన్నప్పటికీ నేను వంద శాతం భారతీయుడినే. ప్రస్తుతం నేను ఇండియన్ సిటిజన్‌గా మారే ప్రక్రియ కొనసాగుతోంది. మరికొన్ని నెలల్లో నాకు అధికారికంగా ఇండియన్ పాస్‌పోర్ట్ వస్తుంది" అని స్పష్టం చేశారు. మన దేశ చట్టాల ప్రకారం ఒక వ్యక్తికి ఒకేసారి రెండు దేశాల పౌరసత్వాలు ఉండేందుకు వీలులేదు. అందుకే భారతీయ పౌరుడిగా మారడం కోసం అఖిల్ తన అమెరికన్ పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు. పాస్‌పోర్ట్ మారినా, తన మనసంతా ఎప్పుడూ భారతదేశానిదేనని ఆయన చెప్పిన మాటలు అభిమానుల మనసులను గెలుచుకున్నాయి.
ఇక ఇదే ఇంటర్వ్యూలో అఖిల్ తన చిన్ననాటి మరొక సరదా సంఘటనను గుర్తు చేసుకుని అందరినీ నవ్వించారు. అమల గర్భవతిగా ఉన్న సమయంలో డాక్టర్లు అమ్మాయి పుడుతుందని చెప్పడంతో నాగార్జున ఎంతో ఆనందపడ్డారట. ముందుగానే 'నిఖిత' అనే పేరును సైతం ఖరారు చేసి, పాప కోసం ముద్దుగా ఉండే కొన్ని స్కర్ట్స్ కూడా కొనుగోలు చేశారట. తీరా తాను పుట్టాక అబ్బాయిని అని తెలిసి నాగార్జున షాక్ అయ్యారని, ఆయనకు కూతురు ఉండాలనే కోరిక అలా ఉండిపోయిందని అఖిల్ సరదాగా ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.